విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత

Published Thu, Feb 20 2025 9:06 AM | Last Updated on Thu, Feb 20 2025 9:01 AM

విద్య

విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత

అద్దంకి రూరల్‌: విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్‌ మధ్య ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ సీజీఆర్‌ఎఫ్‌ ముఖ్య ఉద్దేశమని చైర్‌పర్సన్‌ ఎన్‌ విక్టర్‌ ఇమ్మానియేలు పేర్కొన్నారు. బుధవారం స్థానిక విద్యుత్‌ కార్యాలయంలో వినియోగదారుల ఆదాలత్‌, అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇమ్మానియేలు మాట్లాడుతూ వినియోగదారులు ఉద్దేశపూర్వకంగా ఫిర్యాదు చేయొద్దన్నారు. సమస్య సమంజసంగా ఉండాలని పేర్కొన్నారు. అధికారులు కూడా పారదర్శకంగా సేవలు అందించాలన్నారు. సక్రమంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. అదాలత్‌లో 8 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో సాంకేతిక సభ్యుడు కె. వెంకట కృష్ణ, ఆర్థిక సభ్యుడు ఆర్‌సీహెచ్‌ శ్రీనివాసరావు, స్వతంత్ర సభ్యురాలు సునీత, ఎస్‌ఈ బీవీ ఆంజనేయులు, ఈఈ ఎన్‌ మస్తాన్‌రావు, ఏఈలు, అధికారులు పాల్గొన్నారు

స్కూల్‌ బస్‌ను ఢీకొన్న కూలీల ఆటో

ఏడుగురికి స్వల్ప గాయాలు

జరుబులవారిపాలెం (కారంచేడు): పక్కన ఆగి ఉన్న స్కూల్‌ బస్సును కూలీలతో వస్తున్న ఆటో ఢీకొట్టడంతో ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని జరుబులవారిపాలెం గ్రామం నుంచి ఇంకొల్లు వెళ్లే రహదారిలో బుధవారం జరిగింది. ఎస్సై వి. వెంకట్రావు కథనం మేరకు.. ఇంకొల్లుకు చెందిన ఒక ప్రైవేటు స్కూల్‌ బస్సు విద్యార్థుల కోసం కేశవరప్పాడు నుంచి వచ్చి వెళ్తోంది. వ్యవసాయ కూలీలతో ఇంకొల్లు నుంచి కేశవరప్పాడుకు వస్తున్న ఆటో ఎదురుగా వెళ్లి ఢీకొట్టింది. దీంతో ఆటో పొలాల్లోకి పోగా, కూలీలలో కొంత మందికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని చీరాల ఆసుపత్రికి తరలించారు. కొందరు స్కూల్‌ బస్సు వచ్చి ఆటోను ఢీకొందని చెబుతున్నారు. ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తామని ఎస్‌ఐ తెలిపారు. ఘటనా స్థలంలో ఆధారాలను ఏఎస్‌ఐ బి. శేషసాయి సేకరించారు.

మల్చింగ్‌ విధానంతో మంచి దిగుబడులు

బల్లికురవ: వ్యవసాయంలో మల్చింగ్‌ విధానంతో రైతులకు మేలు జరుగుతుందని బాపట్ల జిల్లా ఉద్యాన అధికారి పి.జెనమ్మ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని కూకట్లపల్లి, గొర్రెపాడు గ్రామాల్లో 200 ఎకరాల్లో మల్చింగ్‌ విధానంలో పుచ్చకాయ సాగు చేపట్టిన పొలాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మల్చింగ్‌ విధానంలో కలుపు తక్కువగా రావటం, నీరు ఆవిరి కాకుండా మొక్కలు ఎదుగుదలకు ఉపకరిస్తాయన్నారు. పురుగు, తెగుళ్ల నుంచి పంటను రక్షించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఉద్యాన అధికారి బి. హనుమంత్‌ నాయక్‌, వీఏఏ వెంకటేశ్వర్లు, ప్రసన్న పాల్గొన్నారు.

డాక్టర్‌ శరత్‌

చంద్రకుమార్‌ ఔదార్యం

గుంటూరు మెడికల్‌: గుంటూరు వైద్య కళాశాల 1998 బ్యాచ్‌ పూర్వ వైద్య విద్యార్థి, గుంటూరు చంద్ర కేర్‌ న్యూరో స్పెషాలిటీ అధినేత, ప్రముఖ న్యూరాలజిస్ట్‌ డాక్టర్‌ నలమోతు శరత్‌చంద్రకుమార్‌ తన తల్లి నలమోతు శైలజకుమారి జ్ఞాపకార్థంగా గుంటూరు వైద్య కళాశాలలో తారు రోడ్ల నిర్మాణానికి నిర్మించేందుకు రూ. 6 లక్షలు విరాళం అందజేశారు. ఈ విరాళంతో నిర్మించిన రోడ్లను బుధవారం గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నాగార్జునకొండ వెంకట సుందరాచారితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సుందరాచారి శరత్‌చంద్రకుమార్‌ను అభినందించి సన్మానించారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ప్రభాకర్‌, డాక్టర్‌ శ్రీధర్‌, పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

నేడు, రేపు న్యాయవాదుల విధుల బహిష్కరణ

గుంటూరు లీగల్‌ : న్యాయవాదుల అమెండ్‌మెంట్‌ బిల్లు 2025కు వ్యతిరేకంగా గుంటూరు బార్‌ ఫెడరేషన్‌ నిరసన తెలుపుతుందని ఫెడరేషన్‌ చైర్మన్‌ కాసు వెంకటరెడ్డి బుధవారం తెలిపారు. నిరసనలో భాగంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులు గురు, శుక్రవారాల్లో విధులను బహిష్కరిస్తున్నట్టు వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత 1
1/1

విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement