బల్లికురవ: రబీ సీజన్‌లో సాగుచేసిన మొక్కజొన్న, వరి పైర్లు చేతికందుతాయో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. సాగర్ అద్దంకి బ్రాంచ్ కాలువ పరిధిలో సంతమాగులూరు, బల్లికురవ మండలాల్లో సుమారు 16 వేల ఎకరాల వరకు ఆయకట్టు ఉంది. రబీలో రెండు మండలాల్లో కలిపి సుమారు 7 వేల ఎకరాల్లో మొక్కజొన్న, వరి, పశుగ్రాసం, కూరగాయల పంటలను రైతులు సాగు చేశారు. బ్రాంచ్ కాలువకు నీటి విడుదల తగ్గించటం, వారాబందీ విధానంతో పసుమర్రు, చెన్నుపల్లి, వెంపరాల, వైదన, గుంటుపల్లి, అద్దంకి మేజర్లకు సాగర్ నీరు అందటం లేదు. దీంతో పైర్లు ఎండిపోతున్నాయి. దీనికితోడు మార్చినెలాఖరు వరకే సాగర్ నీరు అందిస్తామని అధికారులు ప్రకటించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి సాగుచేసిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు. 18/0 సంతమాగులూరు మండలం అడవి పాలెం వద్దకు 1,200 క్యూసెక్కులకు తగ్గకుండా 33/0 వల్లాపల్లి లాకుల వద్దకు 900 క్యూసెక్కులకు తగ్గకుండా చేరితేనే అన్ని మేజర్లకు నీరు అందే అవకాశం ఉంది. వారాబందీ, నీటి పంపిణీ తగ్గించడంతో వల్లాపల్లి లాకుల వరకు 500 క్యూసెక్కులు మాత్రమే అరకొరగా అందుతోంది దీనివల్ల చేలకు నీరు చేరడం లేదని రైతులు చెబుతున్నారు.
ఏప్రిల్ 15 వరకు అందించాలి
అద్దంకి బ్రాంచ్ కాలువ పరిధిలో మొక్కజొన్న, వరి, పశుగ్రాసం పైర్లు సాగులో ఉన్నాయి. వల్లాపల్లి లాకుల వరకు 900 క్యూసెక్కులకు తగ్గకుండా నీరందిస్తేనే ఎండుతున్న పైర్లను కాపాడుకోగలం. ఎకరాకు సుమారు 20 వేల వరకు పెట్టుబడులు పెట్టాం. నీరందకపోతే నష్టాలు తప్పవు. ఏప్రిల్ 15 వరకు నీరివ్వాలి. – నాయుడు శివయ్య, రైతు
నిరంతరాయంగా నీరివ్వాలి
వారాబందీ లేకుండా వల్లాపల్లి లాకుల వరకు 900 క్యూసెక్కులకు తగ్గకుండా నిరంతరాయంగా నీరు అందిస్తే ఎండుతున్న పైర్లను కాపాడుకోగలం. అరకొరగా అందుతున్న నీరు వల్ల ఉపయోగం లేదు. పంటలు ఎండిపోతున్నాయి. అధికారులు ఆదుకోవాలి. – కొమ్మినేని భాస్కర్, రైతు
ఆందోళనలో రైతులు
అందని నీరు.. ఎండుతున్న పైరు
అందని నీరు.. ఎండుతున్న పైరు
అందని నీరు.. ఎండుతున్న పైరు