పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలి
● జిల్లాలో 103 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు ● రీజినల్ జాయింట్ డైరెక్టర్ బి.లింగేశ్వరరెడ్డి
చీరాల అర్బన్: జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టామని ఆర్‌జేడీ బి.లింగేశ్వరరెడ్డి అన్నారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై గురువారం స్థానిక వీఆర్‌ఎస్‌వైఆర్‌ఎన్ కళాశాలలోని కాన్ఫరెన్స్ హాలులో పరీక్ష కేంద్రాల చీఫ్‌లు, డిపార్టుమెంట్ అధికారులు, రూట్ ఆఫీసర్లు, కస్టోడియన్లకు శిక్షణ నిర్వహించారు. ఆర్జేడీ మాట్లాడుతూ జిల్లాలో మార్చి 17 నుంచి జరగనున్న పదోతరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీగా నిర్వహించాలన్నారు. పరీక్ష పత్రాలు భద్రపరిచే కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. మార్చి 17 నుంచి 31వ తేదీ వరకు పదో తరగతి రెగ్యులర్ విద్యార్థులకు, 17 నుంచి 28వ తేదీ వరకు ఓపెన్ స్కూల్ విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లాలో రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులు 103 పరీక్ష కేంద్రాలో 16,361 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. విద్యార్థులు ఇబ్బంది పడకుండా పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించాలని, కాపీయింగ్ జరగకుండా చూడాలన్నారు. ప్రతి కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంట్ అఽధికారిని నియమించామని, ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 10 రూట్‌లు ఏర్పాటుచేశామన్నారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, జిరాక్స్ కేంద్రాలు, నెట్ సెంటర్‌ను మూసివేయాలన్నారు. పరీక్ష కేంద్రాలకు నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని విద్యుత్ అధికారులకు సూచించారు. భద్రత సిబ్బందిని, వైద్యసిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద, స్పాట్ వాల్యూయేషన్ కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపులు నిర్వహించి అత్యవసర మందులు సిద్ధం చేసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాన్ని సెల్‌ఫోన్ రహిత ప్రాంతాలుగా ప్రకటించామని, చీఫ్‌తో సహా ఎవరి వద్ద సెల్‌ఫోన్ ఉండడానికి వీల్లేదన్నారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.పురుషోత్తం, ఉప విద్యాశాఖాధికారి గంగాధరరావు, సురేష్, అసిస్టెంట్ కమిషనర్ ఫర్ ఎగ్జామ్స్ డి.ప్రసాదరావు, శ్రీనివాసరావు, చీరాల ఎంఈఓ పి.సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment