మఘ 1,2,3,4 పాదములు (ము, మే, మూ, మే)
పుబ్బ 1,2,3,4 పాదములు (మో, టా, టే, టూ)
ఉత్తర 1వ పాదము (టే)
ఈ సంవత్సరం గురువు ఏప్రిల్ 13 వరకు కుంభం (సప్తమం)లోను తదుపరి మీనం (అష్టమి)లోను సంచారం చేస్తారు. శని ఏప్రిల్ 28 వరకు మరల జూలై 12 నుంచి 2023 జనవరి 17 వరకు మకరం (షష్ఠం)లోను మిగిలిన కాలం అంతా కుంభంలోను సంచరిస్తారు. ఏప్రిల్ 12 వరకు రాహువు వృషభం (రాజ్యం) కేతువు వృశ్చికం (చతుర్థం)లోనూ తదుపరి రాహువు మేషం (భాగ్యం) కేతువు తుల (తృతీయం)లో సంచరిస్తారు.
2022 ఆగస్టు 10 నుంచి 2023 మార్చి 12 వరకు కుజుడు వృషభం (దశమం)లో స్తంభన. మొత్తం మీద ఈ గోచారం సంవత్సరం అంతా అనుకూల ప్రతికూల ఫలితాలు మీ ప్రవర్తనపై ఆధారపడి ఉంటాయి. మకర శని సంచారం కుంభ గురు సంచార కాలం అనుకూలం. ఈ సంవత్సరం ఏ పని అయినా స్వయంగా చేసుకుంటే సానుకూలం. ఇతరుల మీద ఆధారపడితే ప్రతికూలం.
ప్రధానంగా ఆదాయం తక్కువగా ఉంటుంది. ఖర్చులు నియంత్రించుకోగలిగిన వారికి కాలం అనుకూలం. లేకుంటే, ఇబ్బందికరం. కావలసిన కొత్త ఋణాలు సమయానికి అందుబాటులో లేకపోవడంతో పాత ఋణాలు తీర్చే ప్రయత్నాలు ఇబ్బందికరంగా ఉంటాయి. కుటుంబ సమస్యలు ప్రత్యేకంగా ఏమీ ఉండవుగాని, తెలియని అవగాహన లోపాలు వెంబడిస్తుంటాయి. ఏప్రిల్ నుంచి మూడు నెలల కాలంలో వస్తువులు చోరీకి గురవడం, అనుకోని భయం, తరచుగా దేశాంతరం వెళ్ళవలసి రావటం వంటివి ఉంటాయి. కొన్ని సందర్భాలలో మౌనం చాలా శుభప్రదంగా ఫలిస్తుంది. గృహనిర్మాణ, శుభకార్య ప్రయత్నాలకు మంచి సూచనలు, సలహాలు అందుతాయి.
చతుష్పాద జంతువుల ద్వారా చికాకులు రాగలవు. తరచుగా ప్రయాణంలో ఆటంకాలు ఎదురవుతాయి. అధికారులను, ప్రభుత్వంలో పెద్దలను కలుసుకుంటారు. వ్యాపారాల్లో అనవసర పోటీలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారులకు సంవత్సరం అంతా శ్రమ ఒత్తిడి ఉంటుంది. అయినా, కాలం కలసివస్తుంది. ఉద్యోగులకు అధికారులతో పాటు తోటివారి సహాయ సహకారాలు బాగా ఉంటాయి. ప్రమోషన్ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. ఆరోగ్య విషయంలో పెద్ద ఇబ్బందులు ఉండవుగాని, శని, గురువుల ప్రభావం వల్ల మే జూన్ నెలల్లో తరచుగా ఉష్ణప్రకోపానికి లోనవడం, పాత రుగ్మతలు పునరావృతం కావడం వంటివి ఉంటాయి.
స్థిరాస్తి కొనుగోలుకు మే, జూన్ మాసాలలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు వేగంగా సాగుతాయి. మిత్రులు సహకరిస్తారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు సునాయాసంగా సాధ్యపడతాయి. షేర్ వ్యాపారులకు ఫైనాన్స్ వ్యాపారులకు కాలం అనుకూలంగా ఉన్నా, దూకుడుగా వ్యవహరించరాదు. విద్యార్థులకు శ్రమ చేసే కొద్దీ మంచి ఫలితాలు అందుతాయి. పోటీ పరీక్షలలో రాణిస్తారు. రైతులకు మంచి ఫలితాలు దక్కుతాయి. గర్భిణీస్త్రీలు నిత్యం అనవసర ఆలోచనలు చేస్తూ ఉంటారు. అయితే ఎటువంటి ఇబ్బందులూ ఉండవు.
మఘ నక్షత్రం వారికి హామీలు నిలబెట్టుకోలేని స్థితి వుంటుంది. ప్రయాణాల్లో చికాకులు, వాహనాల రిపేర్‌ల కారణంగా అధిక ఖర్చులు వుంటాయి. ప్రతిపనీ ఆలస్యమవుతుంది. ఖర్చులు అధికంగా ఉన్నా, చివరకు కొంతలాభం పొందుతారు. బంధుమిత్రులతో విభేదాలు రాకుండా జాగ్రత్తపడాలి.
పుబ్బ నక్షత్రం వారికి అంతా ఆలస్యమయంగా ఉంటుంది. ఈ నక్షత్ర గర్బిణిలు చాలా చికాకులు పొందే అవకాశం వుంటుంది. ఈ సంవత్సరం ఎప్పుడు అవకాశం కుదిరితే అప్పుడే పనులు త్వరగా పూర్తి చేసి లాభాలు అందుకోవాలని మీరు చేసే ప్రయత్నాలు చాలా తేలికగా సత్ఫలితాలనిస్తాయి.
ఉత్తరా నక్షత్రం వారికి తరచుగా విశ్రాంతి తీసుకోవాలనే కోరిక పెరుగుతుంది. అనవసర బాధ్యతలు పెరుగుతాయి. అందరికీ ఉపయోగపడే పనులు చేయడంలో ఎక్కువగా శ్రమిస్తారు. తరచుగా పూజ్యులను, పెద్దలను, ప్రభుత్వ పదవుల్లోని పెద్దలను దర్శించుకోవడం జరుగుతుంది.
శాంతి: నాలుగు ముఖాల రుద్రాక్ష ధరించడం ద్వారా ప్రశాంతత ఏర్పడుతుంది. మే మొదటివారంలో శని జపం చేయించండి. ప్రతిరోజూ ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణలు చేసి, లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేసినట్లయితే ప్రశాంతత లభిస్తుంది.
ఏప్రిల్: ధైర్యాన్ని ప్రదర్శిస్తారు. ఏ పని ప్రారంభించినా, పూర్తయ్యేదాకా చాలా దక్షతతో వ్యవహారిస్తారు. అందరి నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఆదాయ వ్యయాల మీద పట్టు సాధిస్తారు. ఆరోగ్య విషయమై శ్రద్ధ పెంచాలి. ద్వితీయార్ధంలో శనికి జపం చేయించండి. ఎవరి మీద ఆధారపడవద్దు.
మే: అన్ని అంశాల్లోనూ తెలియని అసంతృప్తి ఉంటుంది. పనులు వేగంగా సాగవు. కలహాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆదాయ, వ్యయాలు నియంత్రణలో ఉండవు. బంధువుల రాకపోకలు ఎక్కువ అవుతాయి. వృథా కాలక్షేపాలు, వృథా ప్రయాణాలు, వృథా ఖర్చులు ఉంటాయి. పెద్దల ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం.
జూన్: పనులకు అవాంతరాలు అధికమవుతాయి. దేశాంతరం వెళ్ళాలనే కోరిక ఎక్కువ అవుతుంది. ఋణాలు ఇచ్చి పుచ్చుకునే ప్రకరణంలో అవమానాలకు అవకాశం ఉంది. స్థానచలన, ప్రమోషన్ ప్రయత్నాల్లో జాగ్రత్తలు అవసరం. బంధుమిత్రుల రాకపోకల విషయంలో అధిక జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక వ్యవహారాలను స్వయంగా చూసుకోండి.
జూలై: చాలా అద్భుతమైన గోచారం అనే చెప్పాలి. సమయం వృథా చేయకుండా నడుచుకుంటే, అంతా ఆనందదాయకంగా ఉంటుంది. సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రధానంగా వృత్తి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ప్రతి విషయంలోనూ కుటుంబ సభ్యుల సహకారం అద్భుతంగా ఉంటుంది.
ఆగస్టు: సమస్యలు ఉన్న పనులను వదిలేసి, సమస్యలు లేని పనులు చేయడం ద్వారా కొంత సుఖపడతారు. అయితే పని ఎగవేసే ధోరణి సరి కాదని గమనించుకోండి. ఆర్థిక లావాదేవీలు సరిగా సాగవు. అందరితోనూ స్నేహపూర్వకంగా మెలగాలి. పనిముట్ల వాడకం ఇబ్బందికరం. ప్రయాణ చికాకులు ఎక్కువ.
సెప్టెంబర్: పనుల ఎగవేత ధోరణిని విడనాడాలి. ప్రతి పనిలోనూ శ్రమాధిక్యం ఎదురైనా, ఫలితాలు సానుకూలంగానే ఉంటాయి. ప్రతి విషయంలోనూ ధనవ్యయం అధికం అవుతుంది. సరైన సమయానికి డబ్బు వెసులుబాటు కాదు. అయితే ఋణ విషయాలు, ఖర్చులు, ఈ నెలలో కొంత చికాకు కలిగిస్తాయి.
అక్టోబర్ : ప్రారంభంలో కొన్ని ఇబ్బందులున్నా క్రమంగా అన్నీ తీరిపోయి మంచి ఫలితాలు వస్తాయి. 15వ తేదీ తరువాత వృత్తి సౌఖ్యం చాలా బాగుంటుంది. చాలా తెలివి ప్రదర్శిస్తారు. ఆర్థిక విషయాలలో చికాకులను క్రమంగా పరిష్కరించుకోగలుగుతారు. ఈ నెలలో స్నేహితులు బంధువుల సహకారం బాగుంటుంది.
నవంబర్: మాసారంభం నుంచి చక్కటి ఫలితాలు ఉంటాయి. అన్ని గ్రహాలు ఈ నెలలో అనుకూలిస్తాయి. శుభకార్యాలు త్వరగా నెరవేరుతాయి. ఉద్యోగ భద్రత బాగుంటుంది. అందరూ బాగా సహకరిస్తారు. పుణ్యకార్యాలు చేస్తారు. గురువులను, పూజ్యులను దర్శించుకుంటారు. ప్రశాంతంగా కాలం గడిచిపోతుంది.
డిసెంబర్: చాలా చక్కటి కాలం. అన్ని పనులూ చక్కగా పూర్తయి, ఆనందంగా ఉంటారు. డబ్బు వెసులుబాటు బాగుంటుంది. ఖర్చులను నియంత్రించగలుగుతారు. అందరి నుంచి మంచి సహకారం లభిస్తుంది. గత ఆరోగ్య సమస్యలకు ఈ నెలలో వైద్య సహాయం లభిస్తుంది. పుణ్యక్షేత్రాలను, గురువులను దర్శించుకుంటారు.
జనవరి: వృత్తి విషయాల్లో ఒత్తిడి, కార్యాలస్యం వుంటాయి. అయినా ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ప్రధానంగా ఈ నెలలో కుటుంబ సమస్యల మీద దృష్టి ఉంచండి. డబ్బు వెసులుబాటు కొంత ఇబ్బందికరమే అయినా, తెలివిగా ఖర్చులను సానుకూలం చేయగలుగుతారు. ప్రశాంతంగా ఉంటారు.
ఫిబ్రవరి: అన్ని అంశాల్లోనూ జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా మితభాషణ, ఓర్పు చాలా అవసరం. కలహాలు రాకుండా మాటతీరు సరిచూసుకోవాలి. అవమానకర ఘటనలు తలెత్తకుండా జాగ్రత్తపడండి. ఇతరుల విషయాల్లో కలగజేసుకోకండి. మీ పనులు మీరు స్వయంగా చేసుకునేటట్లయితే కొంతవరకు సమస్యలు దూరమవుతాయి.
మార్చి: ఆర్థిక వ్యవహారాల్లో చికాకులు ఉంటాయి. ఆదాయ వ్యయాలు సమతూకంగా ఉండవు. అయినా ధైర్యంగా ఉంటారు. వృత్తి విషయంలో ఇబ్బందులు ఉంటాయి. రవి సంచారం అనుకూలం లేకపోవడం, గురు, శని సంచారం కూడా సరిగా లేని కారణంగా అన్ని అంశాల్లోనూ ఓర్పుతో మెలగవలసిన అవసరం ఉంది.
మీ జాతకానికి ఈ గోచారాన్ని మీ జ్యోతిషవేత్త ద్వారా అన్వయం చేయించుకోండి. దశ అంతర్దశ ప్రభావానికి, గోచారానికి పోలిక చేసి ఫలితములు తెలుసుకోండి.
శ్రీ శుభకృత్ నామ సంవత్సర 2022 – 23: మీ రాశిఫలాలు కోసం క్లిక్ చేయండి..
Comments
Please login to add a commentAdd a comment