రెంటచింతలలో దొంగలు హల్‌చల్
రెంటచింతల: మండల కేంద్రమైన రెంటచింతలలో సోమవారం రాత్రి దొంగలు హల్‌చల్ చేశారు. పలు ప్రాంతాల్లోని రెండు ఇళ్లల్లో తాళాలు పగలుగొట్టి చోరీలకు పాల్పడ్డారు. గ్రామంలోని ఆరోగ్యనాథుని మందిరం వద్దనున్న ఆదూరి ఇన్నారెడ్డి నాలుగు రోజుల కొందట వెళంగిని వెళ్లగా ఆయన భార్య రజని కొంతకాలంగా గుంటూరులోని మనవరాళ్ల వద్దకు వెళ్లి ఉంటోంది. మంగళవారం సాయంత్రం 3 గంటల సమయంలో ఇన్నారెడ్డి విత్తనాల షాపులో పనిచేసే సాగర్ వచ్చి చూడగా ఇంటికి వేసిన తాళాన్ని గ్యాస్ కట్టర్‌తో కోసి ఇంట్లోని బీరువాను, ఇనుపపెట్టెను పగలగొట్టి వస్తువులను చెల్లాచెదురుగా పడవేసిన విషయాన్ని ఇన్నారెడ్డికి తెలిపారు. బీరువా, ఇనుపపెట్టెలో దాచిన 75 గ్రాములు బంగారు వస్తువులు, రూ.70 వేల నగదు అపహరణకు గురైనట్లు ఇన్నారెడ్డి పోలీసులకు వివరించారు. వెండి కిరీటాలు, చిన్నచిన్న వెండి వస్తువులను దొంగలు అక్కడే వదిలి వెళ్లినట్లు తెలిపారు.
అలాగే స్థానిక రామాలయం వద్ద ఉంటున్న తాళ్ళూరి సాంబశివరావు భార్యతో కలిసి ఈ నెల 14న హైదరాబాద్‌లోని కుమారుడి వద్దకు వెళ్లి మంగళవారం ఉదయం తిరిగి వచ్చారు. అయితే ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో బీరువాను తెరిచి దానిలో నున్న రూ.1 లక్ష నగదుతో పాటు రెండు బంగారు చెవి దిద్దులు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటన స్థలాలను ఎస్‌ఐ సీహెచ్ నాగార్జున సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ రెండు, మూడు రోజుల పాటు ఇల్లు విడిచి పొరుగు గ్రామానికి వెళ్లే సమయంలో స్థానిక పోలీసు స్టేషన్‌లో తెలియ చేయాలని తెలిపారు.
రెండు ఇళ్లల్లో చోరీ బంగారం, నగదు అపహరణ
Comments
Please login to add a commentAdd a comment