కుటుంబ సమస్యలపైనా రాజకీయం
వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కనకారావు
జే.పంగులూరు: దంపతుల నడుమ సమస్యలను తెలుగుదేశం నాయకులు స్వలాభం కోసం రాజకీయం చేశారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కనకారావు పేర్కొన్నారు. అలవలపాడులో పోలీసులు వేధింపులతో పురుగుల మందు తాగి ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతున్న షేక్ గాలీబీని కనకారావు పరామర్శించారు. కుమారుడు ఇమామ్‌కు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులను టీడీపీ నాయకులు అడ్డం పెట్టుకొని వైఎస్సార్ సీపీ నాయకులను, కార్యకర్తలను, సానుభూతిపరులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. కోర్టులో ఉన్న కేసును పోలీసులు ఎలా సెటిల్ చేస్తారని ప్రశ్నించారు. రెండేళ్ల నుంచి నడుస్తున్న కుటుంబ కలహాల విషయంలో రాజకీయ నాయకుల మెప్పు కోసం పోలీసులు ఇష్టానుసారంగా ప్రవర్తించడం తగదన్నారు. రేణింగవరం ఎస్సై వినోద్‌బాబుపై జిల్లా ఎస్పీ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం రెడ్ బుక్ రాజ్యాంగం అమలువుతోందన్నారు. బల్లికురవలో రైతులు మరణానికి కారణం అయిన తెలుగుదేశం పార్టీ నాయకులు, పోలీసులు... అలవలపాడులో కూడా ఇలా చేయడం బాధాకరం అన్నారు.
పోలీసుల తప్పుడు రిపోర్టు..
రేణింగవరం పోలీసుల వల్ల ఇబ్బంది పడి పురుగుల మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలీబీ వద్ద పోలీసులు తప్పుడు రిపోర్టు రాసి, వారితో సంతకం పెట్టించుకున్నారని అన్నారు. కోడలు ఇంటికి రాకపోవడంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగారని రిపోర్టు రాసుకొని రేణింగవరం ఎస్సైను కాపాడుతున్నారని చెప్పారు. మొదటి నుంచి ఇమామ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా పనిచేస్తుండేవాడని, అతడిని టార్గెట్ చేసిన టీడీపీ నాయకులు ఇబ్బందికి గురిచేశారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీ రాజ్‌కుమార్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment