రైల్వే శాఖ మంత్రిని కలిసిన వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు | YSRCP MPs Meet Railway Minister Ashwini Vaishnav Over Railway zone | Sakshi
Sakshi News home page

రైల్వే శాఖ మంత్రిని కలిసిన వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు

Published Thu, Jul 29 2021 7:29 PM | Last Updated on Thu, Jul 29 2021 8:58 PM

YSRCP MPs Meet Railway Minister Ashwini Vaishnav Over Railway zone - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నం కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ కార్యకలాపాలను త్వరితగతిన ప్రారంభించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ సభ్యులు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు విజ్ఞప్తి చేశారు.ఎంపీ విజయసాయిరెడ్డి సారధ్యంలో పార్టీ ఎంపీలు గురువారం పార్లమెంట్‌ భవనంలోని కార్యాలయంలో రైల్వే మంత్రితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో వివిధ రైల్వే ప్రాజెక్ట్‌ల అమలును వేగవంతం చేయాలని కోరుతూ వారంతా సంతకం చేసిన వినతి పత్రాన్ని మంత్రికి అందచేశారు. భేటీలో ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పలు రైల్వే ప్రాజెక్ట్‌ల స్థితిగతులను మంత్రికి వివరించారు.

రెండేళ్ళయినా రైల్వే జోన్‌ పట్టాలెక్కలేదు....
ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించి రెండేళ్ళు దాటినా ఇప్పటికీ జోన్‌ కార్యకలాపాలు ప్రారంభం కాలేదని ఎంపీ విజయసాయిరెడ్డి మంత్రికి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మొత్తానికి విస్తరించే దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ కార్యకలాపాలను ప్రారంభిస్తే ఏటా రమారమి 13 వేల కోట్ల రూపాయల ఆదాయంతో దేశంలోనే అత్యధిక లాభసాటి అయిన జోన్‌గా రాణిస్తుంది. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం వంటి పోర్టులకు ఈ జోన్‌ ద్వారా అందించే రైలు రవాణా సేవలు గణనీయంగా మెరుగుపడతాయి. దీని వలన రాష్ట్రంలో వాణిజ్య, పారిశ్రామిక వర్గాలకు ఎంతగానో అవసరమైన రవాణా అవసరాలు నెరవేరతాయి. రైల్వేకి కూడా గణనీయమైన ఆదాయం లభిస్తుందని  విజయసాయి రెడ్డి రైల్వే మంత్రికి వివరించారు. అందువలన ఆంధ్రప్రదేశ్‌ ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ కార్యకలాపాలను త్వరితగతిన ప్రారంభించాలని ఆయన కోరారు.

విశాఖ కేంద్రగా వాల్తేరు డివిజన్‌ను కొనసాగించాలి...
రైల్వేలో అత్యధిక ఆదాయం వచ్చే డివిజన్లలో విశాఖపట్నం కేంద్రంగా ఉన్న వాల్తేరు డివిజన్‌ ఒకటని విజయసాయిరెడ్డి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దేశంలోని కొన్ని రైల్వే జోన్లకంటే కూడా వాల్తేరు డివిజన్‌ అత్యధిక ఆదాయం సంపాదిస్తోంది. తూర్పు కోస్తాలో అత్యధిక ఆదాయం గడించే డివిజన్లలో వాల్తేరు డివిజన్‌దే అగ్రస్థానం. నానాటికీ పురోగమిస్తున్న వాల్తేరు డివిజన్‌ను రద్దు చేసి విశాఖపట్నం నగరాన్ని విజయవాడ డివిజన్‌ కిందకు తీసుకురావాలన్న ఆలోచన ఘోర తప్పిదం అవుతుందని విజయసాయి రెడ్డి రైల్వే మంత్రికి స్పష్టం చేశారు. వాల్తేరు డివిజన్‌ రద్దు వలన కొత్త సమస్యలు కోరి తెచ్చుకున్నట్లవుతుందని కూడా ఆయన చెప్పారు.

వాల్తేరు డివిజన్‌లో ప్రస్తుతం జరిగే కార్యకలాపాలను విశాఖపట్నం నుంచి 350 కిలోమీటర్ల దూరంలోని విజయవాడ డివిజన్‌కు తరలించడం వలన నిర్వహణా సమస్యలు, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ సమస్యలు ఉత్పన్నమై ప్రమాదాల సమయంలో రైల్వే యంత్రాంగం స్పందించే వేగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పారు. అలాగే విశాఖపట్నంలోని వాల్తేరు డివిజన్‌లో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. కంటైనర్‌ టెర్మినల్స్‌, లోకో షెడ్‌, వాగన్‌ వర్క్‌షాప్‌, 2300 మంది సిబ్బందికి సరిపడ స్టాఫ్‌ క్వార్టర్లు ఉన్నాయి. వాల్తేరు డివిజన్‌ను విశాఖపట్నంలో కొనసాగించడం వల రైల్వే అదనంగా ఎలాంటి ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి 125 ఏళ్ళనాటి వాల్తేరు డివిజన్‌ను రద్ద చేయడం ద్వారా ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను గాయపరచవద్దని  విజయసాయిరెడ్డి రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశారు.

మరో 5 విస్టాడోమ్‌ కోచ్‌లు కేటాయించండి...
ప్రకృతి రమణీయ దృశ్యాలతో కనువిందు చేసే  బీచ్‌లు, తూర్పు కనుమలు, ఘాట్‌లు, గుహలతో విశాఖపట్నం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. తూర్పు తీరానికే ఆభరణంగా విరాజిల్లుతున్న విశాఖపట్నంలోని పర్యాటక ప్రాంతాలను ఏటా దేశ విదేశాలకు చెందిన లక్షలాది మంది పర్యాటకులు సందర్శిస్తుంటారని  విజయసాయి రెడ్డి రైల్వే మంత్రికి వివరించారు. విశాఖపట్నం నుంచి అరకులోయ మధ్య నడిచే రైలుకు అనుసంధానించిన విస్టాడోమ్‌ కోచ్‌కు పర్యాటకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని అన్నారు. విస్టాడోమ్‌కు పర్యాటకుల నుంచి అత్యధిక డిమాండ్‌ ఉన్నప్పటికీ అదనపు విస్టాడోమ్‌ కోచ్‌లు ఏర్పాటు చేయడంలో రైల్వే శాఖ విపరీతమైన అలసత్వం ప్రదర్శిస్తోందని విజయసాయిరెడ్డి అన్నారు.

అదనపు విస్టాడోమ్‌ కోచ్‌లు కావాలని గత ఏడాది మార్చిలో రాజ్యసభలో నేను చేసిన విజ్ఞప్తిపై స్పందించిన అప్పటి రైల్వే మంత్రి త్వరలోనే మరిన్ని కోచ్‌లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ విశాఖ-అరకు రైలుకు కేటాయించిన విస్టాడోమ్‌ కోచ్‌లను ఇతర ప్రాంతాలకు తరలించేస్తున్న విషయాన్ని ఆయన రైల్వే మంత్రి దృష్టికి తీసుకువస్తూ విశాఖ-అరకు మధ్య నడిచే రైలుకు అదనంగా మరో 5 విస్టాడోమ్‌ కోచ్‌లను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

ఏపీలో కంటైనర్‌ తయారీ విభాగాన్ని నెలకొల్పండి...
ఆంధ్రప్రదేశ్‌లో ఒక మేజర్‌ పోర్ట్‌, అయిదు సాధారణ పోర్టులు, 10 నోటిఫైడ్‌ పోర్టులు ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఏడాదికి 170 మిలియన్‌ టన్నుల కార్గోను హ్యాండిల్‌ చేస్తున్నాయి. గుజరాత్‌ తర్వాత అత్యధిక కార్గో హ్యాండ్లింగ్‌ రాష్ట్రంలోని పోర్టులలోనే జరుగుతోంది. రామాయపట్నం పోర్టు నిర్మాణం కూడా పూర్తయితే మరో 15 మిలియన్‌ టన్నుల కార్గో హ్యాండిల్‌ చేసే సామర్ధ్యం వస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్‌లో కంటైనర్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటు చేయడం వలన రవాణా ఖర్చుల భారం బాగా తగ్గుతుందని విజయసాయి రెడ్డి అన్నారు. కాబట్టి చిత్తూరు జిల్లా మన్నవరంలో ఉన్న ఎన్‌టీపీసీ-బీహెచ్‌ఈఎల్‌ ఆవరణలో ఈ కంటైనర్‌ తయారీ విభాగాన్ని నెలకొల్పాలని ఆయన రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశారు.

రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేయాలి...
రైల్వేలో నియామకాల కోసం దేశంలో 21 ప్రాంతాల్లో రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డులు ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం బోర్డు లేదు. దీని వలన రాష్ట్రానికి చెందిన ఉద్యోగార్ధులు ఆర్‌ఆర్‌బీ పరీక్షలు రాయడానికి అటు సికింద్రాబాద్‌ లేదా భువనేశ్వర్‌కు వెళ్ళాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు ఆవశ్యకత ఉన్నందున దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ఆయన కోరారు. అలాగే చాలా కాలంగా సాగుతున్న నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైను నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, కర్నూలులో కోచ్‌ వర్క్‌షాప్‌ నెలకొల్పాలని, విజయవాడ-విశాఖపట్నం మధ్య మూడో రైల్వే లైన్‌ నిర్మాణం చేపట్టాలని, తిరుపతి-పాకాల-చిత్తూరు-కట్పడి మధ్య డబుల్‌ లైన్‌ నిర్మాణం చేపట్టాలని విజయసాయి రెడ్డి కోరారు.

రాజరాజేశ్వరిపేట వాసులకు ఊరట కల్పించండి...
విజయవాడ రాజరాజేశ్వరిపేటలోని రైల్వే భూముల్లో మూడు దశాబ్దాలకు పైగా 800 మంది నిరుపేద కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఆక్రమణలో ఉన్న తమ నివాసాలను క్రమబద్ధం చేయాలని ఆయా కుటుంబాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అందువలన ఆ భూమికి బదులుగా అజిత్‌ సింగ్‌ నగర్‌లోని రైల్వే భూములకు సమీపంలోనే ఉన్న 25 ఎకరాల భూమిని రైల్వేకి అప్పగించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి రాజరాజేశ్వరిపేటలోని ఆక్రమిత రైల్వే భూమికి బదులుగా ఈ భూమిని తీసుకునేలా చర్యలు తీసుకోవాలని విజయసాయి రెడ్డి రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశారు.
రైల్వే మంత్రి  అశ్విని వైష్ణవ్‌ను కలిసిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీల బృందంలో విజయసాయి రెడ్డితోపాటు  పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌,  మోపిదేవి వెంకటరమణ, మార్గాని భరత్‌, ఆళ్ళ ఆయోధ్య రామిరెడ్డి, డాక్టర్‌ బీవీ సత్యవతి, గొడ్డేటి మాధవి, చింతా అనురాధ ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement