మరణించినా.. నలుగురికి పునర్జన్మ
మహిళ అవయవదానం
మంగళగిరి: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మరణించిన మహిళ అవయదానంతో మరో నలుగురికి పునర్జన్మనిచ్చింది. తాను మట్టిలో కలిసినా.. నలుగురి జీవితాలకు వెలుగిచ్చింది. విజయవాడ భవానీపురానికి చెందిన ఎం.సరస్వతి(54) ఈనెల 14న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తుండగా మంగళవారం బ్రెయిన్ డెడ్ అయింది. కుటుంబ సభ్యులు అవయవాలు దానం చేసేందుకు ముందుకు వచ్చారు. అభినందించిన వైద్యులు జీవన్‌ధాన్ ద్వారా సరస్వతి శరీరం నుంచి కిడ్నీలు, కళ్లు, గుండె, లివర్, లంగ్స్‌ను సేకరించారు. లివర్, కిడ్నీ, లంగ్స్‌ను వెంటనే మణిపాల్ ఆసుపత్రికి తరలించి అవసరమైన రోగులకు శస్త్రచికిత్సతో అమర్చారు. కళ్లను ఎల్‌వీ ప్రసాద్ ఐ బ్యాంక్‌కు తరలించారు. సరస్వతి అవయదానం చేసి మరికొందరి జీవితాలకు పునర్జన్మ అందించడం అభినందనీయమని వైద్యులు కొనియాడారు. ఆమె బాటలో ప్రతిఒక్కరూ అవయవదానానికి ముందుకు రావాలని కోరారు.
అభినందనీయం
అవయదానం అభినందనీయమని తెనాలి సబ్ కలెక్టర్ వి.సంజనా సింహా, ఎయిమ్స్ డైరెక్టర్ అహెంతమ్ శాంత సింగ్ పేర్కొన్నారు. తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా అవయవ దాత సరస్వతి గౌరవార్థం ప్రభుత్వం అందజేసిన నగదును కుటుంబ సభ్యులకు అందించారు. ఈ నగదును ఆమె కుటుంబ సభ్యులు లేనివారి కోసం ఖర్చుచేయాలని ఎయిమ్స్ డైరెక్టర్‌కు అందజేశారు.
మరణించినా.. నలుగురికి పునర్జన్మ
Comments
Please login to add a commentAdd a comment