‘వ్యూహం’ సినిమా కొనసాగింపుగా ‘శపథం’ | - | Sakshi
Sakshi News home page

‘వ్యూహం’ సినిమా కొనసాగింపుగా ‘శపథం’

Published Fri, Aug 11 2023 7:34 AM | Last Updated on Fri, Aug 11 2023 7:34 AM

జగన్‌మోహన్‌రెడ్డి పాత్రధారి అజ్మల్‌తో రామ్‌గోపాల్‌వర్మ  - Sakshi

జగన్‌మోహన్‌రెడ్డి పాత్రధారి అజ్మల్‌తో రామ్‌గోపాల్‌వర్మ

● తెనాలిలో వ్యూహం సినిమా సన్నివేశాల చిత్రీకరించిన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ● సినిమా అద్భుతంగా వస్తోందన్న నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌

తెనాలి: రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి జీవితంలో జరిగిన సంఘటలను దృష్టిలో ఉంచుకుని రామదూత క్రియేషన్స్‌ పతాకంపై రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో దాసరి కిరణ్‌కుమార్‌ నిర్మిస్తున్న ‘వ్యూహం’ సినిమాలో కొన్ని సన్నివేశాలను గురువారం తెనాలిలో చిత్రీకరించారు. స్థానిక చెంచుపేటలోని చావాస్‌ గ్రాండ్‌ కల్యాణ మండపంలో కార్యకర్తలతో సమావేశాన్ని, అనంతరం జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రను ఇక్కడ తీశారు. జగన్‌మోహన్‌రెడ్డి పాత్రధారి అజ్మల్‌, వై.ఎస్‌.విజయమ్మ, వై.ఎస్‌.భారతి, వై.ఎస్‌.షర్మిలమ్మ పాత్రధారులు, నవరత్నాలు వైస్‌ చైర్మన్‌ అంకిరెడ్డి నారాయణ మూర్తి, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దసంఖ్యలో అభిమానులు సందడి చేశారు. చిత్రదర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, సినిమా కథకు సంబంధించిన లోకేషన్లు తెనాలి, పరిసర ప్రాంతాల్లో ఉన్నందున, ఇక్కడ షూటింగ్‌ జరుపుతున్నట్టు చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణానంతరం ఏర్పడిన పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నించిన రాజకీయ పార్టీల ఎత్తులు, వాటి నుంచి పుట్టుకొచ్చిన పొలిటికల్‌ థ్రిల్లర్‌ ‘వ్యూహం’ చిత్రంగా చెప్పారు. 2014–19 మధ్య పరిణామాలే వ్యూహం చిత్రమని, 2019 నుంచి ఇప్పటి వరకు జరిగిన సంఘటనలతో కొనసాగింపుగా ‘శపథం’ చిత్ర ఉంటుందని తెలిపారు. చిత్ర నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి జీవితంలో 2009–2019 వరకు జరిగిన నిజజీవిత ఘటనలు, రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో ‘వ్యూహం’ సినిమాను తీస్తున్నట్టు చెప్పారు. సొంత ఊరు తెనాలిలో కొన్ని సన్నివేశాలను తీయాలని తపన పడ్డానని చెబుతూ ఈరోజుతో ఆ కోరిక నెరవేరిందన్నారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌, మిత్రులు, కార్యకర్తల సహకారంతో ముఖ్యమైన ఘట్టాలను ఇక్కడ చిత్రీకరించామని చెప్పారు. సినిమా అద్భుతంగా వస్తోందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డిని ఏరకంగా ఇబ్బందులు పెట్టారు? వాటిని ఎదుర్కొంటూ ఎంత శక్తిగా ఆయన మారారు? అనేది ప్రతి ప్రేక్షకుడి గుండెను తాకేలా దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ దృశ్యీకరిస్తున్నట్టు చెప్పారు. ప్రతి ఒక్కరినీ ఈ చిత్రం ఆలోచింపజేస్తుందని, ప్రేక్షకులు జగన్‌మోహన్‌రెడ్డిని మరింత ఆత్మీయంగా సొంతం చేసుకుంటారని భావిస్తున్నట్టు వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement