అమ్మవారికి సారె తీసుకు వచ్చిన భక్తులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై సోమవారంతో ఆషాఢ మాసోత్సవాలు ముగియనున్నాయి. దీంతో ఆదివారం రికార్డు స్థాయిలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని సారెను సమర్పించారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు ఆదివారం నిర్వహించిన ఆర్జిత సేవల్లోనూ ఉభయదాతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెల్లవారుజామున అమ్మవారి ప్రధాన ఆలయంలో నిర్వహించిన ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, శ్రీ చక్రనవార్చన, శాంతి కలల్యాణం, చండీహో మం, గణపతి హోమంలో పెద్ద ఎత్తున ఉభయదాతలు పాల్గొని తమ నామగోత్రాలతో పూజలు జరిపించుకున్నారు. తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
అమ్మవారి దర్శనానికి మూడు గంటలు
ఆదివారం కావడంతో అమ్మవారి దర్శనానికి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. దీంతో క్యూలైన్లు కిటకిటలాడాయి. సర్వ దర్శనంతో పాటు రూ.100, రూ.300 టికెట్ల క్యూలైన్‌లో అమ్మవారి దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. మరో వైపున అమ్మవారికి సారెను సమర్పించేందుకు విచ్చేసిన భక్తులను సైతం రూ.300, రూ.100 క్యూలైన్‌లోకి అనుమతించారు. భక్తుల రద్దీతో పలు దఫాలుగా అంతరాలయ దర్శనం నిలిపివేసి ముఖ మండప దర్శనానికి అనుమతించారు. వీఐపీ గేటు వద్ద రూ.500 టికెట్ తీసుకున్న భక్తులు వేచి ఉండేలా ఏర్పాట్లు చేశారు. సారె సమర్పించే భక్తుల రద్దీ తగ్గిన సమయంలో రూ.500 టికెట్ క్యూలైన్‌ను అంతరాలయంలోకి అనుమతించారు. మధ్యాహ్నం 3.30 గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది.
సారె సమర్పించిన భక్త బృందాలు
దుర్గమ్మకు ఆదివారం పలు భక్త బృందాలు సారెను సమర్పించాయి. దుర్గగుడి పాలక మండలి సభ్యులు కట్టా సత్తెయ్య బృందం, దేవిశెట్టి బాలకృష్ణ బృందం, ఆంధ్రప్రదేశ్ భవానీ దీక్ష వ్యవస్థాపక పీఠం ఈది ఎల్లారావు శిష్య బృందానికి చెందిన 700 మంది భక్తులు, మొగల్‌రాజపురం కళావతి బృందానికి చెందిన 50 మంది, పొన్నూరుకు చెందిన ఎం.అరుణ బృందానికి చెందిన 50 మంది భక్తులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసిన 2 వేల మంది భక్తులు అమ్మవారికి సారెను సమర్పించారు. వీరికి ఆలయ చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో భ్రమరాంబ సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తికి సారెను సమర్పించారు. కార్యక్రమంలో డీఈవో గురు ప్రసాద్, పాలక మండలి సభ్యులు కట్టా సత్తెయ్య, దేవిశెట్టి బాలకృష్ణ, బచ్చు మాధవికృష్ణ, కేసరి నాగమణి తదితరులు పాల్గొన్నారు. నెల రోజులుగా జరుగుతున్న ఆషాఢ మాసోత్సవాలు సోమవారంతో ముగియనున్నాయి. సోమవారం ఉదయం 7–30 గంటలకు ఆలయ ఈవో, ఆలయ సిబ్బంది అమ్మవారికి సారెను సమర్పించనున్నారు.
అడ్డుకున్న నిఘా సిబ్బంది
కనకదుర్గనగర్ పరిసరాల్లో తిరిగే డిప్యూటీ (శ్రీను) అనే వ్యక్తి ఆదివారం ఆలయంలో విధులు నిర్వహించే ఓ వ్యక్తికి ఫోన్ చేసి ముగ్గురు భక్తులకు వీఐపీ దర్శనం చేయించాలని కోరాడు. దీంతో సదరు ఉద్యోగి ఆ ముగ్గురు భక్తులను ఆలయంలోకి తీసుకెళ్తుండగా, నిఘా సిబ్బంది అడ్డుకున్నారు. ఉద్యోగిని మందలించారు. అక్రమ మార్గంలో వీఐపీ దర్శనాలు చేయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment