మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా
సాక్షి, నంద్యాల: సామాజిక సాధికారత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తోనే సాధ్యమని వైఎస్సార్‌సీపీ నేతలు తెలిపారు. పేదలకు, పెత్తందార్లకు మధ్య జరిగే వచ్చే ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా పేదల పక్షపాతి అయిన వైఎస్ జగన్‌కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. నవనందుల సాక్షిగా శనివారం నంద్యాల పట్టణంలో సామాజిక సాధికార చైతన్యం వెల్లివెరిసింది. వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రకు భారీ ఎత్తున బడుగు, బలహీనవర్గాల ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ బైక్ ర్యాలీ ఆకట్టుకుంది.
మైనారిటీల పక్షపాతి సీఎం వైఎస్ జగన్
చంద్రబాబు మైనార్టీల ద్రోహి అని డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా మండిపడ్డారు. చంద్రబాబు మైనారిటీలపై దేశద్రోహం కేసులు పెడితే, సీఎం వైఎస్ జగన్ వచ్చాక ఆ కేసులను తొలగించారని గుర్తు చేశారు. అంతేకాకుండా మైనారిటీ వ్యక్తిని డిప్యూటీ సీఎం పదవిలో కూర్చోబెట్టి సీఎం జగన్ గౌరవించారని కొనియాడారు. స్వాతంత్య్రం వచ్చిననాటి నుంచి సామాజిక సాధికారిత నినాదంగానే ఉందని, ఒక్క సీఎం జగన్ మాత్రమే దీన్ని విధానంగా మార్చారని ప్రశంసించారు. మనల్ని చేయిపట్టుకుని ముందుకు నడిపిస్తున్న జగన్ వెంటే మనమంతా నిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
14 ఏళ్లలో ఏం చేశావో చెప్పే ధైర్యముందా బాబూ?
ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను చంద్రబాబు విస్మరిస్తే.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసిన చరిత్ర సీఎం జగన్‌దని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. 14 ఏళ్లు సీఎంగా చేశానని చెప్పుకునే చంద్రబాబు తాను అధికారంలో ఉన్నప్పుడు పేదలకు ఏం చేశారో చెప్పగలరా అని నిలదీశారు. ఎస్సీలను తన రాజకీయ లబ్ధి కోసం వాడుకుని చంద్రబాబు వదిలేశారని మండిపడ్డారు. సీఎం జగన్ ఎస్సీలకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి గౌరవించారని గుర్తు చేశారు. ఆయన అమలు చేస్తున్న ప్రతి పథకం పేదవాడిని ఉన్నతస్థాయికి తీసుకెళ్తోందన్నారు. పేదల పక్షాన నిలుస్తున్న సీఎంకు మనమంతా అండగా నిలవాలని కోరారు.
బడుగు, బలహీనవర్గాలంటే చంద్రబాబుకు చిన్నచూపు
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలంటే చంద్రబాబుకు ఇప్పటికీ చిన్నచూపేనని మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ విమర్శించారు. బడుగు, బలహీనవర్గాల నాయకులను సున్నాలతో పోలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ పాలనలోనే బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి సాధ్యమని చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే బీసీలను కరివేపాకులా వాడుకుని వదిలేస్తారన్నారు.
తండ్రి అరెస్టయి జైలులో ఉంటే ఢిల్లీకి పారిపోయిన పిరికి పంద లోకేశ్.. సీఎంను పట్టుకుని సైకో అంటూ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పక్క పార్టీ నాయకుడిని సీఎంగా చూడాలనుకున్న వ్యక్తి ఈ దేశంలో ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమేనని ఎద్దేవా చేశారు. ఈ సభలో నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి, ముస్లిం మైనారిటీ ప్రభుత్వ సలహాదారు హబీబుల్లా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment