కృత్తిక 2,3,4 పాదములు (ఈ, ఊ, ఏ)
రోహిణి 1,2,3,4 పాదములు (వో,వా,వీ,వూ)
మృగశిర 1,2 పాదములు (వే,వో)
ఈ సంవత్సరం గురువు ఏప్రిల్ 13 వరకు కుంభం (దశమం)లోనూ తదుపరి మీనం (లాభం)లోనూ సంచారం చేస్తారు. శని ఏప్రిల్ 28 వరకు మరలా జూలై 12 నుంచి 2023 జనవరి 17 వరకు మకరం (భాగ్యం)లోనూ మిగిలినకాలమంతా కుంభంలోనూ సంచరిస్తారు. ఏప్రిల్ 12 వరకు రాహువు వృషభం (జన్మం), కేతువు వృశ్చికం (సప్తమం)లోనూ తదుపరి రాహువు మేషం (వ్యయం), కేతువు తుల (షష్ఠం)లో సంచరిస్తారు.
2022 ఆగస్టు 10 నుంచి 2023 మార్చి 12 వరకు కుజుడు వృషభం (జన్మం)లో స్తంభన. మొత్తం మీద ఈ గోచారం సంవత్సరం అంతా శోధింపగా లాభాలు బాగా ఉంటాయి. కార్య సానుకూలత బాగుంటుంది. అయినా చికాకులు వెంబడిస్తూనే ఉంటాయి. ఇదొక విచిత్రమైన కాలమనే చెప్పాలి. ఏ విధమైన నిర్ణయాలైనా త్వరగా తీసుకోలేకపోతారు. తరచుగా భయాందోళనలకు గురవుతుంటారు. గురువు లాభ సంచారం, శని అనుకూల సంచారం మీకు గొప్ప వరమనే చెప్పాలి.
ఉద్యోగంలో ఎన్ని ఆటంకాలు ఉన్నా, ప్రమోషన్ అందుకుంటారు. సర్వత్రా మీ ప్రణాళికలు విజయం అందిస్తాయి. గౌరవం తెస్తూ ఉంటాయి. ఆర్థిక కార్యకలాపాలు కొంచెం సానుకూల స్థితిని అందించని గోచారం ఉన్నా, ఈ ఏడాది ముందు జాగ్రత్త పడ్డవారు ఆర్థికంగా సుఖపడతారు. అనవసర విషయాల పట్ల ఆకర్షితులైనవారు ఇబ్బందిపడే అవకాశం ఉంది. ఏ పరిస్థితిలోనైనా కుటుంబసభ్యుల ప్రోత్సాహం బాగుంటుంది. అయితే మీరు కుటుంబసభ్యులతోనూ, మిత్రులతోనూ అనుమాన ధోరణితో సంచరిస్తారు. ఈ సంవత్సరం అతి జాగ్రత్త, మితభాషణ శ్రేయస్కరం. కొత్త వ్యవహారాలు, వ్యాపారాలు మిమ్మల్ని ఎంత ఆకర్షించినా, మీరు ఏమాత్రం ఆకర్షితులు కాకండి. మీ స్థితిని గమనించుకొని ప్రవర్తించండి.
వ్యాపారులకు సంవత్సరం అంతా లాభాలు ఉంటాయి. అయితే పక్కనే సమస్యలు కూడా ప్రయాణం చేస్తాయి. ఉద్యోగులు ఎంతో జాగ్రత్తగా మెలగాలని సూచన. ఇతరుల మీద ఆధారపడిన ప్రతి పనిలోనూ సమస్యలు వస్తుంటాయి. మీ పనులు మీరు స్వయంగా చేసుకోవడం శ్రేయస్కరం. నేత్ర సమస్యలు ఉన్నవారికి ఇబ్బందులు ఎక్కువవుతాయి. సహజంగా గురుబలం దృష్ట్యా సమస్యలు రాకూడదు కానీ ఆగస్టు తరువాత మీకు కానీ మీ కుటుంబసభ్యులకు కానీ సంబంధించి వైద్య ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. స్థిరాస్తి కొనుగోలు కోసం ధనం సమకూరుతుంది. లోన్‌లు, ప్లాన్‌లు వంటివి తేలికగా సమకూరుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చేసే విషయంలో పాత ఉద్యోగం మానివేసి, కొత్త ప్రయత్నం చేయడం మంచిదికాదు.
విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి ప్రత్యేక సూచన ఏమిటి అంటే ధనవ్యయం. మోసం మీ వెంట ఉంటాయి జాగ్రత్త. షేర్ వ్యాపారులకు ఫైనాన్స్ వ్యాపారులకు వ్యాపారం బాగా ఉంటుంది. విచిత్ర సమస్యలు ఉంటాయి. విద్యార్థులకు విద్యావ్యాసంగం చెడకొట్టే ఇతర అంశాలు ఎక్కువవుతాయి. రైతులకు శ్రమ ఎక్కువ ఉన్నా, ఫలితాలు అనుకూలం. పంటలకు సంబంధించిన రోగాలకు ఖర్చులు పెరుగుతాయి. గర్భిణులు బహుజాగ్రత్తలు పాటించాలి.
కృత్తికా నక్షత్రం వారు ఇబ్బందులు లేని జీవితం గడుపుతారు. కానీ ఏ స్థాయి వారికి ఆ స్థాయి మానసిక సమస్యలు వుంటాయి. ప్రధానంగా అభద్రతాభావం వెంబడిస్తుంది. అయితే కచ్చితంగా అన్ని విషయాల్లోనూ సానుకూలత ఎక్కువగా వుంటుంది. అందరూ సహకరిస్తారు. ఆర్థికంగా బలపడతారు. రోహిణీ నక్షత్రం వారికి నేత్ర సమస్యలు ఎక్కువ కాగలవు. జీర్ణ సంబంధ, చర్మ సంబంధ సమస్యలు వున్న ఈ నక్షత్రం వారు ఎక్కువగా చికాకులు పొందుతారు. స్థిరాస్తి సమస్యలను త్వరగా సెటిల్‌మెంట్ చేసుకోకపోవడం శాపంగా మారుతుంది.
మృగశిర నక్షత్రం వారికి క్రమంగా శుభపరిణామాలు పెరుగుతాయి. ఆదాయం బాగా వుండి ధనవ్యయం అధికంగా చేస్తుంటారు. పిల్లల విద్య వివాహ ప్రయత్నాలు, ఉద్యోగంలో సక్సెస్ వార్తలు ఆనందం కలిగిస్తాయి. తరచుగా పుణ్యక్షేత్ర సందర్శనలు, దాన ధర్మాలు చేస్తారు.
శాంతి: ఏప్రిల్‌లో రాహుకేతు శాంతి చేయించండి. ఆగస్టులో కుజగ్రహ శాంతి చేయించండి. రోజూ దుర్గ, గణపతి, సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణం చేయాలి. ‘గజేంద్రమోక్షం ఘట్టం’ రోజూ పారాయణ చేయడం చాలా అవసరం. త్రిముఖి, షణ్ముఖి రుద్రాక్ష ధరించడం వలన మంచి జరుగుతుంది.
ఏప్రిల్: తరచుగా మానసిక ఒత్తిడికి లోనవుతారు. అన్ని పనులూ సక్రమంగా జరుగుతాయి. కొన్ని అంశాలలో లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో అధికారులు తరచుగా ఆగ్రహిస్తారు. ఎవరినీ నమ్మి పనులు చేయవద్దు. మితభాషణ అవసరం. శుభకార్యాల్లో పాల్గొంటారు. అన్ని పనులూ స్వయంగా చేసుకోవడం మంచిది.
మే: కొన్ని సందర్భాలలో ధైర్యంగా బుద్ధిని ప్రదర్శిస్తారు. కొన్నిసార్లు అధైర్యంగా ఉంటారు. భోజనవసతి, రోజువారీ పనులు చక్కగా ఉంటాయి. మితభాషణ, ఓర్పు, స్నేహం ప్రదర్శించి తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. అధికారుల అండదండలు బాగా ఉంటాయి. గురువులను, పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. పెద్దల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
జూన్: కోర్టు వ్యవహారాల్లో సెటిల్‌మెంట్ ధోరణి చాలా లాభం. తరచుగా బుద్ధిమాంద్యానికి లోనవుతారు. వీలయినంత వరకు దూరప్రాంత ప్రయాణాలను విరమించడం శ్రేయస్కరం. పనులు వాయిదా వేసే లక్షణాలు విడనాడండి. భోజనం, స్నానం వంటి నిత్యకృత్యాలు కూడా కాలంతో సంబంధం లేకుండా ఉంటాయి.
జూలై: కుజుడు వ్యయంలో సంచారం ప్రారంభించారు. మూడు మాసాలు అనుకూలత తక్కువ. కలహాలు వ్యవహారాలు చికాకులు కలిగిస్తాయి. రోజూ సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. గురు, శుక్ర సంచారం బాగుంది. అందువలన తెలివితేటలు ప్రదర్శించి సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.
ఆగస్టు: ఈ నెల నుంచి కుజస్తంభన, వృషభరాశిలో ఉండి ఇబ్బందికరంగా ఉంటుంది. రోజూ సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంలో ధనవ్యయం అధికం అవుతుంది. పిల్లలతో మనస్పర్థలు ఎక్కువ అవుతాయి. ఈ నెల నుంచి ఆరోగ్యం, ఋణ విషయంలో జాగ్రత్తలు పాటించండి. మనశ్శాంతిగా ఉండడం కోసం ప్రత్యేక సాధన అవసరం.
సెప్టెంబర్: కుజుడు జన్మంలో సంచారం అనుకూలం కాదు. అయితే గురు శుక్ర బుధ గ్రహసంచారం అనుకూల ఫలితాలు ఇస్తుంది. అందువలన ఎంతటి సమస్యలనైనా సులువుగా దాటవేయగలుగుతారు. ప్రతి విషయంలోనూ ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఇబ్బంది లేకుండా సాగిపోతాయి. వాహన సౌఖ్యం ఉంటుంది.
అక్టోబర్: తరచుగా శుభవార్తలు వింటారు. 15వ తేదీ తరువాత కుజుడి మార్పు వల్ల మంచి మార్పులు కొన్ని ప్రారంభం అవుతాయి. ద్వితీయార్ధంలో రవి కుజుల సంచారం పూర్తిగా అనుకూలంగా ఉన్నందున వృత్తి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. 15వ తేదీ వరకు కుజుడు, తరువాత శుక్రుడు అనుకూలంగా లేనందున కుటుంబ విషయంలో జాగ్రత్తలు అవసరం.
నవంబర్: కోపం, ఆవేశం, మానసిక ఆందోళనలు జయించడానికి మెడిటేషన్ వంటి వాటిని ఆశ్రయించండి. ఆరోగ్య పరిరక్షణ మీద ప్రత్యేక దృష్టి అవసరం. దూర ప్రాంత ప్రయాణాలను, ఒంటరి ప్రయాణాలను విరమించుకోవడం శ్రేయస్కరం. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోరాదని సూచన.
డిసెంబర్: అన్ని కోణాల్లోనూ జాగ్రత్తలు అధికంగా పాటించాలి, ప్రధానంగా ఇతరుల విషయంలో కలగజేసుకోవద్దు. మితభాషణ, ఓర్పు చాలా అవసరం. కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చే ప్రయత్నంలో సఫలం కాలేరు. ఫలితంగా కుటుంబ కలహాలు ఉంటాయి. వాహనాలు తరచుగా రిపేర్‌కు వస్తాయి. అవయవ ప్రతికూలతలు అధికంగా ఉంటాయి.
జనవరి: తెలివి, ఓర్పు ప్రదర్శించి ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఋణం కావలసిన సమయానికి వెంటనే దొరుకుతుంది. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుంచి పూర్తి సానుకూలత ఉంటుంది. ఋణాలు ఇచ్చి పుచ్చుకునే విషయంలో ఒత్తిడిని జయిస్తారు. చిరకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
ఫిబ్రవరి: జన్మకుజుడు వ్యయరాహువులు సహజంగా ఇబ్బంది కలుగచేసే గ్రహాలు. అయితే మిగిలిన గ్రహాలు అనుకూలంగా ఉన్న కారణంగా అన్ని విషయాల్లోనూ తెలివిగా సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఎలర్జీలు, ఎముకల సంబంధ సమస్యలు ఉన్నవారు కొంత ఇబ్బంది పడతారు. ఆదాయ వ్యయాలు, ఋణాలు సమతూకంగా వుండవు. జాగ్రత్త అవసరం.
మార్చి: ఏ పనీ సరిగా పూర్తి చేయలేరు. చాలా పనులు మొదలుపెడుతుంటారు. ఎవరి సహకారమూ అందదు. పని ఒత్తిడి పెరుగుతుంది. తరచు కోపావేశాలు ప్రదర్శిస్తారు. వృథాగా సంచారం చేస్తూ ఉంటారు. రోజువారీ పనుల్లో సైతం సంతుష్టి లేకుండా కాలం గడుపుతారు. సాంఘిక కార్యకలాపాలు అగౌరవం తెచ్చే అవకాశం ఉంది.
మీ జాతకానికి ఈ గోచారాన్ని మీ జ్యోతిషవేత్త ద్వారా అన్వయం చేయించుకోండి. దశ అంతర్దశ ప్రభావానికి, గోచానాకి పోలిక చేసి ఫలితములు తెలుసుకోండి.
శ్రీ శుభకృత్ నామ సంవత్సర 2022 – 23: మీ రాశిఫలాలు కోసం క్లిక్ చేయండి..
Comments
Please login to add a commentAdd a comment