కొనసాగుతున్న నష్టాలు | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న నష్టాలు

Published Fri, Feb 21 2025 9:02 AM | Last Updated on Fri, Feb 21 2025 8:59 AM

కొనసా

కొనసాగుతున్న నష్టాలు

కూటమి పాలనలో అన్నదాతలకు అష్టకష్టాలు

సాక్షి ప్రతినిధి, బాపట్ల: చంద్రబాబు పాలన అన్నదాతలకు అష్టకష్టాలు మిగులుస్తోంది. బాబు అధికారంలోకి వచ్చినప్పుడు ఒక్కోసారి కరవు వచ్చి పంటలు పండవు, ఇంకోసారి వరదలతో పెను నష్టాలు తప్పవు.. అన్నీ దాటుకుని పంటలు పండినా గిట్టుబాటు ధరలుండవు. రైతులకు చేయూత మచ్చుకై నా కనిపించదు. ఇప్పుడూ కూటమి అధికారంలోకి వచ్చాక ఇదే కొనసాగుతోంది. తొలి ఏడాది ఖరీఫ్‌ నుంచే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. అంతకుముందు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాలనలో ప్రాజెక్టులు నీటితో నిండుకుండల్లా కళకళలాడాయి. పంటలు పుష్కలంగా పండాయి. అప్పటి ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు అన్నివిధాలా ఆదుకుంది. కానీ బాబు పాలనలో జిల్లాలో అధికంగా సాగు చేసిన వరితోపాటు పొగాకు, మిర్చి, కంది తదితర పంటలకు మద్దతు ధర లేదు. కనీసం పెట్టుబడులు కూడా రాక అన్నదాతలు లబోదిబో అంటున్నారు.

నిండా మునిగిన వరి రైతులు

జిల్లాలోని రేపల్లె, వేమూరు, బాపట్ల, చీరాల, పర్చూరు ప్రాంతాల్లో ఈ ఏడాది రైతులు 2,16,434 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఎకరాకు 35 బస్తాలకు తగ్గకుండా దిగుబడి వచ్చింది. 5,62,729 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. ప్రభుత్వం మాత్రం పట్టుమని 60 వేల మెట్రిక్‌ టన్నులూ మద్దతు ధరకు కొనలేదు. మిల్లర్లకు అమ్ముదామంటే బస్తా రూ.1,300కు మించి కొనలేదు. 5 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని తక్కువ ధరకు విక్రయించడంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వం కొన్న ధాన్యానికి మద్దతు ధర లభించగా.. బయట మార్కెట్‌లో బస్తా రూ. 2 వేలకుపైగా పలికింది. అన్నదాతలకు గిట్టుబాటు లభించింది.

మిర్చి రైతు కంట్లో కారం

జిల్లాలోని నగరం, సంతమాగులూరు, బల్లికురవ, మార్టూరు, యద్దనపూడి, పర్చూరు, కారంచేడు, ఇంకొల్లు, జె.పంగులూరు, అద్దంకి, కొరిశపాడు మండలాల పరిధిలో 9,330 ఎకరాల్లో మిర్చి సాగైంది. గత సంవత్సరం ఎకరానికి 20 క్వింటాళ్లకు పైగా దిగుబడి వచ్చింది. క్వింటా రూ.22 వేలు పలికింది. ఈ ఏడాది ఎకరానికి 5 – 10 క్వింటాళ్ల లోపే దిగుబడి రాగా... ధర రూ. 8 వేల – రూ.10 వేలకు మించలేదు. కూలీల ఖర్చులు కూడా రావని రైతులు లబోదిబో అంటున్నారు. ప్రభుత్వం కూడా మద్దతు ధర, ఇతరత్రా సాయం చేయకుండా మిర్చి రైతు కంట్లో కారం కొడుతోంది.

తేరుకోని పొగాకు రైతులు

ఈ ఏడాది శనగకు బదులు పొగాకు సాగుకు మొగ్గు చూపారు. సంతమాగులూరు, బల్లికురవ, మార్టూరు, యద్దనపూడి, పర్చూరు, కారంచేడు, ఇంకొల్లు, జె.పంగులూరు, అద్దంకి, కొరిశపాడు మండలాల పరిధిలో 64,165 ఎకరాల్లో సాగు చేశారు. బర్లీ వైట్‌ రకాన్ని అధికంగా.. కొంతమంది బ్యార్నీ రకం వేశారు. ఈ ఏడాది ధరలు పూర్తిగా పడిపోయినట్లు రైతులు పేర్కొంటున్నారు. గత ప్రభుత్వంలో బ్యార్నీ రకం క్వింటా రూ. 30 వేలు పలకగా.. ప్రస్తుతం సగంలోపే ఉంది. బర్లీ రకం రూ.10 వేలు– రూ. 13 వేలు ఉండగా.. ఇప్పుడు దారుణంగా రూ. 3,500 – 4 వేలలోపే పలుకుతోంది. కూలీల ఖర్చులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు.

జూట్‌ రైతులకూ తీవ్ర నష్టం

జిల్లాలోని అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల్లో దాదాపు వెయ్యి ఎకరాల్లో జూట్‌ సాగు చేస్తున్నారు. గత ఏడాది క్వింటా విత్తనాలు రూ. 15 వేల వరకు పలకగా.. ప్రస్తుతం రూ. 5 వేలకు మించడం లేదు. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

సగానికి సగం తగ్గిన కంది ధర

జిల్లాలోని సంతమాగులూరు, బల్లికురవ, పర్చూరు, అద్దంకి, కొరిశపాడు మండలాల పరిధిలో సుమారు 300 ఎకరాల్లో కంది వేశారు. గత ఏడాది క్వింటా రూ. 10 వేలుండగా... ఇప్పుడు రూ. 6 వేలకు మించి లేదు. ఎకరంలో 3 నుంచి 5 క్వింటాళ్లలోపే దిగుబడి వస్తోందని, ఈ లెక్కన ఖర్చులు రావని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో 2.16 లక్షల ఎకరాల్లో వరి సాగు

బస్తా ధాన్యం రూ.1,300 కూడా పలకని ధర

10 వేల ఎకరాల్లో మిర్చి పంట

క్వింటా రూ.8 వేలకు మించి పలకని వైనం

64,165 ఎకరాల్లో పొగాకు సాగు

సగానికిపైగా పడిపోయిన ధరలతో రైతులకు కన్నీరు

500 ఎకరాల్లో కంది పంట

క్వింటా రూ.6,400కి మించి ఇవ్వని వ్యాపారులు

ధర లేక ఇబ్బందులు

మాది చిమటవారి పాలెం. రెండు ఎకరాల్లో మిర్చి సాగు చేశా. వైరస్‌తోపాటు నల్లి, తామర పురుగు తెగుళ్లతో దిగుబడి సగం తగ్గింది. దిగుబడి ఎకరానికి 5 క్వింటాళ్లు మించేలా లేదు. ధర రూ. 8 వేలకు మించి లేదు. గత ఏడాదితో పోలిస్తే కూలి ఖర్చులు రెండింతలు పెరిగాయి. అవీ ఇప్పుడు వచ్చేలా లేవు.

– గనిపిశెట్టి వెంకటరావు, రైతు

పొగాకు సాగుతో తీవ్రంగా నష్టం

గత ఏడాది 4 ఎకరాల్లో పొగాకు సాగు చేశా. క్వింటా రూ. 15 వేలకుపైగా పలికింది. మంచి రాబడి వచ్చింది. ఈ సంవత్సరం 7 ఎకరాల్లో వేశా. ఎకరాకు రూ. 1.50 లక్షలు చొప్పున పెట్టుబడి పెట్టా. ఈ ఏడాది క్వింటా ధర రూ. 4 వేలకు మించలేదు. కూలి ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదు.

–గొట్టిపాటి వెంకట్రావు, రైతు

దళారుల దెబ్బకు జూట్‌ ధరలు పతనం

దళారుల జోక్యంతో జూట్‌ ధరలు బాగా పతనమయ్యాయి. వారు అడిగిందే ధరగా మారింది. నాలుగు ఎకరాల్లో జూట్‌ వేశా. కోసే ముందు రూ.7 వేల వరకు ధర పలికింది. కొట్టే సమయానికి రూ.6 వేలకు, తర్వాత రూ.ఐదున్నర వేలకు పడింది. గతంలో రూ.15 వేల వరకు ధర లభించింది.

– ఎ. రాంబాబు, రైతు

కందికి మద్దతు ధర కరవు

మాది కొరిశపాడు. గతంలో కంది సాగు చేశా. క్వింటా రూ.15 వేల వరకు ఉండేది. మొన్నటి వరకూ అదే ధర కొనసాగింది. పంట వచ్చే సమయానికి ఇప్పుడు రూ.ఆరున్నర వేలకు పడిపోయింది.

– బ్రహ్మారెడ్డి, రైతు

No comments yet. Be the first to comment!
Add a comment
కొనసాగుతున్న నష్టాలు 1
1/5

కొనసాగుతున్న నష్టాలు

కొనసాగుతున్న నష్టాలు 2
2/5

కొనసాగుతున్న నష్టాలు

కొనసాగుతున్న నష్టాలు 3
3/5

కొనసాగుతున్న నష్టాలు

కొనసాగుతున్న నష్టాలు 4
4/5

కొనసాగుతున్న నష్టాలు

కొనసాగుతున్న నష్టాలు 5
5/5

కొనసాగుతున్న నష్టాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement