
వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడిపై టీడీపీ శ్రేణుల దాడి
లంకెలకూరపాడు(ముప్పాళ్ల): ముప్పాళ్ల మండలం లంకెలకూరపాడు గ్రామంలో వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడిపై అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు దాడికి దిగిన సంఘటన గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... గ్రామంలోని వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడైన మలిరెడ్డి శ్రీనివాసరెడ్డి కొంత కాలంగా నరసరావుపేటలో నివాసముంటున్నాడు. మాజీ సర్పంచ్ వర్ధంతి కార్యక్రమానికి గ్రామానికి వచ్చాడు. పాతకక్షల నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు మలిరెడ్డి శ్రీనివాసరెడ్డి(పెదకాపు), అతని కుమారుడు బ్రహ్మారెడ్డి, కిష్టిపాటి లింగారెడ్డిలు విచక్షణారహితంగా దాడి చేశారు. ముఖంపైన తీవ్ర గాయాలు కావటంతో చికిత్స నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేస్తుండగా స్పృహ కోల్పోవటంతో మెరుగైన చికిత్స నిమిత్తం నరసరావుపేటలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. జరిగిన సంఘటనపై ముప్పాళ్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గాయపడిన శ్రీనివాసరెడ్డిని వైఎస్సార్ సీపీ నాయకులు ఎంజేఎం రామలింగారెడ్డి, రెండెద్దుల వెంకటేశ్వరరెడ్డి, నాయకులు ఆసుపత్రిలో పరామర్శించారు.