ఘనంగా ‘సావిత్రి’కి సీమంతం | Guntur Man Perform Baby Shower To Cow | Sakshi
Sakshi News home page

Baby Shower To Cow: ఘనంగా ‘సావిత్రి’కి సీమంతం

Published Sat, Oct 30 2021 8:59 PM | Last Updated on Sat, Oct 30 2021 9:31 PM

Guntur Man Perform Baby Shower To Cow - Sakshi

యడ్లపాడు(గుంటూరు): ఉమ్మడి కుటుంబాలే కాదు.. రక్తసం‘బంధం’ బలం తగ్గిపోతున్న కాలమిది. కన్నవారే కాదు..కట్టుకున్న ఆలిని సైతం మరిచిపోతున్న రోజులివి. మానవత్వాని మించి ‘మనీ’కే మనిషి విలువిస్తున్న కలియుగం ఇది. తొలి చూలాలైన గోవుకు సంప్రదాయ బద్దంగా ‘సీమంతం’ చేసి సమానత్వాన్ని చాటాడో యువకుడు. పశువులపై మనిషికున్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేశాడు. ఆదినుంచే ప్రకృతిలోని ప్రతిజీవితో అనుబంధం ఉందన్న విషయాన్ని తెలియజేశాడు. పశువు రూపాన ఉన్న పరమాత్మ స్వరూపమని, గోవుని మించి దైవం లేదని నిరూపించారు. 

ఎక్కడంటే...
గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన గుంటుపల్లి వెంకటేశ్వరబాబు ‘లా’ పూర్తిచేసినా వ్యాపార రంగంవైపే మొగ్గుచూపాడు. తన కుటుంబ సభ్యుల నుంచి గోసేవ, గోపూజను వారసత్వంగా పొందాడు. పట్టణంలోని పురుషోత్తమపట్నం షిరిడిసాయి మందిరంలో గోశాల, సుబ్బయ్యతోట గోశాల, ఆవులదొడ్డిగా పిలిచే గుండయ్యతోట గోశాలను సందర్శిస్తాడు. ఉదయాన్నే వెళ్లి మార్కెట్‌ నుంచి తెచ్చిన ఆకుకూరలు, కూరగాయలు శుభ్రపరిచి గోవులకు తినిపిస్తాడు. వాటిచుట్టూ ప్రదక్షిణలు చేసి నమ్కరించాక దినచర్యలు ప్రారంభం అవుతాయి.

శుభకార్యనికి...శుభముహూర్తం
ఆవులదొడ్డిలోని గోవులన్నింటికీ ప్రత్యేకమైన పేర్లు ఉంటాయి. వీటిలో పూజ అనేగోవుకు పుట్టిన సావిత్రి ఇటీవల కాలంలో గర్భం దాల్చింది. అక్కడి పనివార్ల ద్వారా బాబుకు ఆ విషయం తెలిసి ఆనందపడ్డాడు. తమ ఇంటి ఆడపడుచు గర్భం దాల్చిన విధంగా పొంగిపోయారు. తమ ఇంట ఆడపడుచుకు ఎలా శుభకార్యం చేసేవారో అలాగే చేయాలని బాబు కుటుంబం నిర్ణయించింది. గోవుకు సీమంతం చేస్తున్నామంటూ బంధుమిత్రులకు ఆహ్వానం పలికాడు. వేద పండితుడి వద్దకెళ్లి ముహుర్తం ఖరారు చేయించాడు.

కదిలొచ్చిన నాలుగు కుటుంబాలు 
సావిత్రి సీమంత ఆహ్వానం అందుకున్న వెంకటేశ్వరబాబు అక్కాబావలు ఉదయ్‌శంకర్, మహాలక్ష్మి దంపతులు, ఆక శేషసాయి, శాంతిలక్ష్మికుమారి దంపతులు, మిత్రులైన విప్రొ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఉద్యోగి ఏఎస్‌వీఎస్‌ శాస్త్రి, విజయ దంపతులు, మిత్రబ్యాంక్‌ ఫీల్డ్‌ఆఫీసర్‌ ప్రసాదరావు, శ్యామలా దంపతులు వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. సేవలోనూ, పూజలోనూ తమవంతు భాగస్వామ్యాన్ని సంతోషంగా స్వీకరించారు. 

ఘనంగా సావిత్రికి సీమంతం
9నెలల నిండు గర్భిణీ సావిత్రిని గోవును పూలతో చక్కగా ముస్తాబు చేశారు. పసుపు, కుంకుమను పూసి కొమ్ములకు రంగురంగుల గాజుల్ని తొడిగారు. కాళ్లకు గజ్జెలు కట్టారు. స్వయంగా వండి తెచ్చిన చలిమిడి, పిండివంటల్ని తృప్తిగా తినిపించారు. నూతన వస్త్రాలను సమర్పించారు. పండితుల వేదమంత్రాలతో ముత్తయిదువులచే మంగళ హారతులు ఇచ్చారు. ఈ శుభకార్యానికి హాజరైన బంధుమిత్రులు ఇందులో భాగస్వామ్యం అయ్యారు. మనఃపూర్వకంగా ఆవును ఆశీర్వదించారు. తమ ప్రేమను చాటుకున్నారు. 

చివరిగా గోశాలలోని పనివార్లకు తాంబూలాలు, స్వీట్లను పంపిణీ చేశారు. మనుషుల కంటే గోవు సీమంతానికి ఎక్కువమంది హాజరు కావడం విశేషం. కన్నతల్లిదండ్రులనే వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్న ఈ రోజుల్లో ఓ ఆవుకు ఇలా సీమంతం చేయడం గొప్ప విషయమని పట్టణ వాసులు కార్యక్రమం నిర్వహించిన దంపతులను అభినందించారు.

వినిగానే విశేషంగా అనిపించింది...శ్యామలా, గృహిణి
సావిత్రికి సీమంతం చేయడం ఎంతో విశేషంగా అనిపించింది. ఆవు యొక్క విశిష్టత, పవిత్రత నేటì  తరానికి తెలీదు. తొలిసారిగా చూశాను. చాలా సంతోషంగా ఉంది. ఇలా చేయడం వలన భావితరాలకు తెలియజేసే అవకాశం ఉంటుంది. ఈ శుభకార్యంలో మేము భాగస్వాములు కావడం అదృష్టంగా భావిస్తున్నాం.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement