కిడ్నాప్ చేసేందుకు వినియోగించిన వాహనాలు
మదనపల్లె : పట్టణ పరిధి అమ్మచెరువుమిట్టలోని ఆర్‌కే టైల్స్ యజమాని శ్రావణ్‌కుమార్‌ను ఆదివారం కడపకు చెందిన కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారన్న విషయం కలకలం రేపింది. కడపకు చెందిన ముగ్గురు వ్యాపారులు 15 మందితో కలిసి రెండు వాహనాల్లో ఆర్‌కే టైల్స్ యజమాని శ్రావణ్‌కుమార్, బావమరిది రమేష్‌ను కొట్టుకుంటూ తీసుకెళ్లిపోయారన్న వార్త దావానలంలా వ్యాపించింది. తమ పార్టనర్, అతడి బావమరిది కిడ్నాప్‌కు గురయ్యారంటూ ఆర్‌కే టైల్స్ నగేష్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే జిల్లా వ్యాప్తంగా సమాచారం అందించి నిఘా పెట్టారు. ఎట్టకేలకు గుర్రంకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో నిందితులు కిడ్నాప్ చేసిన వ్యక్తులతో సహా పోలీసులకు దొరికిపోయారు.
పట్టణంలో సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలో అమ్మచెరువుమిట్ట వద్ద శ్రావణ్‌కుమార్, నగేష్‌లు ఆర్‌కే టైల్స్ పేరుతో టైల్స్ వ్యాపారం చేస్తున్నారు. వీరు గుజరాత్ నుంచి టైల్స్ తెప్పించి, స్థానికంగా హోల్‌సేల్ ధరకు విక్రయిస్తుంటారు. కడప జిల్లాకు చెందిన నాగబసిరెడ్డి, సునీల్‌రెడ్డి, లోకేష్‌రెడ్డిలు రాయచోటి, కడపలో టైల్స్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. వీరు గుజరాత్ నుంచి టైల్స్ పెద్ద మొత్తంలో తెప్పించుకుని, అక్కడి వ్యాపారులకు డబ్బులు చెల్లించకుండా బెదిరింపులకు పాల్పడుతుండేవారు. ఈ క్రమంలో వ్యాపార లావాదేవీల్లో భాగంగా గుజరాత్‌కు వెళ్లిన ఈ ముగ్గురిని అక్కడి వ్యాపారులు మూకుమ్మడిగా నిర్బంధించి తమకు రావాల్సిన బాకీని వసూలు చేసుకున్నారు.
దీనిని కడప వ్యాపారులు అవమానంగా భావించారు. తమకు గుజరాత్‌లో అవమానం జరిగేందుకు మదనపల్లెకు చెందిన ఆర్‌కే టైల్స్ యజమానులు శ్రావణ్‌కుమార్, నగేష్‌లు కారణమని, తమ సమాచారాన్ని వారికి అందించినందునే తాము ఇబ్బందులు పడ్డామని వీరిపై కక్ష పెంచుకున్నారు. దీంతో ఆదివారం సాయంత్రం కడప వ్యాపారులు రెండు వాహనాల్లో 15 మందిని వెంటపెట్టుకుని మదనపల్లె ఆర్‌కే టైల్స్ వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో శ్రావణ్‌కుమార్, అతడి బావమరిది రమేష్ షాపులో ఉన్నారు. తమ సమాచారం గుజరాత్ వ్యాపారులకు అందించి తమకు రూ.30 లక్షల వరకు నష్టం కలిగించారని, ఆ డబ్బులు మీరే చెల్లించాలంటూ ఇద్దరినీ బెదిరించారు. ఖాళీ బాండుపేపర్లపై రూ.30 లక్షలు బాకీ ఉన్నట్లు సంతకాలు పెట్టాల్సిందిగా ఒత్తిడి తెచ్చారు. వారు ససేమిరా అనడంతో ఎలా ఇవ్వరో చూస్తామంటూ మరో యజమాని నగేష్‌కు ఫోన్ చేసి.. ఇద్దరినీ కిడ్నాప్ చేసి తీసుకెళుతున్నామని, డబ్బులు ఇచ్చి విడిపించుకోవాల్సిందిగా చెప్పారు.
దీంతో నగేష్ వన్‌టౌన్ సీఐ మహబూబ్‌బాషాకు ఫిర్యాదు చేయడం, ఆయన డీఎస్పీ కేశప్ప దృష్టికి తీసుకెళ్లడంతో అప్రమత్తమై జిల్లా ఎస్పీకి సమాచారం అందించి జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్‌లను అప్రమత్తం చేశారు. వాహన తనిఖీలు చేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో గుర్రంకొండ వద్ద వాహన తనిఖీల్లో కిడ్నాపర్లు వాహనాలతో సహా పోలీసులకు దొరికిపోయారు. అక్కడ నుంచి వారిని మదనపల్లె వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కిడ్నాప్‌కు ఉపయోగించిన రెండు వాహనాలను స్వాధీనం చేసుకుని నిందితులను విచారణ చేస్తున్నట్లు తెలిసింది. కిడ్నాప్ ఘటనపై పోలీసులు తక్షణమే స్పందించి నిందితులను అరెస్ట్ చేయడంతో కథ సుఖాంతమైంది.
Comments
Please login to add a commentAdd a comment