హజరత్ మస్తాన్ వలి దర్గాను స్వాధీనం చేసుకోవాలి
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): గుంటూరు నగరంలోని హజరత్ కాలే మస్తాన్ వలి దర్గాను రావి రామ్మోహనరావు, అతని కుమారుడు మస్తాన్ సాయి వ్యాపార కేంద్రంగా మార్చారని ముస్లిం సేన రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ గుంటూరు జిల్లా వక్ఫ్ బోర్డ్ జాయింట్ సెక్రటరీ షేక్ సుభాని, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా ధ్వజమెత్తారు. స్థానిక నగరంపాలెంలోని ముస్లిం సేన రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రావి రామ్మోహనరావు కుటుంబానికి ఈ దర్గాకు సంబంధం లేదని కోర్టు స్పష్టం చేసినా, గత వక్ఫ్ బోర్డులో ఇతనిపై చర్యలు తీసుకోవాలని షోకాజ్ నోటీస్ ఇచ్చి దర్గాను స్వాధీనం చేసుకోవాలని వక్ఫ్‌బోర్డు నిర్ణయించినా వక్ఫ్ బోర్డు సీఈఓ కనీస చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఇప్పటికై నా సర్కారు, వక్ఫ్ బోర్డు అధికారులు దృష్టి సారించి దర్గాను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. మస్తాన్ సాయిపై డ్రగ్స్, మహిళలను మోసం చేసిన కేసులు నమోదయ్యాయని, ఇది దర్గా పవిత్రతకు భంగం కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్, మైనార్టీ నాయకుడు సైదా, సత్య పలువురు పాల్గొన్నారు.
జేఈఈ మెయిన్‌లో మెరిసిన విద్యార్థికి సత్కారం
తెనాలి: జాతీయస్థాయి ఐఐటీ–జేఈఈ మెయిన్‌లో రికార్డు స్థాయిలో 99.37 పర్సెంటైల్ సాధించిన తెనాలి వివేక జూనియర్ కాలేజి విద్యార్థి తూనుగుంట్ల వెంకట పవన్‌కుమార్‌ను రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అభినందించారు. తెనాలిలోని తన కార్యాలయంలో శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. పేద కుటుంబానికి చెందిన పవన్‌కుమార్‌కు ప్రభుత్వపరంగా, వ్యక్తిగతంగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పవన్‌కుమార్ వెంట ఉన్న వివేక విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కె.రామరాజు, సీఈవో ఉదయ్‌కిరణ్‌ను మంత్రి మనోహర్ ప్రశంసించారు.
పసుపు ధరలు
దుగ్గిరాల: దుగ్గిరాల పసుపు యార్డులో గురువారం 168 బస్తాలు వచ్చాయి. పసుపు మొత్తం అమ్మకం చేసినట్లు వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యదర్శి శ్రీనివాసరరావు ఒక ప్రకటనలో తెలిపారు. సరుకు 139 బస్తాలకు కనిష్ట ధర రూ.8400 గరిష్ట ధర రూ.10,750 మోడల్ ధర రూ.10,750, కాయలు 29 బస్తాలకు కనిష్ట ధర రూ.8,400, గరిష్ట ధర రూ.10,001, మోడల్ ధర రూ.10,001 పలికింది. మొత్తం 126 క్వింటాళ్ల అమ్మకాలు జరిగినట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment