
మనోళ్లే ఆర్పీగా పెట్టుకోండి
● ఎమ్మెల్యే సిఫార్సు లేఖ ● నియమించిన మెప్మా సిబ్బంది
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): ‘మనోళ్లే.. నేను చెప్తున్న కదా.. ఆ అమ్మాయిని రిసోర్స్ పర్సన్(ఆర్పీ)గా పెట్టుకోవాలి’ అంటూ తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ హుకుం జారీ చేశారు. ఎమ్మెల్యే సిఫార్సు లేఖ ఇవ్వడంతో మెప్మా సీఎంఎం పావని, సీఓ సరోజిని కొత్తగా ఓ ఆర్పీని నియమించారు. అంతేగాక ఆమెకు వేరే ఆర్పీ వద్ద నుంచి 22 గ్రూపులను తీసుకుని కేటాయించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సీఎంఎంలు(సిటీ మిషన్ మేనేజర్), సీఓలు(కమ్యూనిటీ ఆర్గనైజర్)ల కంటే ఆర్పీలు ఎక్కువగా ఉన్నారని.. వీరికి జీతాలు చెల్లించేందుకు కూడా అవస్థలు పడాల్సిన దుస్థితి ఉందని, కొత్తవారిని తీసుకోవద్దని మెప్మా ఎండీ స్పష్టంగా ఆదేశించినా సిబ్బంది పెడచెవిన పెట్టారు. ఎమ్మెల్యే లేటర్ ఇచ్చారని కొత్త ఆర్పీని నియమించారు. బుధవారం రామిరెడ్డితోటలోని బంగ్లా మున్సిపల్ స్కూల్‌లో సమావేశమై కొత్త ఆర్పీని గ్రూపు సభ్యులకు పరిచయం చేశారు.
లాగిన్ ఇవ్వడం లేదు
కొత్త ఆర్పీ కోసం సమైక్యలో గ్రూపు సభ్యులంతా కలిసి తీర్మానం చేసుకున్నారు. ఆ తీర్మానం మేరకే కొత్త ఆర్పీని నియమించాం. కానీ లాగిన్ ఇవ్వడం లేదు. ప్రస్తుతం వేరే ఆర్‌పీల వద్ద ఉన్న గ్రూపుల నుంచి 22 గ్రూపులను కొత్త ఆర్పీకి కేటాయించాం. – పావని, సీఎంఎం