ఓబులవారిపల్లె : వేకువ జామున నిద్రలేచి హడావిడిగా పుస్తకాలు సర్ది.. తన గారాల పట్టిని ముస్తాబు చేసి స్కూల్ వ్యాన్‌లో కూర్చోబెట్టి టాటా చెప్పి మురిసిపోయిన ఆ తల్లి ఆనందం క్షణాల్లో ఆవిరైపోయింది. వ్యాన్ బయలు దేరిన ఐదు నిమిషాలకే తన బిడ్డ తనువు చాలించిందనే పిడుగుపాటు లాంటి వార్త ఆ తల్లి గుండెను పిండేసింది.
దేవుడా ఎంత పనిచేశావు అంటూ ఆ మాతృమూర్తి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే ప్రతి ఒక్కరి హృదయం చలించిపోయింది. ఓబులవారిపల్లె మండల కేంద్రానికి చెందిన వీరంరెడ్డి మధుసూధన్‌రెడ్డి, అరుణ దంపతులకు తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. కుమార్తె భవిష్య(07), ఏడాది వయసున్న కుమారుడు వీరం రెడ్డి మోక్షజ్ఞ సాయికుమార్‌రెడ్డి ఉన్నారు. ఎంతో చలాకీగా ఉండే భవిష్య చిన్నఓరంపాడు అయ్యలరాజుపల్లె శ్రీవాణి హైస్కూల్‌లో రెండో తరగతి చదువుతోంది.
ప్రతి రోజు మాదిరిగా సోమవారం ఉదయం పాఠశాలకు వ్యాన్‌లో బయలు దేరింది. పాఠశాల సమీపంలో వ్యాన్ బోల్తా పడిన ఘటనలో భవిష్య అక్కడికక్కడే మృతి చెందింది. ఒక్కగానొక్క కుమార్తె మృతి చెందడంతో ఆ తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం. వ్యాన్ డ్రైవర్ సెల్‌ఫోన్ చూస్తూ నిర్లక్ష్యంగా వాహనం నడపడం, కాలం చెల్లిన బస్సులను వాడటం, అతి వేగంగా నడపడం తదితర కారణాలు తమ బిడ్డను బలిగొన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. మరో చిన్నారి ప్రాణాలు బలి కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు వేడుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment