మేష రాశి: ఆర్థికంగా అనుకూలం - పనుల్లో ఒత్తిడి! | Mesha Rashi Ugadi Rashi Phalalu 2026-27 In Telugu, Know Your Sri Parabhava Nama Samvatsara Mesha Rashi Astrology Predictions | Sakshi
Sakshi News home page

Mesha Rashi Predictions: ఆర్థికంగా అనుకూలం - పనుల్లో ఒత్తిడి!

Mar 18 2026 6:00 AM | Updated on Mar 18 2026 11:36 AM

Mesha Rashi - Sri Parabhava Nama Samvatsara Rashi Phalalu 2026-27

ఆదాయం11, వ్యయం5, రాజయోగం2, అవమానం4.
అశ్విని 1,2,3,4 పాదములు (చూ, చే, చో, లా)
భరణి 1,2,3,4 పాదములు (లీ, లూ, లే, లో)
కృత్తిక 1వ పాదము (ఆ)

Mesha Rashi Ugadi Rashi Phalalu 2026-2027: ఈ సంవత్సరం గురువు మిథునంలో (తృతీయం) జూన్‌ 1 వరకు ఉంటారు. జూన్‌ 1 నుంచి అక్టోబర్‌ 31 వరకు, తిరిగి జనవరి 25 నుంచి సంవత్సరాంతం వరకు కర్కాటకంలో (చతుర్థం) అక్టోబర్‌ 31 నుంచి జనవరి 25 వరకు సింహంలో (పంచమం) సంచరిస్తారు. శని సంవత్సరం అంతా మీనంలో (వ్యయం) సంచరిస్తారు. రాహువు డిసెంబర్‌ 6 వరకు కుంభంలో (లాభం), కేతువు సింహంలో (పంచమం); తర్వాత రాహువు మకరం (దశమం)లో కేతువు కర్కాటకంలో (చతుర్థం) సంచరిస్తారు. 

విశేష గౌరవ మర్యాదలు అందుకుంటారు. పుణ్యకార్యాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చే విషయంలో శ్రద్ధ వహించరు. అనవసర విషయాలతో సమస్యలు కొని తెచ్చుకుంటారు. ఏలినాటి శని ప్రభావంగా కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపాలు ఉంటాయి. ఆర్థికంగా క్రమక్రమంగా మంచి మార్పులు ఉంటాయి. ఖర్చులు అదుపు చేయలేరు. వస్త్రాభరణ వాహనాదుల కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తారు. కొత్త ఋణాలు సమయానికి అందుబాటు అవుతాయి. ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తారు. ఉద్యోగాలలో ఆశించిన రీతిగా ప్రమోషన్‌ లు ఉండవు. స్థానచలన ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. ప్రతిపనిలోనూ శ్రమ, ఒత్తిడి ఎక్కువవుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. 

వ్యాపారులకు ఒత్తిడి పెరిగినా, లాభదాయకంగానే ఉంటుంది. మార్కెటింగ్‌ ఉద్యోగులకు శుభ పరిణామాలు. నూతన వ్యాపార ప్రయత్నాలలో పనులు వేగవంతం అవుతాయి. షేర్‌ వ్యాపారులకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితాలు అందుతాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి ధనం, కాలం అధికంగా ఖర్చు అవుతాయి. కోర్టు వ్యవహారాలలో చిక్కులు తప్పవు. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాల ప్రయత్నాలు జోరుగా సాగుతాయి. స్త్రీలకు ఉద్యోగాలలో ఒత్తిడి ఎక్కువవుతుంది. ఆరోగ్య రక్షణ, కుటుంబ రక్షణలో విజయవంతం అవుతారు. గర్భిణులకు ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. 

అశ్విని: ఉద్యోగంలో అధికారుల సహాయ నిరాకరణ ఎదురవుతుంది. బంధువులతో తరచుగా కలçహాలు ఉంటాయి. నూతన ప్రయత్నాలు విఫలం అవుతాయి. ఆర్థిక లావాదేవీలలో అసంతృప్తి ఎదురవుతుంది. ఇతరుల వ్యవహారాలలో కలుగ చేసుకొని అవమానపడుతుంటారు.

భరణి: ఆగ్రహావేశాలు ప్రదర్శించి, కలహాలలో చిక్కుకుంటారు. అన్ని అంశాలలో అగౌరవం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతరుల వ్యవహారాల జోలికి పోతే సమస్యలు తప్పవు. స్థానచలన, ప్రమోషన్‌ ప్రయత్నాలకు విఘ్నాలు ఎదురవుతాయి.
కృత్తిక: ఓర్పు నేర్పులతో సాధించుకుంటూ ముందుకు వెడతారు. పుణ్యక్షేత్ర సందర్శన, పుణ్యకార్యాలలో పాల్గొనడం ద్వారా ధనవ్యయం అధికంగా చేస్తుంటారు. నమ్మించి మోసం చేసేవారు అధికంగా ఉంటారు. వాహన మరమ్మతుల కోసం తరచు ధనవ్యయం అవుతుంది.

శాంతి మార్గం: శనికి జప దాన తర్పణలు చేయిస్తూ ఉండండి. రోజూ శివాలయంలో ప్రదోష కాలంలో ‘శ్రీమాత్రే నమః’ అని చెబుతూ 11 ప్రదక్షిణలు చేయండి. సుందరకాండ, గజేంద్రమోక్షం పారాయణ, పంచముఖ రుద్రాక్షధారణ శుభప్రదం. 

ఏప్రిల్‌: ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకోండి. 10వ తేదీ తరువాత దూర ప్రయాణాలు విరమిస్తే మంచిది. ధనం వెసులుబాటు ఇబ్బందికరం అవుతూ ఉంటుంది. అధికారుల సహకారం తగ్గుతుంది. బుద్ధి చురుకుగా పనిచేసినా, పనులు శ్రమతో పూర్తవుతాయి. కొత్త ఋణాలు చేయడం మంచిది కాదు. వృథా  కాలక్షేపాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ పెద్దల ఆరోగ్య రీత్యా ఖర్చు పెరుగుతుంది. 

మే: తెలివి, ధైర్యం ఉన్నా, చాలా విషయాల్లో పనులు సానుకూలం కావు. ఆదాయ మార్గాలు బాగానే ఉన్నా, అనవసర ఖర్చులు నియంత్రించలేరు. ఆర్థిక వ్యవహారాలలో కుటుంబసభ్యులతో విభేదాలు రాగలవు. ఋణ సౌకర్యం బాగుంటుంది. ఆరోగ్యం చికాకు సృష్టిస్తుంది. విద్యార్థులకు, షేర్‌ వ్యాపారులకు గురుబలం అనుకూలం. 

జూన్‌: పనుల్లో ఆటంకాలు ఉంటాయి. 8వ తేదీ తరువాత మంచి మార్పులు. 20 తేదీ నుంచి కాలం ఇంకా బాగుంటుంది. 20వ తేదీ లోపల ఆరోగ్యం బాగా చూసుకోవాలి. అన్ని వ్యవహారాలలోనూ మంచి సలహాలు అందుతాయి. ఇతరులకు సలహాలిచ్చి అవమానాలు పొందుతారు. తరచు దేవాలయ సందర్శన చేస్తారు. 

జులై: కుటుంబ వ్యవహారాలను బాగా చక్కదిద్దుతారు. తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య స్నేహ బంధం బాగుంటుంది. వృత్తి విషయాలలో అధికారులకు, వర్కర్స్‌కు మధ్య బంధం బాగా ఉంటుంది. స్థానచలన, ప్రమోషన్‌ ప్రయత్నాలు స్వయంగా చేసుకోవడం మంచిది. ఆర్థిక విషయాలను స్వయంగా చక్కబెట్టుకుంటారు. గౌరవ మర్యాదలు పొందుతారు.

ఆగస్ట్‌: వృత్తి విషయంలో ఆధిపత్యం సాధిస్తారు. కుటుంబ కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేస్తారు. నూతన ప్రయత్నాలు వేగం పుంజుకుంటాయి. వ్యాపారులకు లాభాలు అందుతాయి. విద్యార్థులకు కాలం అనుకూలం. కోర్టు విషయాలు, శుభకార్య విషయాలు సానుకూలం. నూతన వస్తువుల కొనుగోలుకు అధిక ధనవ్యయం చేస్తారు. 

సెప్టెంబర్‌: అనవసర సంచారం పెరుగుతుంది. కుటుంబంలోని పెద్దల ఆరోగ్య పరిరక్షణ కారణంగా కొంతకాలం ఏ పనిలోనూ సమయపాలన కుదరదు. అధికారులు సహకరిస్తారు. ఋణాలు తీర్చే విషయంలో మాట నిలబెట్టుకోలేరు. 18వ తేదీ తరువాత మంచి మార్పులు ఉంటాయి. ఇతరుల పొరపాట్లకు మీరు సమాధానం చెప్పవలసిన పరిస్థితులు ఎదురవుతాయి.

 అక్టోబర్‌: కొన్నిసార్లు శారీరక శ్రమ, కొన్నిసార్లు మానసిక చికాకులతో ఇబ్బందులు పడతారు. జాగ్రత్తగా వ్యవహరించినా, వారికి మంచి ఫలితాలు దక్కక ఇబ్బందికరంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు స్వయంగా చూసుకోండి. ఖర్చుల నియంత్రణ మీద దృష్టి పెట్టాలి. ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి. దూర ప్రాంతాలకు స్వయంగా వాహనాలు నడపడం శ్రేయస్కరం కాదు. 

నవంబర్‌: ప్రతిపని సమస్యాత్మకం అవుతూ ఉంటుంది. ఉద్యోగ భద్రత మీద దృష్టి ఉంచండి. కుటుంబ విషయాలు సాధారణ స్థాయిగా ఉంటాయి. మనసుకు ఆనందం ఇచ్చే వార్తలు వింటారు. రోజువారీ పనుల్లో కూడా సొంత నిర్ణయాలు, సమయపాలన లేకపోవడం ఉంటాయి. పుణ్యకార్యాలపై శ్రద్ధ వహిస్తారు. పనులు వేగం పుంజుకుంటాయి. 

డిసెంబర్‌: పనులేవీ సరిగా సాగవు. ప్రధానంగా కుటుంబ ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. నూతన ప్రయత్నాలు సరిగా ఉండవు. కావలసిన వనరులు లభ్యంకాక వ్యాపారం ఇబ్బందికరం అవుతుంది. ఆరోగ్య పరిరక్షణ మీద దృష్టి పెడతారు. సమస్యలు పెరుగుతాయి. ధనం సర్దుబాటు కాకపోవడం వల్ల కొన్ని పనులను మధ్యలోనే వదిలేస్తారు. మాటతీరు నియంత్రించుకోవలసిన కాలం. 

జనవరి: ఆర్థిక లావాదేవీలను విజయవంతంగా నడుపుతారు. ఉద్యోగ వ్యాపారాలలో ప్రోత్సాహకర ఫలితాలు అందుతాయి. కుటుంబంలో మంచి వాతావరణం నెలకొని సుఖపడతారు. చాలా ప్రయాణాలు చేస్తారు. ఖర్చులు పెరుగుతాయి. బంధుమిత్రుల రాకపోకలు ఎక్కువ అవుతాయి. వీలైనంత వరకు మితభాషణ చేస్తూ ఉండండి. కొత్త ఋణాలు చేయవద్దు. 

ఫిబ్రవరి: అన్ని అంశాలలోను పురోగతి ఉంటుంది. తేలికగా పని ఒత్తిడిని ఎదుర్కొంటారు. అందరి నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ప్రతికూలత ఉన్న పనులు కూడా ఈ నెలలో ప్రారంభిస్తే సానుకూలం అవుతాయి. ఉద్యోగ వ్యాపారాలు సానుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో స్థానచలనం, ప్రమోషన్లు వంటివి ఆశించినట్లయితే, ఈ నెలలోనే వాటికి ప్రయత్నం ప్రారంభించాలి. 

మార్చి: ఉద్యోగంలో ఉన్న ఒత్తిడిని దాటవేస్తారు. అధికారుల అండదండలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా మారతాయి. శుభకార్య పుణ్యకార్య ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. అలంకరణ వస్తువులు, వాహనాల కొనుగోలు విషయాలలో దృష్టి పెంచుతారు. వ్యాపారులు జాగ్రత్తగా ఉండవలసిన కాలం. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలలో ఇబ్బందులు ఉంటాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement