మనవరాలిపై తాత అనుచిత ప్రవర్తన
పాప తండ్రి గల్ఫ్ నుంచి వచ్చి.. చంపేసి..
సామాజిక మాధ్యమాల్లో వీడియో విడుదల
నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఓబులవారిపల్లె : మనవరాలి వరుస అయిన ఓ బాలికపై.. వృద్ధుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న తండ్రి గల్ఫ్ నుంచి వచ్చి అతన్ని సినీ ఫక్కీలో హత్య చేశాడు. తిరిగి వెంటనే గల్ఫ్ దేశానికి వెళ్లాడు. అయితే ఆ హత్య తానే చేశానని ఒప్పుకొంటూ.. సామాజిక మాధ్యమాల్లో వీడియో విడుదల చేయడం సంచలనంగా మారింది. ఈ హత్యోదంతానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కొత్త మంగంపేట పునరావాస కాలనీ పదో వీధిలో శనివారం గుట్ట ఆంజనేయులు(59) అనే దివ్యాంగుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. హత్య చేసింది అయ్యలరాజుపల్లె దళితవాడకు చెందిన జెడ్డా ఆంజనేయ ప్రసాద్‌గా నిర్ధారించుకున్నారు. గ్రామంలో పోలీసులు విచారణ చేయడం, ఇతర గొడవలు, కుమార్తె పట్ల సొంత బంధువు వ్యవహరించిన తీరు వల్లే హత్య జరిగిందని పోలీసులకు క్లూ దొరకడంతో.. కువైట్‌లో ఉన్న జెడ్డా ఆంజేయప్రసాద్ విషయం తెలుసుకొని తనే హత్య చేశానని సామాజిక మాధ్యమాల్లో వీడియోను విడుదల చేయడం వైరల్‌గా మారింది.
గతంలో..
జెడ్డా ఆంజనేయప్రసాద్ తన భార్య చంద్రకళతో కలిసి బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లాడు. తన 12 ఏళ్ల కుమార్తెను కొత్త మంగంపేటలోని చంద్రకళ చెల్లెలు లక్ష్మి, వెంకటరమణ దంపతుల వద్ద వదిలి వెళ్లారు. లక్ష్మి మామ దివ్యాంగుడైన గుట్ట ఆంజనేయులు వరుసకు మనవరాలు అయిన ఆ 12 ఏళ్ల పాపపై అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో కువైట్‌లో ఉన్న ఆంజనేయప్రసాద్ భార్య చంద్రకళ అదే పనిగా ఇండియాకు వచ్చి సొంతూరైన ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్‌లో వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు అంతగా పట్టించుకోకపోవడం, దివ్యాంగుడిని పిలిచి మందలించి పంపడంతో ఒకింత ఆంజనేయప్రసాద్ కుటుంబం మనసు నొచ్చుకుని ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నారు. దివ్యాంగుడు బయట తిరుగుతూ కవ్వింపు చర్యలతో అందరికీ ఫోన్లు చేస్తూ ఏమీ చేయలేరని చెప్పుకుంటున్న తరుణంలోనే.. ఆంజనేయప్రసాద్ కుటుంబం దివ్యాంగుడు గుట్ట ఆంజనేయులును అంతమొందించాలని వ్యూహం రచించి పథకం ప్రకారమే హత్య చేసినట్లు సమాచారం.
చైన్నెలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఆంజనేయప్రసాద్‌కు పోలీసులు ఫోన్ చేసి లొంగిపోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల కిందట ఆయన విడుదల చేసిన వీడియో కూడా సంచలనంగా మారింది. పోలీసులు నిందితుడిగా భావిస్తున్న ఆంజనేయ ప్రసాద్ దంపతులను గురువారం చైన్నె ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని జిల్లాకు తీసుకువచ్చి పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలియవచ్చింది.
వీడియోతో కలకలం
కువైట్‌లో ఉంటూ ఇక్కడికి వచ్చి హత్య చేసి అనంతరం మళ్లీ కువైట్ వెళ్లినట్లు చేసిన వీడియో సంచలనంగా మారింది. కుమార్తెను అసభ్యకరంగా మాట్లాడుతుండటంతో తుద ముట్టించాలని నిర్ణయించుకుని హత్య చేసినట్లు ఆంజనేయప్రసాద్ యూట్యూబ్‌లో పెట్టిన వీడియో కలకలం రేపింది. హత్య చేయాలని నిర్ణయించుకుని కువైట్ నుంచి ఇక్కడికి వచ్చి.. కొత్తమంగంపేటలో నిద్రిస్తున్న గుట్ట ఆంజనేయులు తలపై బలంగా కొట్టడంతో చనిపోయాడని.. హత్య చేసి తిరిగి కువైట్‌కు వెళ్లి పోయినట్లు వీడియోలో స్పష్టం చేశాడు. తన కూమర్తెకు జరిగిన అన్యాయాన్ని జీర్ణించుకోలేక హత్య చేశానని, తాను స్వచ్ఛందంగా పోలీసులకు లొంగి పోతానని సోషల్ మీడియాలో ఆంజనేయ ప్రసాద్ పోస్టు చేశాడు.
ఎస్‌ఐ ఏమంటున్నారంటే...
ఓబులవారిపల్లె ఎస్‌ఐ మహేష్‌ను ఈ విషయమై ‘సాక్షి’ అడగగా.. కేసు నుంచి తప్పించుకునేందుకే ఆంజనేయ ప్రసాద్ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టాడని తెలిపారు. చాలా రోజుల నుంచి కుటుంబ కలహాలు ఉన్నాయని, పాప విషయంలో పోలీస్‌స్టేషన్‌లో తల్లి కేసు పెట్టకుండానే కువైట్ వెళ్లిపోయిందని పేర్కొన్నారు. న్యాయం జరగలేదనిపిస్తే పై స్థాయి అధికారులు చాలా మంది ఉన్నారని, వారికి ఫిర్యాదు చేసి ఉండాల్సిందన్నారు. అంతేగానీ హత్య చేయడం ఏమిటని.. ఇది నేరం అవుతుందన్నారు.
అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొత్తమంగంపేటలో… pic.twitter.com/PxuBVI5WQL— Telugu Scribe (@TeluguScribe) December 12, 2024
Comments
Please login to add a commentAdd a comment