
మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం
కొల్లూరు: విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడిన ఇరువురు లైన్‌మెన్ల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ సాయం కింద నగదు అందజేసినట్లు తహసీల్దార్ బి. వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున మండలంలోని ఈపూరులో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో సిబ్బంది మరమ్మతు పనులు చేపట్టారు. అదే సమయంలో విద్యుత్ సరఫరా జరగడంతో దోనేపూడి లైన్‌మన్ పోతార్లంక లీలాదుర్గాశంకర్ (51), ఈపూరు సచివాలయం జూనియర్ లైన్‌మన్ ఆకుల మహేష్ (37)లు మృతి చెందారు. ప్రమాద ఘటనపై కొల్లూరు తహసీల్దార్‌ను జిల్లా కలెక్టర్ జె.వెంకటమురళి ఆరా తీశారు. కలెక్టర్ ఆదేశాలతో మృతుల కుటుంబాలను పరామర్శించిన తహసీల్దార్ ఒక్కొక్క మృతుడి కుటుంబానికి దహన సంస్కారాల ఖర్చుల కింద రూ.10 వేలు అందజేశారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు అండగా ఉంటుందని కలెక్టర్ భరోసా ఇచ్చారు.