అభివృద్ధికి దిక్సూచి.. వైఎస్‌ రాజశేఖరరెడ్డి | 14th Death Anniversary Of YS Rajasekhara Reddy - Sakshi
Sakshi News home page

అభివృద్ధికి దిక్సూచి.. వైఎస్‌ రాజశేఖరరెడ్డి

Published Sat, Sep 2 2023 4:40 AM | Last Updated on Sat, Sep 2 2023 9:26 AM

14th Death Anniversary Of YS Rajasekhaar Reddy - Sakshi

వైఎస్‌ రాజశేఖరరెడ్డి.. వైఎస్సార్‌.. ఈ పేరు రాష్ట్ర ప్రజలకు ఓ భరోసా. అన్నదాతలకు అండ. సంక్షేమానికి, అభివృద్ధికి చిరునామా. అర్హతే ప్రామాణికంగా సంతృప్తస్థాయిలో పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించిన మహనీయుడు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పేద విద్యార్థులను ఉన్నత విద్య చదివించిన విద్యా దాత. ఆరోగ్య శ్రీ పథకంలో నిరుపేదలకు కార్పొరేట్‌ వైద్యాన్ని అందించిన ప్రాణ దాత. పంట ఎండినా నష్టపోమనే ధీమా రైతులకు కల్పించడం ద్వారా వ్యవసాయాన్ని పండగలా మార్చిన రైతు బాంధవుడు. జలయజ్ఞం ద్వారా అనేక ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన మహా నేత.

పారదర్శకమైన పారిశ్రామిక విధానంతో పెట్టుబడులు వరదెత్తేలా చేసి.. ఉపాధి అవకాశాలను పుష్కలంగా కల్పించిన వైఎస్సార్‌.. మూడు పోర్టులు నిర్మించి ఎగుమతులకు రాష్ట్రాన్ని కేంద్రంగా మార్చారు. ఐటీ ఎగుమతుల్లో 566 శాతం వృద్ధి సాధించారు. ఆర్థిక మాంద్యం ముప్పును ఎలా అధిగమించాలో చాటిచెప్పి, అభివృద్ధికి సరైన నిర్వచనం చెప్పారు. సంక్షేమాభివృద్ధి పథకాలతో తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని జ్ఞాపకంగా నిలిచిన మహానేత వైఎస్సార్‌ అమలు చేసిన పథకాలనే కేంద్రం, అనేక రాష్ట్రాలు చేపట్టాయి. పరిపాలనలో మానవత్వాన్ని జోడించి నవయుగానికి నాంది పలికిన మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం.. 

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగులో 1949 జూలై 8న వైఎస్‌ రాజారెడ్డి, జయమ్మ దంపతులకు జన్మించిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి వైద్య విద్యను అభ్యసించారు. పులివెందులలో ఆస్పత్రిని ఏర్పాటు చేసి.. రూపాయికే వైద్యం చేసి రూపాయి డాక్టర్‌గా ప్రజల మన్ననలు పొందారు. డాక్టర్‌గా ప్రజల నాడి తెలిసిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి.. 1978లో రాజకీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి 2009 సెప్టెంబరు 2న హెలికాప్టర్‌ ప్రమాదంలో హఠాన్మరణం చెందే వరకు తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారు. 

సీఎంగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలించింది ఐదేళ్ల మూడు నెలలే ఆ కొద్ది కాలంలోనే ప్రజలకు ఎంత మేలు చేయొచ్చో చూపించారు. సంక్షేమం, అభివృద్ధికి మానవీయతను జోడించిన మహనీయుడు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఐదేళ్ల మూడు నెలలే పని చేశారు. మంచి చేయాలన్న మనసుంటే.. ప్రజలకు ఎంత మేలు చేయవచ్చో ఆ కొద్ది కాలంలోనే చేసి చూపించారు. సమగ్రాభివృద్ధి వైపు రాష్ట్రాన్ని ఎలా పరుగులెత్తించవచ్చో దేశానికే చాటి చెప్పారు. అందుకే ఆ మహానేత భౌతికంగా దూరమై 14 ఏళ్లు దాటిపోయినా, ఇప్పటికీ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.

పేద బిడ్డల చదువులకు పెన్నిధి.. పేదరికానికి విద్యతో విరుగుడు
పేదరికం వల్ల ఏ ఒక్కరూ ఉన్నత చదువులకు దూరం కాకూడదన్న లక్ష్యంతో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి రూపకల్పన చేశారు. మెడిసిన్, ఇంజినీరింగ్‌ వంటి ఉన్నత చదువులు పేదవాడి సొంతమైతేనే పేదరికం నిర్మూలన సాధ్యమని ఆయన బలంగా నమ్మారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ద్వారా లక్షలాది మంది నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోన్న ఓసీ విద్యార్థులు ఉన్నత చదువులను అభ్యసించి.. దేశ, విదేశాల్లో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు.

దీనివల్ల లక్షలాది కుటుంబాలు పేదరికం నుంచి బయటపడ్డాయి. ఉన్నత చదువులను అందరికీ అందుబాటులోకి తేవడం కోసం జిల్లాకు ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెంలో ఉద్యాన వర్శిటీని.. తిరుపతిలో పశు వైద్య కళాశాలను నెలకొల్పారు. ప్రతిష్ఠాత్మక జాతీయ విద్యా సంస్థ ఐఐటీ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ)ని హైదరాబాద్‌ సమీపంలో కంది వద్ద ఏర్పాటు చేశారు. బాసర, ఇడుపులపాయ, నూజివీడు వద్ద ట్రిపుల్‌ ఐటీలను ఏర్పాటు చేసి లక్షలాది మందికి ఉన్నత చదవులు దక్కేలా చేశారు. నిరుపేదలను విద్యావంతులుగా తీర్చిదిద్దే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ఆ తర్వాత అనేక రాష్ట్రాలు అమల్లోకి తెచ్చాయి.

పారిశ్రామికాభివృద్ధితో పుష్కలంగా ఉపాధి అవకాశాలు
ఉమ్మడి రాష్ట్రంలో 1995 నుంచి 2004 వరకు పరిపాలించిన చంద్రబాబు రాష్ట్రాన్ని అవినీతికి కేంద్రంగా మార్చారు. దాంతో సుదీర్ఘమైన తీర ప్రాంతం, సమృద్ధిగా సహజవనరులు, పుష్కలంగా మానవ వనరులు అందుబాటులో ఉన్నా పెట్టుబడుల ఆకర్షణలో ఏడో స్థానానికి పరిమితమైంది. వైఎస్సార్‌ అధికారంలోకి వచ్చాక పారదర్శకమైన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించారు. దాంతో రాష్ట్రంలోకి పెట్టుబడులు వెల్లువెత్తాయి. పెట్టుబడుల ఆకర్షణలో 2004 నుంచి 2009 వరకు రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది.

భారీ ఎత్తున పరిశ్రమలు ఏర్పాటవడంతో ఉపాధి అవకాశాలు పుష్కలంగా వచ్చాయి. సుదీర్ఘమైన తీర ప్రాంతాన్ని వినియోగించుకోవడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రచించిన వైఎస్సార్‌.. యుద్ధప్రాతిపదికన గంగవరం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులు నిర్మించారు. దాంతో ఎగుమతులు భారీ ఎత్తున పెరిగాయి. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి హైదరాబాద్‌ను ప్రపంచ చిత్రపటంలో నిలిపారు. తద్వారా హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమ వేళ్లూనుకునేలా చేశారు. దాంతో ఐటీ ఎగుమతులు 566 శాతం పెరిగాయి.   

జీవచ్ఛవంలా మారిన కాంగ్రెస్‌కు పాదయాత్రతో జీవం 
అటు కేంద్రంలో.. ఇటు రాష్ట్రంలో వరుస ఓటములతో 2003 నాటికి కాంగ్రెస్‌ పార్టీ జీవచ్ఛవంలా మారింది. ఆ దశలో రాష్ట్రంలో పాదయాత్ర చేశారు వైఎస్‌ రాజశేఖరరెడ్డి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి మండుటెండలో 2003 ఏప్రిల్‌ 9న ప్రజాప్రస్థానం పాదయాత్రను ప్రారంభించారు. 2003 జూన్‌ 15న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద ముగించారు. మండుటెండలో 1,475 కిలోమీటర్ల వైఎస్సార్‌ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తన పాదయాత్రతో కాంగ్రెస్‌కు జీవం పోసి 2004లో ఇటు ఉమ్మడి రాష్ట్రంలోను,  అటు కేంద్రంలోనూ కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు. సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ, జలయజ్ఞం ప్రాజెక్టులతో, రైతు పథకాలతో వ్యవసాయాన్ని పండగల మార్చి ప్రజారంజక పాలన అంటే ఏమిటో దేశానికి చూపించారు. 

పాలకుడంటే ఎలా ఉండాలో చాటిచెప్పిన నేత
పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు 2004 మే 14న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపై నుంచే వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ సరఫరా ఫైలుపై తొలి సంతకం చేసి రైతు రాజ్యానికి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పునాది వేశారు. పంటలు పండక విద్యుత్‌ ఛార్జీలు కట్టలేని రైతులపై టీడీపీ సర్కారు రాక్షసంగా బనాయించిన కేసులను ఒక్క సంతకంతో ఎత్తేయడం ద్వారా పాలకుడంటే ఎలా ఉండాలో చాటిచెప్పారు. రూ.1,100 కోట్ల వ్యవసాయ విద్యుత్‌ బకాయిలను మాఫీ చేశారు.

దాదాపు 35 లక్షలకు పైగా పంపు సెట్లకు ఉచిత విద్యుత్‌ను అందించారు. రూ.400 కోట్లతో మొదలైన వ్యవసాయ విద్యుత్‌ సబ్సిడీ ఆ తర్వాతి ఏడాదికి రూ.6 వేల కోట్లకు చేరినా ఉచిత విద్యుత్‌ హామీ అమలుపై వెనక్కు తగ్గలేదు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఇస్తే విద్యుత్‌ తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనని ఎగతాళి చేసిన నేతలు కూడా అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్ని కొనసాగించాల్సిన పరిస్థితిని కల్పించారు.

వైఎస్సార్‌ స్ఫూర్తితో దేశంలో అనేక రాష్ట్రాలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నాయి. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించారు. పంట ఎండినా రైతు నష్టపోకూడదనే లక్ష్యంతో పంటల బీమాను అమలు చేశారు. ఇన్‌ఫుట్‌ సబ్సిడీని అందించారు. పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వంతో  పోరాడారు. 2004 నుంచి 2009 మధ్య ధాన్యం కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.550 నుంచి రూ.1000 వరకు పెరగడమే అందుకు తార్కాణం.

మాంద్యం ముప్పును తప్పించిన ఆర్థికవేత్త
2007–08, 2008–09 సంవత్సరాల్లో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలను ఆర్థిక మాంద్యం అతలాకుతలం చేసింది. ఆ మాంద్యం ప్రభావం దేశంపైనా పడింది. కానీ.. వైఎస్సార్‌ దాని ముప్పు ప్రభావం రాష్ట్రంపై పడకుండా చేయగలిగారు. సాగునీటి ప్రాజెక్టులు, పేదల ఇళ్ల నిర్మాణం, రహదారులు వంటి అభివృద్ధి పనులు చేపట్టి మార్కెట్లోకి ధనప్రవాహం కొనసాగేలా చేశారు. వాటి ద్వారా రాష్ట్రానికి పన్నులు వచ్చేలా చేసి.. మాంద్యం ముప్పు నుంచి రాష్ట్రాన్ని కాపాడారు. వైఎస్సార్‌ ఆర్థిక ప్రణాళికను చూసి అప్పట్లో ఆర్థిక నిపుణులు ప్రశంసించారు.

ఇది కూడా చదవండి: ఒకటో తేదీనే 52.70 లక్షల మందికి రూ.1,451.41 కోట్ల పింఛన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement