YSRCP Plenary 2022 Arrangements Are In Full Swing As Festival - Sakshi
Sakshi News home page

YSRCP Plenary 2022: దారులన్నీ ప్లీనరీ వైపే

Published Fri, Jul 8 2022 3:18 AM | Last Updated on Fri, Jul 8 2022 3:10 PM

YSRCP Plenary 2022 arrangements are in full swing as festival - Sakshi

వైఎస్సార్‌సీపీ ప్లీనరీకి వెళ్లే రహదారిలో ఏర్పాటు చేసిన ఓ స్వాగత ద్వారం

సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని శుక్ర, శనివారాల్లో వైఎస్సార్‌సీపీ నిర్వహించనున్న ప్లీనరీకి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. విజయవాడ – గుంటూరు ప్రధాన రహదారికి సమీపంలో నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా 2017 జూలై 8 – 9న రెండో ప్లీనరీ నిర్వహించిన ప్రదేశంలోనే మూడో ప్లీనరీని నిర్వహిస్తోంది. ప్లీనరీ ప్రాంగణానికి మహానేత వైఎస్సార్‌ ప్రాంగణంగా నామకరణం చేశారు. అధికారంలోకి వచ్చాక తొలిసారిగా నిర్వహిస్తున్న ప్లీనరీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పార్టీ అధ్యక్షులు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేరు పేరునా లేఖ రాసి ఆహ్వానించడంతో పార్టీ వార్డు సభ్యులు మొదలు ప్రజాప్రతినిధుల వరకు అందరూ తొలి రోజున ప్రతినిధుల సభకు కదలివస్తున్నారు.

రెండో రోజున విస్తృత స్థాయి సమావేశానికి రాష్ట్రం నలు మూలల నుంచి వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు తరలి రావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శుక్ర, శనివారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్న నేపథ్యంలో.. వర్షం వచ్చినా ప్లీనరీకి హాజరయ్యే వారు తడవకుండా భారీ విస్తీర్ణంలో వాటర్‌ప్రూఫ్‌ టెంట్లు ఏర్పాటు చేశారు. మూడేళ్లలో చేసిన సంక్షేమం, అభివృద్ధి పథకాలను వివరిస్తూ ఫొటో ఎగ్జిబిషన్, పోలవరం ప్రాజెక్టులో చేసిన పనులను గుర్తు చేస్తూ నమూనా ఏర్పాటు చేశారు. విద్యుత్‌ దీప కాంతులతో  ప్రాంగణం ధగధగలాడుతోంది. రక్తదాన శిబిరానికి ఏర్పాట్లు చేశారు. కాగా, కాలర్‌ ఎగరేసుకుని తిరిగేలా సీఎం వైఎస్‌ జగన్‌ పరిపాలిస్తుండటంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతల్లో ఉత్సాహం పెల్లుబుకుతోంది. ఈ క్రమంలో ప్లీనరీకి భారీ స్థాయిలో శ్రేణులు తరలి వస్తున్నాయి.

3 వేల మంది వలంటీర్లు 
వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో 3 వేల మంది వలంటీర్లు పాల్గొంటున్నారని ప్లీనరీ వలంటీర్స్‌ కమిటీ కన్వీనర్, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన ప్లీనరీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే వారు ఇక్కడికి చేరుకున్నారని చెప్పారు. ఓ వైపు వర్షం పడుతున్నప్పటికీ మొక్కవోని దీక్షతో ప్లీనరీ ప్రాంగణంలో విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు.
జాతీయ రహదారి పొడవునా  వైఎస్సార్‌సీపీ పతాకాలు, కటౌట్లు, బెలూన్లు 

వంటశాలలో విజయసాయిరెడ్డి తదితరులు 

‘జననాయక’ సీడీల ఆవిష్కరణ
వైఎస్సార్‌సీపీ ప్లీనరీ నిర్వహిస్తున్న నేపథ్యంలో ‘జన నాయక’ పేరిట రూపొందించిన పాటల సీడీలను పార్టీ నేతలు, మంత్రులు కలసి గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌పీపీ నేత వి.విజయసాయిరెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు బొత్స సత్సనారాయణ, విశ్వరూప్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ పథకాలను వివరిస్తూ ఈ సీడీని రూపొందించారు.

ప్లీనరీలో కార్యక్రమాలు ఇలా..
► వైఎస్సార్‌సీపీ ప్లీనరీకి హాజరయ్యే పార్టీ ప్రతినిధులు శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు పేర్లు నమోదు చేయించుకోవాలి. ఆ తర్వాత పార్టీ అధ్యక్షులు, సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన పార్టీ కార్యనిర్వాహక మండలి (సీఈసీ) సభ్యుల సమావేశం జరుగుతుంది. అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌ పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత ప్లీనరీ వేదికపైకి సీఎం వైఎస్‌ జగన్‌ను, ప్రధాన నాయకులను ఆహ్వానిస్తారు.
► వందేమాతరం గీతాలాపనతో ప్లీనరీ మొదలవుతుంది. ఆ తర్వాత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి సీఎం వైఎస్‌ జగన్, నాయకులు పూలమాలలు వేసి, నివాళులు అర్పిస్తారు. ప్రార్థన పూర్తయ్యాక పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రకటనను సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విడుదల చేస్తారు. ఆ తర్వాత పార్టీ అధ్యక్షులు, సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభోపన్యాసం చేస్తారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ సందేశం ఇస్తారు.
► పార్టీ ఆడిట్‌ ఖర్చుల స్టేట్‌మెంట్‌ను పి.కృష్ణమోహన్‌రెడ్డి ప్రతిపాదించి.. ప్లీనరీ ఆమోదం కోరుతారు. పార్టీని మరింత బలోపేతం చేసేలా నియమావళికి సవరణలు ప్రతిపాదించి.. ప్లీనరీ ఆమోదం కోరుతారు. ఆ తర్వాత మహిళా సాధికారత – దిశ చట్టం, విద్య, నవరత్నాలు – డీబీటీ, వైద్యం, పరిపాలన – పారదర్శకత అంశాలపై చర్చించి.. తీర్మానాలను ప్రవేశపెడతారు. 
► శనివారం సామాజిక సాధికారత, వ్యవసాయం, పరిశ్రమలు – ఎంఎస్‌ఎంఈలు – ప్రోత్సాహకాలు, ఎల్లో మీడియా – దుష్టచుతుష్టయంపై చర్చించి.. తీర్మానాలను ప్రవేశపెట్టి.. ప్లీనరీ ఆమోదం కోరుతారు. అధ్యక్ష ఎన్నికను ప్రకటించి అభినందనలు తెలుపుతారు. ఆ తర్వాత పార్టీ అధ్యక్షులు, సీఎం వైఎస్‌ జగన్‌ ముగింపు ఉపన్యాసం ఉంటుంది. ఆ తర్వాత వందన సమర్పణతో ప్లీనరీ ముగుస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement