ఆరోగ్య మిత్రల
జీఓ నెం.28 రద్దు చేయాలి
ఈ ఉద్యోగాన్ని నమ్ముకుని చాలా మంది కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. అనేక ఒడిదొడుకుల మధ్య ఏళ్ల తరబడి పనిచేస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని బీమా కంపెనీలో చేరుస్తారని చెబుతున్నారు. దీంతో చాలా మంది ఇబ్బంది పడే అవకాశాలున్నాయి. ప్రభుత్వం ఆరోగ్య మిత్రలకు న్యాయం చేయాలి. ప్రధానంగా జీతభత్యాలు పెంచాలి. 28 జీఓను రద్దు చేయాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించాలన్నదే మా ముఖ్యమైన డిమాండ్.
– బడుగు రాజు, ఆరోగ్య మిత్ర కాంట్రాక్ట్ అండ్ అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు
సమస్యలు పరిష్కరించాలి
ఏళ్ల తరబడి ఎన్నో ఒత్తిళ్లను తట్టుకొని పేదలకు సేవ చేస్తున్నాం. మాలాంటి వారిని ఇబ్బందులకు గురి చేసేలా నిర్ణయాలు తీసుకోవడం సరైన పద్ధతి కాదు. మా న్యాయమైన సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం చొరవ చూపాలి. ఈ విషయాలపై ఈ నెల 12న ఉన్నతాధికారులతో జరిగిన చర్చలు ఫలించలేదు. ప్రస్తుతం తెరపైకి వస్తున్న కొన్ని ఊహాగానాలతో అసలు మా ఉద్యోగాలు ఉంటాయో...ఉండవోనన్న ఆందోళన మా అందరిలో మొదలైంది.
– జె. పాప, ఆరోగ్య మిత్ర
బాపట్ల టౌన్ : డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ పథకంలో పనిచేసే ఆరోగ్య మిత్రల్లో ఆందోళన నెలకొంది. ఉద్యోగం ఉంటుందో.. ఊడుతుందో తెలియక సతమతం అవుతున్నారు. ఆరోగ్యశ్రీ స్థానంలో బీమా కంపెనీ ద్వారా సేవలు అందిస్తామని కూటమి సర్కార్ చెబుతోంది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇలా చేయడానికి ఏర్పాట్లు చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీమా కంపెనీ వస్తే ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పథకంలో పనిచేస్తున్న ఆరోగ్య మిత్రలు, టీమ్ లీడర్లు, ఆఫీస్ సిబ్బందిని కొనసాగిస్తారా...లేదా.. అనే ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది. ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వకపోవడంతో ఈ నెల 10వ తేదీ నుంచి వారందరూ విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ నెల 12న వారిని చర్చలకు పిలిచారు. చర్చలు విఫలం కావడంతో 17 నుంచి 24వ తేదీ వరకు విధులు బహిష్కరించి శాంతియుత నిరసనకు దిగారు.
సీఎఫ్‌ఎంఎస్‌తో ఉద్యోగ భద్రత
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ విభాగంలో పనిచేసిన ఉద్యోగులను ఆప్కాస్ (ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్సింగ్ సర్వీసెస్) కిందకు చేర్చారు. వారికి సీఎఫ్‌ఎంఎస్ ఐడీ ద్వారా ప్రతి నెలా 5వ తేదీలోపు జీతాలు ఇచ్చారు. ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యం కూడా కల్పించారు. సీఎఫ్‌ఎంఎస్ వేతనం తీసుకోవడంతో తమ ఉద్యోగాలకు భద్రత ఉంటుందన్న ఆశతో ఇన్నాళ్లుగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవను ప్రైవేటు బీమా కంపెనీకి అప్పగించే కుట్ర జరుగుతుండటంతో ఉద్యోగ భద్రతపై వైద్య మిత్రలు ఆందోళనకు గురవుతున్నారు.
జిల్లాలో 20 నెట్‌వర్క్ వైద్యశాలలు
జిల్లాలోని 20 నెట్‌వర్క్ వైద్యశాలల్లో 33 మంది ఆరోగ్య మిత్రలు పనిచేస్తున్నారు. వీటిల్లో రెండు ఏరియా వైద్యశాలలు, 8 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, పది ప్రైవేట్ వైద్యశాలలు ఉన్నాయి. వాటిల్లో చీరాలలో ఆరు, అద్దంకిలో మూడు, బాపట్లలో రెండు, రేపల్లెలో రెండు ఉన్నాయి. వేమూరులో, నగరంలో, పిట్టలవానిపాలెంలో, నిజాంపట్నంలో, చెరుకుపల్లిలో, మార్టూరులో, పర్చూరులో ఒకటి చొప్పున ఉన్నాయి.
ఆరోగ్యశ్రీని బీమా కంపెనీకి అప్పగించేందుకు పాలకుల కుట్ర కూటమి సర్కారు దెబ్బకు సర్వీసుకు ఎసరు 15 ఏళ్లకుపైగా విధుల్లో ఉన్న ఆరోగ్య మిత్రలు కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ 24 వరకు సమ్మెలోనేకొనసాగనున్న ఉద్యోగులు సేవలు అందక తీవ్ర అవస్థలు పడుతున్న రోగులు
15 సంవత్సరాలుగా సేవలు
రోగులు వైద్యశాలల్లో చేరినప్పటి నుంచి తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకునే వరకు వైద్య మిత్రలు పర్యవేక్షిస్తుంటారు. పేద రోగులకు అవసరమైన సమాచారాన్ని అందిస్తుంటారు. ఉద్యోగులు, జర్నలిస్టుల హెల్త్ కార్డులు, ఆరోగ్యరక్ష స్కీముకు సంబంధించి వివరాలు తెలియజేస్తుంటారు. ఇలా అన్ని విభాగాల్లో 15 ఏళ్లకుపైగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల వయసు కూడా చాలా మందికి 50 ఏళ్లు దాటింది. ఆరోగ్యశ్రీ ప్రైవేటు బీమా కంపెనీ చేతుల్లోకి వెళితే ఎవర్ని తొలగిస్తారోనని ఆందోళనగా ఉందని, ఈ వయసులో వేరే ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించి, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. ఫీల్డ్ సిబ్బందికి అంతర్గత ప్రమోషన్లు కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగాలకు వెయిటేజ్ ఇవ్వాలని, చనిపోయిన సిబ్బందికి రూ.15 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, గ్రాట్యూటీ రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
మెడపై కత్తి!
మెడపై కత్తి!