బాపట్ల: రాష్ట్రంలో కూటమి సర్కారు రైతన్నను నట్టేట ముంచిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున పేర్కొన్నారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.రాష్ట్రంలో రైతన్న పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఒక పక్కన అల్లాడిపోతుంటే, మరోవైపు సంక్షేమ ఫలాలు నిలిచిపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని దుయ్యబట్టారు. వ్యవసాయం దండగా అనే విధంగా కూటమి ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని విమర్శించారు. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు రైతన్నను ఆదుకునేందుకు అన్ని విధాలుగా కృషి చేసినట్లు గుర్తు చేశారు. రైతుభరోసా కేంద్రం ద్వారా గింజ నాటిన దగ్గర నుంచి పంటలు విక్రయించే వరకు అన్నీ ప్రభుత్వం చూసుకునేదని తెలిపారు. మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతులకు మేలు చేశారని చెప్పారు. నేడు పొగాకు, మిర్చి, జొన్న, పసుపు, చెరకు పంటలకు సరైన ధరలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. పంటకు గిట్టుబాటు ధర లేక ఒక పక్కన, మరోవైపు సాగు కోసం తెచ్చిన అప్పులు తీర్చుకోలేక దైనందిన స్థితిలో ఉన్నారని వివరించారు. ఇప్పటికై నా రైతులను పట్టించుకోవాలని కూటిమి ప్రభుత్వానికి సూచించారు.రైతులను ఆదుకునే వరకు వైఎస్సార్ సీపీ అండగానే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ధరలు తగ్గినప్పుడు రైతులను ఆదుకునేందుకు ధరల స్థిరీకరణ నిధి గురించి కూటమి సర్కారు పట్టించుకోకపోవడం విచారకరమని మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి రైతూ ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు. మార్క్‌ఫెడ్ ద్వారా కూడా అనేక పంటలను కోనుగోలు చేయించి రైతులకు మేలు చేసిన విషయాన్ని కోన గుర్తు చేశారు. బాపట్లలో నిలిచిపోయిన మెడికల్ కళాశాల పనులను తిరిగి ప్రారంభించే విధంగా ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మరాజును ప్రశ్నించాలని కోన సూచించారు. రైలు పేటలో సమస్యలను తెలుసుకునేందుకు ఎమ్మెల్యే వేగేశన ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు తనకు కొంతమంది ఫోన్ చేశారన్నారు. మెడికల్ కళాశాల గురించి ప్రస్తావించకుండా సమస్యలను ఎమ్మెల్యే అడగటం అశ్చర్యంగా ఉందని చెప్పారని కోన తెలిపారు. బాపట్ల ప్రాంతాభివృద్ధిలో ప్రధాన భూమిక పోషించే మెడికల్ కళాశాల సాధన కోసం అందరం కలిసి కృషి చేయాలని కోన పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లా కావడం, మరోవైపు మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతాభివృద్ధి వేగంగా ఉంటుందని కోన అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పట్టణ, మండల అధ్యక్షులు కాగిత సుఽధీర్‌బాబు, మరుప్రోలు కొండలరెడ్డి, పార్టీ నాయకులు గవిని కృష్ణమూర్తి, కోకి రాఘవరెడ్డి, వడ్డిముక్కల డేవిడ్, పిన్నిబోయిన ప్రసాద్, కొక్కిలిగడ్డ చెంచయ్య, జోగి రాజా పాల్గొన్నారు.
ధరల స్థిరీకరణ నిధి ఎక్కడ ?
మాజీ డెప్యూటీ స్పీకర్ కోన
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున వ్యవసాయం దండగా అన్నట్లు కూటమి పాలన రైతులకు అండగా వైఎస్సార్ సీపీ