రుణాల పంపిణీలో లక్ష్యాలు సాధించాలి | - | Sakshi
Sakshi News home page

రుణాల పంపిణీలో లక్ష్యాలు సాధించాలి

Published Thu, Mar 20 2025 2:39 AM | Last Updated on Thu, Mar 20 2025 2:36 AM

బాపట్ల: జిల్లాలోని రైతులకు బ్యాంకర్లు అధిక రుణ సౌకర్యం కల్పించాలని జిల్లా కలెక్టర్‌ జె.వెంకట మురళి పేర్కొన్నారు. బ్యాంకర్ల జిల్లా స్థాయి సమీక్షా సమావేశం బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ అధ్యక్షతన జరిగింది. ప్రాధాన్యతా రంగాలు, ప్రాధాన్యత లేని రంగాలకు రుణాల పంపిణీలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అధికారులు నూరు శాతం చేరుకోవాలని సూచించారు. పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నందున నిరుపేదల జీవనోపాధి పెంచడానికి రుణ సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. బ్యాంకు అధికారులు మానవతా దృక్పథంతో పనిచేయాలని ఆయన సూచించారు. నిరుపేదలకు ఎలాంటి అన్యాయం జరగకుండా రుణ పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు. పీఎం విశ్వకర్మ, పీఎం సూర్య ఘర్‌, చేనేతలకు ముద్ర రుణాలు, అన్ని విభాగాల కార్పొరేషన్‌ రుణాలు, కిసాన్‌ డ్రోన్స్‌, ఎన్‌ఎల్‌ఎం పెండింగ్‌ దరఖాస్తులపై దృష్టి సారించాలని సూచించారు. గేదెల బీమా కోసం పశుబీమా పథకం అమలుపై ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ఉత్పత్తి రంగాల అభివృద్ధికి అధిక రుణాలు ఇవ్వాలని తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగానికి రూ.10,054 కోట్ల రుణాలు లక్ష్యం కాగా, డిసెంబర్‌ 31వ తేదీ నాటికి రూ.9,321 కోట్ల రుణాలు పంపిణీ చేశామన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు రూ.1,154 కోట్లకుగాను రూ.862 కోట్లు, ఇతర ప్రాధాన్యతా రంగాలకు రూ.514 కోట్లకుగాను రూ.168 కోట్లు పంపిణీ చేశామని గుర్తుచేశారు. జిల్లా వ్యాప్తంగా రూ.13,444 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని బ్యాంకర్లకు లక్ష్యాలు నిర్దేశించగా 93.50 శాతానికి చేరినట్లు వివరించారు. గడిచిన రెండు నెలలు, రానున్న 20 రోజుల్లో నూరు శాతం లక్ష్యాలు చేరుకోవాలని తెలిపారు. కౌలు రైతులకు రూ.100 కోట్లు రుణాలు ఇవ్వాలని ఆదేశించారు. ప్రస్తుతం 1.89 లక్షల మంది కౌలు రైతులకు కార్డులు జారీ చేశామన్నారు. వారికి ప్రస్తుతం రూ.55 కోట్లు రుణం ఇవ్వగా, పంట రుణాలు అందించాలని సూచించారు. 7,900 చేనేత కుటుంబాలకు రుణ సదుపాయం కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. పొదుపు మహిళా సంఘాలకు లక్ష్యం మేరకు రుణ సదుపాయం కల్పించాలని పేర్కొన్నారు. ముద్ర రుణాల మంజూరులో ప్రస్తుతం 44.40 శాతం లక్ష్యం కాగా, నూరు శాతం చేరుకోవాలని సూచనలు చేశారు. సమావేశంలో ఆర్‌బీఐ ఎల్డీఓ అభిషేక్‌, నాబార్డ్‌ డీడీఎం రవికుమార్‌, ఎల్‌డీఎం శివకృష్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జలజీవన్‌ మిషన్‌కు రూ.149 కోట్లు

బాపట్ల: జలజీవన్‌ మిషన్‌ జిల్లాకు రూ.149 కోట్ల నిధులు మంజూరయ్యాయని, 337 పనులు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్‌ జె.వెంకట మురళి అన్నారు. బుధవారం స్థానిక కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో వాటర్‌, శానిటేషన్‌ మిషన్‌ జిల్లా స్థాయి సమావేశం జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జలజీవన్‌ మిషన్‌ కింద ప్రభుత్వం మంజూరు చేసిన పనులకు టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేయాలని చెప్పారు. జిల్లాలోని సమగ్ర నీటి సరఫరా పథకాలను, తాగునీటి బోర్ల మరమ్మతులు చేపట్టడానికి అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలని పేర్కొన్నారు. తాగునీటి పథకాలను మరమ్మతులు చేయడానికి జిల్లా పరిషత్‌ 15 ఆర్థిక సంఘం నిధుల విషయం గురించి అడిగారు. తాగునీటి పథకాలకు బోర్ల మరమ్మతులకు గ్రామస్థాయిలో పంచాయతీలకు మంజూరైన నిధులు ఎంతనే విషయాలపై నివేదిక ఇవ్వాలని జిల్లా పంచాయతీ అధికారిని కలెక్టర్‌ ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాలలో టాయిలెట్లను మరమ్మతులు చేపట్టడానికి చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతీలో మురుగునీటి కాలువల నిర్మాణానికి రూ. 50 లక్షల నిధులు మంజూరు చేసేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ నీటి సరఫరా శాఖ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ అనంత రాజు, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్‌, డ్వామా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ విజయలక్ష్మి, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ రాధా మాధవి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామకృష్ణ, గుంటూరు జిల్లా పరిషత్‌ డిప్యూటీ సీఇఓ కృష్ణ, ప్రకాశం జిల్లా పరిషత్‌ డిప్యూటీ సీఇఓ బాలమ్మ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్‌ జె.వెంకట మురళి

నిరుపేద కుటుంబానికి చేయూత

బాపట్ల: ఓ నిరుపేద కుటుంబానికి జిల్లా కలెక్టర్‌ జె. వెంకట మురళి చేయూత అందించారు. కర్లపాలెం మండలం పేరళి గ్రామానికి చెందిన దోమతోటి సందీప్‌ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ కొంతకాలం క్రితం స్తంభంపై విద్యుత్‌ షాక్‌తో మృతి చెందాడు. కుటుంబం వీధిన పడింది. సందీప్‌ తల్లి కలెక్టర్‌కు దీనిపై వినతిపత్రం అందజేశారు. సందీప్‌ సోదరుడు సునీల్‌ కుమార్‌కు పొరుగు సేవల పద్ధతిలో ఉద్యోగం కల్పించి ఆ కుటుంబానికి దారి చూపారు. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో కమాటీగా అతడిని నియమిస్తూ జిల్లా కలెక్టర్‌ బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు. నియామక ఉత్తర్వులను కలెక్టర్‌ స్వయంగా సునీల్‌ కుమార్‌కు అందజేశారు.జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి జె. రాజదిబోరా తదితరులు పాల్గొన్నారు.

రుణాల పంపిణీలో లక్ష్యాలు సాధించాలి 1
1/1

రుణాల పంపిణీలో లక్ష్యాలు సాధించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement