ఆదాయం–14, వ్యయం–11, రాజయోగం– 5, అవమానం– 6
మూల 1,2,3,4 పాదములు (యే, యో, బా, బీ)
పూర్వాషాఢ 1,2,3,4 పాదములు (బూ, ధా, భా, ఢా)
ఉత్తరాషాఢ 1వ పాదము (బే)
Dhanu Rashi Ugadi Rashi Phalalu 2026-2027: ఈ సంవత్సరం గురువు మిథునంలో (సప్తమం) జూన్ 1 వరకు ఉంటారు. జూన్ 1 నుండి అక్టోబర్ 31 వరకు, తిరిగి జనవరి 25 నుంచి సంవత్సరాంతం వరకు కర్కాటకంలో (అష్టమం) అక్టోబర్ 31 నుంచి జనవరి 25 వరకు సింహంలో (నవమం) సంచరిస్తారు. శని సంవత్సరం అంతా మీనంలో (చతుర్థం) సంచరిస్తారు. రాహువు డిసెంబర్ 6 వరకు కుంభంలో (తృతీయం) కేతువు సింహంలో (భాగ్యం); తర్వాత రాహువు మకరం (ద్వితీయం)లో కేతువు కర్కాటకంలో (అష్టమం) సంచరిస్తారు.
దైనందిన కార్యక్రమాలలో చిన్న చిన్న సమస్యలు. సకాలంలో పనులు పూర్తి చేసుకోవడానికి శ్రమిస్తారు. కుటుంబ విషయాలలో అనుకూలత తక్కువ. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఆదాయ వ్యయాలు సమతూకంగా ఉండవు. దేహ గాంభీర్యం కోల్పోయే అవకాశం ఉన్నది. ఫైనాన్స్ వ్యాపారులకు సమస్యలు రాగలవు. అనవసర ఋణాలు చేస్తారు. ఆరోగ్య విషయాలలో ద్వితీయార్ధంలో చికాకులు. ఉద్యోగ కార్యకలాపాలలో నిబద్ధతతో విధి నిర్వహణ చేయవలసిన కాలం.
మార్కెటింగ్ ఉద్యోగులు ఎంతో శ్రమిస్తేనే తప్ప టార్గెట్‌లు చేరుకోలేరు. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో చికాకులు. నూతన వ్యాపార ప్రయత్నాలలో ఉన్నవారు తొందరపడి చేస్తున్న వ్యాపారం మానవద్దు. షేర్ వ్యాపారులకు శ్రమ ఎక్కువ. లాభాలు తక్కువ. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితాలు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లో ఎక్కడా ఇబ్బంది ఉండదు. కోర్టు వ్యవహారాలు సానుకూలం. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం. ఈ రాశి స్త్రీలకు అనాలోచిత ప్రవర్తన వల్ల చికాకులు. సంఘంలో గౌరవ మర్యాదలు. ఉద్యోగం ఒత్తిడి. వైద్య ఖర్చులు అధికం.
మూల: ఆర్థిక లావాదేవీలు భారంగా ఉంటాయి. వ్యాపారులకు ఇబ్బందులు. సమయపాలన ఉండదు.
పూర్వాషాఢ: తరచుగా అలసట, శ్రమ. చోర, అగ్ని, అధికార బాధలు. మాట తీరుతో సమస్యలు తలెత్తుతాయి.
ఉత్తరాషాఢ 1: ప్రతిపనిలోనూ ప్రారంభంలో ధనం సమకూరక ఇబ్బందిపడటం, క్రమంగా సర్దుబాటు జరిగి పనులు పూర్తి చేసుకోవడం వంటివి ఉంటాయి. తరచుగా బుద్ధి భ్రంశానికి లోనవుతారు.
శాంతిమార్గం: గురువుకు, శనికి శాంతి చేయించుకోవడం అవసరం. ప్రాతఃకాలంలో ఆంజనేయస్వామి దేవాలయంలోనూ, ప్రదోషకాలంలో ‘శ్రీమాత్రే నమః’ అని చెబుతూ శివాలయంలో 11 ప్రదక్షిణలు చేయండి. నిత్యం గోసేవ చేయండి. కుదిరినప్పుడు యతీశ్వరులను ధర్శించి సేవించండి. చతుర్ముఖ రుద్రాక్షధారణ శుభప్రదం.
ఏప్రిల్: అన్ని వ్యవహారాలలోను 19వ తేదీ లోపల వేగం పెంచండి. 19వ తేదీ నుంచి వ్యవహార ప్రతిబంధక అంశాలలో బాగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోండి. వృత్తి విషయాలలో దూకుడు తగ్గించాలి. షేర్ వ్యాపారులకు సామాన్య ఫలితాలు, విద్యార్థులకు మంచి ఫలితాలు.
మే: కోపావేశములు నియంత్రించుకోవాలి. రోజువారీ పనులపై దృష్టి కేంద్రీకరించండి. కొత్త పనులు చేపట్టవద్దు. ప్రతిపనీ స్వయంగా చేసుకోవలసి వస్తుంది. తద్వారా పని ఒత్తిడి పెరుగుతుంది. అధికారులు, కింది ఉద్యోగల వల్ల చికాకులు.
జూన్: ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దు. మీ వ్యవహారాలలో ఇతరుల ప్రమేయం తగ్గించండి. ఆదాయ వ్యయాల సమన్వయంపై దృష్టి ఉంచండి. ఉద్యోగ విధి నిర్వహణలో అన్యమనస్కంగా వ్యవహరిస్తే ఇబ్బందులు తప్పవు. స్నేహితుల సహాయ నిరాకరణ తరచుగా ఉంటుంది.
జులై: అన్ని వ్యవహారాలలో ఓర్పు ప్రదర్శించాలి. ఇతరుల మీద ఆధారపడి పనులు చేయవద్దు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు పాటించండి. పాత ఋణాల పట్ల జాగ్రత్తపడండి. అనవసర ప్రయాణాలు తగ్గించండి.
ఆగస్ట్: చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన కాలం. వృథా ఖర్చులు, అనవసర ప్రయాణాలు చేయవద్దు. ఇతరులకు హామీలు ఇవ్వవద్దు. భార్య తరపు బంధువుల రాకపోకలు పెరుగుతాయి. తరచుగా శుభకార్య నిమిత్తం చేసే ప్రయాణాలలో అధిక వ్యయం జరుగుతుంది.
సెప్టెంబర్: ఎంతో శ్రమతో తెలివిగా పరిస్థితులు చక్కబెడతారు. భోజన, వస్త్ర, స్నాన సౌకర్యాలు కూడా ఇబ్బందికరం. కుటుంబ సభ్యులతో కలహాలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ, వృత్తి విషయాలను ఇతరులతో చర్చించకండి.
అక్టోబర్: తరచుగా శుభవార్తలు, పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు. కుటుంబ పెద్దల ఆరోగ్యంలో మంచి మార్పు. తరచు చోర, అగ్ని, రోగ భయాలు. శరీర సౌష్టవం, మాటల గాంభీర్యం కోల్పోతారు.
నవంబర్: ఇబ్బందుల నుంచి బయటపడతారు. నూతన ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు వేగం అందుకుంటాయి. కావలసిన ఋణ సౌకర్యం, సహకారం అందుతాయి. శుభకార్య ప్రయత్నాలు సఫలం. విద్యార్థులకు అనుకూలం కాదు.
డిసెంబర్: మంచి మార్పులు ప్రారంభం. పనులు సానుకూలం. చాలాకాలంగా ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు. ఆర్థిక వెసులుబాటు.
ప్రయాణాలు, అలంకరణ వస్తువుల కొనుగోలు అధికం.
జనవరి: తరచుగా చోర, రోగ, అగ్ని భయం. వాహన సమస్యలు, ఖర్చులు. తరచుగా ద్రవ్యలోపం. ఆరోగ్య, ఋణ విషయాలలో సమస్యలు. ఉద్యోగ వ్యాపారాలలో డబ్బు ఇబ్బందులు, అధికార ఒత్తిడి. నమ్మిన వారు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది.
ఫిబ్రవరి: మందకొడితనం ఆవహిస్తుంది. పనులు వేగం చేయలేరు. అన్ని పనులూ శ్రమతో పూర్తి అవుతాయి. ఆర్థిక, కుటుంబ, ఉద్యోగ విషయాలను సమన్వయం చేయలేరు. దూర ప్రయాణాలు విరమించడం మంచిది. విద్యార్థులు జాగ్రత్తగా వ్యవహరించ వలసిన కాలం.
మార్చి: ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చూసుకోవాలి. అనవసర విషయాలలో తలదూర్చవద్దు. ఉద్యోగ, కుటుంబ వ్యవహారాలలో శ్రమచేసి లబ్ధి పొందుతారు. నూతన ఉద్యోగ వ్యాపారాలు ఇబ్బందికరం. అధికారుల అండ ఉన్నా, వృత్తి చికాకులు తప్పవు. విద్యార్థులకు అనుకూలం కాదు.


