కొనసాగుతున్న అరెస్టుల పర్వం | YSRCP Social Media Activists Illegally Arrested: Andhra pradesh | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న అరెస్టుల పర్వం

Published Sat, Nov 9 2024 5:51 AM | Last Updated on Sat, Nov 9 2024 6:03 AM

YSRCP Social Media Activists Illegally Arrested: Andhra pradesh

సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌లపై కేసులు, వేధింపులు

సాక్షి నెట్‌వర్క్‌: ప్రజల్ని భయభ్రాంతులను చేయడమే ఏకైక అజెండాగా పెట్టుకున్న ప్రభుత్వం పౌర హక్కుల్ని కాలరాస్తూ సోషల్‌ మీడియా యాక్టివిస్టుల అరెస్టులను కొనసాగిస్తోంది. 

అనంతపురం జిల్లా బెళు­గుప్ప మండలం నక్కల­పల్లి గ్రామానికి చెందిన సంజీవ­రెడ్డిని ఈ నెల 6వ తేదీ రాత్రి పుట్టపర్తి అర్బన్‌ సీఐ సునీత సిబ్బందితో వచ్చి ఇంటి నుంచి బలవంతంగా అరెస్టు చేసి తీసు­కువెళ్లారు. అప్పటి నుంచి సంజీ­వరెడ్డి ఆచూకీ తెలియడం లేదు. అతని తల్లి సుంకమ్మ భోజనం మానేసి మంచం పట్టింది. సంజీవరెడ్డి సోద­రుడు ముత్యాలరెడ్డి అనంత­పు­రం, పుట్ట­పర్తి, బెళుగుప్ప పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిరు­గుతున్నా ఎవరూ సమాధానం చెప్పడం లేదు.   

కర్నూలు జిల్లా కృష్ణగిరి, వెల్దుర్తి పోలీసుస్టేషల్లో సోషల్‌మీడియా యాక్టివిస్టులపై శుక్రవారం రెండు కేసులు నమోదయ్యాయి. వెల్దుర్తి మండలం రామళ్లకోటకు చెందిన టీడీపీ కార్యకర్త శశికళదరప్ప ఫిర్యాదు మేరకు తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్‌కు చెందిన బద్దం ఆశోక్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే కృష్ణగిరి మండలం, మాదాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఎల్వీ ప్రసాద్‌ ఫిర్యాదు మేరకు ఆర్‌.భార్గవ్‌ అనే వ్యక్తిపై కేసు నమోదుచేశారు.

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన వైఎస్సార్‌సీపీ సేవాదళ్‌ జిల్లా కార్యదర్శి దంతులూరి రోహిత్‌వర్మను పట్టణ పోలీసులు గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై శుక్రవారం కేసు నమోదు చేశారు. ఆయన వద్ద ఉన్న స్మార్ట్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. 

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌పై ఎక్స్, ఇన్‌స్ట్రాగామ్‌లో వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారనే కారణంతో విశాఖ జిల్లా గాజువాకకు చెందిన వెంకటేష్, ప్రకాశం జిల్లాకు చెందిన పవన్‌పై కర్నూలు జిల్లా పత్తికొండ పోలీసులు కేసు నమోదుచేశారు. వైఎస్సార్‌సీపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాజీ అధ్యక్షుడు కొల్లు వెంకటరెడ్డిపై విజయవాడ సైబర్‌ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. మంత్రి లోకేశ్‌పై సోషల్‌ మీడియాలో అనుచి­త వ్యా­ఖ్యలతో పోస్టులు పెట్టారంటూ నిజామా­బాద్‌కు చెందిన బద్దం అశోక్‌రెడ్డి చేసిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. 

వర్రా రవీంద్రా రెడ్డి అరెస్ట్‌
పోలీసుల కక్ష సాధింపు చర్యల కోసం చేపట్టిన గాలింపు చర్య­ల్లో వైఎస్సార్‌ సీపీ సోషల్‌ యా­క్టివిస్ట్‌ వర్రా రవీంద్రారెడ్డి శుక్ర­వా­రం అరెస్టయ్యారు. నాలు­గు రోజుల క్రితం కడప తాలూకా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నమోదైన కేసుపై అప్పటి జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్‌ రాజు ప్రత్యేక పోలీసు బృందాన్ని పంపించి వేముల మండలం కొండ్రెడ్డిపల్లెలో నివాస­ముంటున్న వర్రా రవీంద్రారెడ్డిని అర్ధరాత్రి వేళలో కడపకు తీసుకొచ్చారు. కడప తాలూకా పోలీస్‌ స్టేషన్లో ఆ కేసుకు సంబంధించి 41 నోటీస్‌ ఇచ్చారు. అతనితో పాటు వచ్చిన వైఎస్సార్‌సీపీ నాయకులు మహేశ్వర్‌­రెడ్డి మరొకరితో కలిసి జామీను ఇచ్చారు. తర్వాత రాజంపేట ప్రాంతానికి చెందిన పోలీసు బృందం రవీంద్రారెడ్డిని అదుపులోకి తీసుకుని తమ వెంట తీసు­కెళ్లేందుకు ప్రయత్నించింది.

అయితే వర్రా రవీంద్రారెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరుసటి రోజు వర్రా రవీంద్రారెడ్డి భార్య కళ్యాణి, కుటుంబ సభ్యు­లను వేముల పోలీసులు కడపకు తీసుకుని వచ్చారు. వారిని సాయంత్రం వరకు  చింతకొమ్మదిన్నె పోలీ­సులు విచారణ పేరుతో తమ వద్దనే ఉంచుకొని తరు­వాత వైఎస్సార్‌ సీపీ నేతలు సాయంత్రం వేళ ఆక్కడికి రాగానే వారికి నోటీసు ఇచ్చి పంపించి వేశారు. ఈ క్రమంలోనే అప్పటి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజును రాజకీయ బదిలీ చేశారు. చిన్నచౌక్‌ సీఐగా పనిచేస్తున్న తేజమూర్తిని వర్రా రవీంద్రారెడ్డి వ్యవహారంలో సస్పెండ్‌ చేశారు. ఈ క్రమంలోనే వర్రా రవీంద్రారెడ్డిని మహబూబ్‌నగర్‌ జిల్లా సరిహద్దు ప్రాంతంలో అదుపులోకి తీసుకుని అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది.

పోలీసుల చిత్రహింసలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ‘నన్ను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. మహిళనని కూడా చూడకుండా చిలకలూరిపేట సీఐ రమేష్‌ దుర్భాష­లాడారు. ఇష్టానుసారం కొట్టారు. నా భర్త వెంక­టరెడ్డినీ చిత్రహింసలకు గురిచేశారు.’  అని జడ్జి ఎదుట పెద్దిరెడ్డి సుధారాణి ఆవేదన వ్యక్తంచేశారు. సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారన్న నెపంతో తెలంగాణలోని నల్లగొండలో నివాసం ఉంటున్న చిలకలూరి­పేటకు చెందిన సుధా­రాణిని 5 రోజులుగా వివిధ పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిప్పుతు­న్నారు. హైకోర్టులో హెబియస్‌కార్పస్‌ పిటిషన్‌ వేయడంతో శుక్రవా­రం సాయంత్రం గుంటూరు కొత్తపేట పోలీసులు స్థానిక కోర్టులో ప్రవేశ­పెట్టారు.

పవన్‌ కళ్యాణ్‌ కుమార్తెపై పోస్ట్‌ పెట్టా­రన్న నెపంతో తెలంగాణలో సుధా­రాణి, ఆమె భర్త వెంకటరెడ్డిని  చిలకలూరి­పేట పోలీసులు సోమ­వారం అదుపులోకి తీసుకు­న్నారు. తమను చిలక­లూరి­పేట తీసుకొచ్చి 2 రోజులు చిత్రహింసలకు గురిచేశా­రు. అనంతరం ఒంగోలు తీసుకెళ్లి వేధించారని సుధారాణి వివరించారు. న్యాయమూర్తి నేరుగా ఆమె స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement