హోంగార్డుపై యువకుడు దాడి
చెరుకుపల్లి: మద్యం మత్తులో ఓ యువకుడు హల్‌చల్ చేశాడు. ఏకంగా పోలీసులపైనే దాడికి దిగాడు. వివరాలు.. గుళ్ళపల్లి గ్రామానికి చెందిన వాగు దినేష్ గురువారం సాయంత్రం మద్యం తాగి జాతీయ రహదారిపై వాహనాల ముందుకు వెళ్లాడు. ట్రాఫిక్ విధుల్లో ఉన్న కారంకి శ్రీనివాసరావు అనే హోంగార్డు, మరో కానిస్టేబుల్ ఎంత వారించినా వినలేదు. వారిని దుర్భాషలాడుతూ హోంగార్డు శ్రీనివాసరావును కింద పడేసి దాడి చేశాడు. చొక్కా చించేశాడు. ఎస్సై అనీల్‌కుమార్ సిబ్బందితో వచ్చి ట్రాఫిక్ నియంత్రించారు. దినేష్‌కు ఎంత చెప్పినా వినకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. హోంగార్డు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై అనిల్‌కుమార్ తెలిపారు.
ఇన్విజిలేటర్లుగా స్కూల్ అసిస్టెంట్లను నియమించాలి
బాపట్ల టౌన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ఇన్విజిలేటర్లుగా స్కూల్ అసిస్టెంట్లను నియమించాలని స్కూల్ అసిస్టెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఓ పిచ్చయ్య, ప్రధాన కార్యదర్శి టి.వి. సురేష్‌లు గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు ఉన్నాయన్నారు.
బాలిక అదృశ్యంపై కేసు
మంగళగిరి టౌన్: బాలిక అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు మంగళగిరి పట్టణ పోలీసులు గురువారం తెలిపారు. మంగళగిరి పార్కు రోడ్డులో ఉంటున్న బాలిక గుంటూరు సమీపంలోని సిమ్స్ కాలేజీలో నర్సింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తండ్రి కొంతకాలం క్రితం మరణించడంతో బాలిక తల్లి తిరుపతమ్మ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో హౌస్ కీపింగ్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఫిబ్రవరి 14న కాలేజీకి వెళ్లిన కుమార్తె సాయంత్రానికి ఇంటికి రాకపోవడంతో చుట్టుపక్కల వెతికింది. ఆచూకీ లభించకపోవడంతో బుధవారం రాత్రి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
బడ్జెట్‌లో చేనేత రంగానికి రూ.2వేల కోట్లు కేటాయించాలి
మంగళగిరి టౌన్ : రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌లో చేనేత రంగానికి రూ. 2వేల కోట్లు నిధులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి నాగేశ్వరరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళగిరి నగర పరిధిలోని ఏపీ చేనేత కార్మిక సంఘం కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. నాగేశ్వరరావు మాట్లా డుతూ చేనేతలకు జనాభా ప్రాతిపదికన నిధు లు కేటాయించాలని కోరారు. చేనేత సహకార సంఘాలకు బకాయి ఉన్న రూ. 172 కోట్లను వెంటనే విడుదలచేయాలని డిమాండ్ చేశారు. ఈ సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని, నేతన్న నేస్తం పథకాన్ని రూ.24 వేల నుంచి రూ.36 వేల రూపాయలకు పెంచాలని కోరారు. బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయించకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సంఘం జిల్లా అధ్యక్షులు వెంకట కృష్ణారావు, ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment