
ఆర్టీసీ సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలి
రేపల్లె రూరల్: ఆర్టీసీ కొత్త సర్వీసులను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. రేపల్లె ఆర్టీసీ డిపోకు కొత్తగా వచ్చిన 10 సర్వీసులను మంత్రి సత్యకుమార్ యాదవ్, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణతో కలిసి సోమవారం ఆయన ప్రారంభించారు. తిరుపతికి రెండు సర్వీసులు, గుంటూరు, విజయవాడలకు ఎనిమిది సర్వీసులను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. తిరుపతికి సర్వీసులను ఏర్పాటు చేయటంతో తీరప్రాంత ప్రజల చిరకాలవాంఛ నెరవేరిందన్నారు. రేపల్లె నుంచి నేరుగా తిరుపతికి సర్వీసులను ప్రారంభించటం ఆనందంగా ఉందన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందన్నారు. ప్రజాసంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పీ–4 సర్వేకు సహకరించాలన్నారు. ప్రజలకు ఇచ్చిన సూపర్–6 సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. రేపల్లె వైద్యశాలను 100 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేసినట్టు వివరించారు. అనంతరం ఆర్టీసీ బస్సు సర్వీసులను జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, డిపో మేనేజర్ సుఖవాసి సునీల్‌కుమార్, వివిధ యూనియన్ల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే మండలంలోని మోర్లవారిపాలెం గ్రామంలో కొత్తగా నిర్మించిన కల్యాణ మండపాన్ని ప్రారంభించి, చాట్రగడ్డలోని సనాతన వేదాంత నిష్ఠాశ్రమ శ్రీ సరస్వతీ విద్యామందిర్ పాఠశాల నూతన భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి
అనగాని సత్యప్రసాద్