రాష్ట్రంలో సామాజిక చైతన్యం వెల్లివిరిసింది. కర్నూలు, ఎన్టీఆర్ జిల్లా నందిగామ, తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో ఆదివారం నిర్వహించిన సామాజిక సాధికార యాత్రలకు ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. సీఎం జగన్ పాలనలో తాము సాధించిన సాధికారతను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు చాటిచెప్పారు.
ఈ సందర్భంగా మంత్రులు, వైఎస్సార్‌సీపీ నేతలు మాట్లాడుతూ.. ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను చంద్రబాబు అవహేళన చేసి కించపరిస్తే.. జగన్ వారందరినీ చేయిపట్టి అభివృద్ధి పథం వైపు నడిపించారు. ఎన్నడూలేనన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి.. బడుగులకు లబ్ధి చేకూర్చి వారి అభివృద్ధికి బాటలు వేశారు. పదవుల్లోనూ అధిక ప్రాధాన్యమిచ్చిన ఏకైక సీఎం జగన్’ అని వివరించారు.
నందిగామ (పెనుగంచిప్రోలు): ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సామాజిక చైతన్యం వెల్లివిరిసింది. ఆదివారం సాయంత్రం నందిగామలో నిర్వహించిన సామాజిక సాధికార యాత్రకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు అసంఖ్యాకంగా హాజరయ్యారు. యువత పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. నియోజకవర్గం నలుమూలల నుంచి యాత్రకు తరలివచ్చిన వారితో పట్టణంలోని వీధులన్నీ కిటకిటలాడాయి.
జై జగన్.. జగనే కావాలి అంటూ వారు చేసిన నినాదాలతో పట్టణం మార్మోగింది. పట్టణంలోని గాంధీ సెంటర్‌లో నిర్వహించిన బహిరంగ సభకు జనం వెల్లువలా తరలి వచ్చారు. 14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కేవలం ఓటు బ్యాంక్‌గా వాడుకుని వదిలేయగా జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక అన్ని విధాలా బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట వేసి రాజ్యాధికారం కల్పించారని వక్తలు చెప్పటంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున హర్షం వ్యక్తమైంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మరోసారి అధికారం ఇవ్వాలని మంత్రులు, నేతలు పిలుపునివ్వటంతో ప్రజలు జై జగన్.. అంటూ పెద్ద ఎత్తున మద్దతు పలికారు.
జగనన్న పాలనలో సామాజిక విప్లవం : మంత్రి మేరుగు నాగార్జున
సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో సామాజిక విప్లవం వచ్చిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. స్వాతంత్య్రం వచ్చాక ఎందరో మహనీయులు సామాజిక విప్లవం రావాలని కోరుకున్నారని, వారి ఆశయాలను సాధ్యం చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని తెలిపారు. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అవహేళన చేస్తూ చంద్రబాబు అన్నమాటలను ఎవరూ మరచి పోరాదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అగ్రతాంబూలం ఇచ్చిన లీడర్ ఒక్క జగనే అని అన్నారు. చంద్రబాబు ఒక గజదొంగ అని, చట్టాలను అనుకూలంగా మార్చుకుని బడుగు, బలహీన వర్గాల హక్కులను కాలరాశారని చెప్పారు.
సామాజిక సాధికారత విధానంగా...: డిప్యూటీ సీఎం అంజాద్ బాషా
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో సామాజిక సాధికారత ఒక నినాదంగా కాకుండా విధానంగా అమలు జరుగుతోందని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అన్ని విధాలుగా మోసం చేశారని చెప్పారు. వైఎస్ జగన్ వచ్చిన తర్వాతే ఈ వర్గాలు తలెత్తుకొని తిరుగుతున్నాయన్నారు.
కేబినెట్‌లో 25 మంది మంత్రులు ఉంటే 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అవకాశం కల్పించిన ఘనత ఒక్క జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే దక్కుతుందన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వలేదన్నారు. జగన్ ప్రభుత్వంలో మొదటి కేబినెట్‌లోనే తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారన్నారు. శాసనçÜభలో, శాసన మండలిలో నలుగురు మైనార్టీలకు అవకాశం ఇచ్చారన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వంలో ఐదేళ్లలో కేవలం రూ.2,650 కోట్లు కేటాయిస్తే, సీఎం జగన్ ఈ నాలుగున్నరేళ్లలోనే రూ.23,175 కోట్లు ఖర్చు చేశారన్నారు. జగనన్నను గుండెల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
అంబేడ్కర్ రాజ్యాంగమే స్ఫూర్తి..: జోగి
అంబేడ్కర్ రాజ్యాంగమే స్ఫూర్తిగా, పూలే ఆలోచనలను జోడించి సీఎం సామాజిక న్యాయం అమలు చేస్తున్నారని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర దేశంలో సామాజిక న్యాయం ఒక్క జగన్ వల్లనే సాధ్యమైందన్నారు. చంద్రబాబు వర్ల రామయ్యకు రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పి ఆనక కనకమేడల రవీంద్రకు కేటాయించటం బడుగు, బలహీన వర్గాల పట్ల ఆయనకు ఉన్న వైఖరి అర్ధమవుతుందన్నారు.
2024 ఎన్నికల్లో అందరూ జగన్‌కు మద్దతు పలకాలన్నారు. నందిగామ, జగ్గయ్యపేట, పామర్రు, పెనమలూరు ఎమ్మెల్యేలు మొండితోక జగన్‌మోహన్‌రావు, సామినేని ఉదయభాను, కైలే అనిల్‌కుమార్, కొలుసు పార్థసారథి, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, మొండితోక అరుణ్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకరరావు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment