
దివ్యాంగుల సమస్యలపై దృష్టి సారించాలి
గుంటూరు జిల్లా జేసీ భార్గవ్‌తేజ
గుంటూరువెస్ట్: దివ్యాంగుల సమస్యలపై అధికారులు దృష్టి సారించి వారి ఇబ్బందులను గుర్తించా లని జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్‌తేజ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని డీఆర్సీ సమావేశ మంది రంలో నిర్వహించిన జిల్లాస్థాయి వికలాంగుల కమి టీ సమావేశంలో జేసీ మాట్లాడుతూ సంబంధిత శాఖ అధికారులు వారితో మాట్లాడి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. వివిధ దివ్యాంగ సంఘ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు. ప్రభుత్వ షాపింగ్ కాంప్లెక్సులు, మున్సిపల్ కాంప్లెక్సుల్లో దుకాణాలు, స్టాల్స్ కేటాయింపులో దివ్యాంగులకు అవకాశాలు కల్పించాలన్నారు. సదరం సర్టిఫికెట్ల జారీలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. వంద శాతం వినికిడి లోపం ఉన్నవారికి ఉచితంగా బస్సు పాస్ ఇవ్వాలన్నారు. దివ్యాంగుల ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తే వారి కుటుంబాలు బాగుంటాయని పేర్కొన్నారు. అవసరం మేరకు ట్రైసైకిళ్లు మంజూరు చేయాలని కోరారు. సబ్సిడీ రుణాలు మంజూరు చేయడంలో గ్యారంటీగా ప్రభుత్వ ఉద్యోగి సూరిటీ అడుగుతున్నారని, దీన్ని కొంత ఆలోచించాలని పేర్కొన్నారు. వికలాంగుల సంక్షేమ అధికారి సువార్త, జెడ్పి సీఈఓ జ్యోతిబసు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.