
ఉల్లాసంగా ఎడ్ల పందేలు
తెనాలిరూరల్: తెనాలి మార్కెట్ యార్డు ఆవరణలో జరుగుతున్న ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ జాతీయస్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీలు రెండోరోజుకు చేరుకున్నాయి. వారం రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. రెండోరోజు ఉత్సాహంగా పందేలు సాగాయి. తెనాలి, పరిసర ప్రాంతాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తొలిరోజు శనివారం రాత్రి జరిగిన రెండు పళ్ల విభాగం పోటీల్లో నంధ్యాల జిల్లా గడివేములకు చెందిన పెరుమాళ్‌ల సంజయ్‌కుమార్ ఎడ్ల జత నిర్ణీత సమయంలో 3592.01 అడుగుల దూరం లాగి ప్రథమ బహుమతిని కై వసం చేసుకుంది. ఈ జత యజమానికి సినీ రచయిత బుర్రా సాయిమాధవ్ బహుమతిని అందజేశారు.
నాలుగు పళ్ల విభాగంలో..
రెండోరోజు నాలుగు పళ్ల విభాగం పోటీలు ఆదివారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. ఈ విభాగంలో మొత్తం 14 జతల ఎడ్లు పోటీకి దిగాయి. రాత్రి ఎనిమిది గంటల వరకు జరిగిన పోటీల్లో బాపట్ల జిల్లా జే పంగలూరుకు చెందిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ యూత్ ఎడ్ల జత ముందంజలో ఉన్నాయి. పోటీలు రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగాయి. రిఫరీగా సూరపనేని రాధాకృష్ణ వ్యవహరించారు.

ఉల్లాసంగా ఎడ్ల పందేలు