బాపట్ల: జిల్లాను అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ల కాన్ఫరెన్స్ నేపథ్యంలో స్థానిక కలెక్టరేట్‌లో ప్రగతి నివేదికలపై అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాను వ్యవసాయ అనుబంధ, పారిశ్రామిక రంగాలలో ప్రగతి పథంలో నిలిపేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. పర్యాటక రంగానికి అనుకూలమైన వాతావరణం ఉందని, 103 కిలోమీటర్ల సముద్ర తీరం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని గుర్తుచేశారు. మత్స్య సంపదకు వనరులు ఉన్నందున పరిశ్రమల స్థాపన దిశంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో వరదలు రాకుండా కరకట్ట అభివృద్ధికి తగిన ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. కృష్ణా, పశ్చిమ డెల్టా కాలువల మరమ్మతులపైనా దృష్టి పెట్లాన్నారు. తాగు నీటి ఇబ్బందుల్లేకుండా చూడాలని పేర్కొన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్, జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్ గౌడ్, ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామకృష్ణ, జిల్లా గ్రామీణ నీటి సరఫరాశాఖ ఎస్‌ఈ అనంతరాజు, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ వై.వెంకటేశ్వరరావు, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి, జిల్లా అటవీశాఖ అధికారి భీమయ్య, జిల్లా మత్స్యశాఖ అధికారి కృష్ణ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి
జిల్లాకు రైల్వే రేక్
మూమెంట్‌తో ఎంతో మేలు
బాపట్ల: జిల్లాకు రైల్వే రేక్ మూమెంట్ రావడం ప్రజలకు ఎంతో ఉపయోగకరమని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి అన్నారు. గురువారం బాపట్ల రైల్వే స్టేషన్‌లో రైల్వే రేక్ లోడింగ్, అన్ లోడింగ్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాకు కొత్త రైల్వే రేక్ రావడంతో జిల్లా రూపురేఖలు మారతాయని అన్నారు. రవాణా ఖర్చులు ప్రజలకు తగ్గుతాయని చెప్పారు. బాపట్ల జిల్లాకు పర్యాటకులు ఎక్కువ శాతం వచ్చే విధంగా వందే భారత్ ట్రైన్లు నిలుపుదల చేయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాపట్ల రైల్వే స్టేషన్‌కు వచ్చిన ట్రైన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా పౌర సరఫరాల అధికారి విలియమ్స్, బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి పి.గ్లోరియా, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, బాపట్ల రైల్వే స్టేషన్ మాస్టర్ మీనా, బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు, గొల్లపల్లి శ్రీనివాసరావు, శివరాం ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.