
బొబ్బర్లంక ఎస్టీ కుటుంబాలకు న్యాయం చేయాలి
రేపల్లె రూరల్: పశువుల మాదిరిగా ఎస్టీ కుటుంబాలకు చెందిన మనుషులను క్రయవిక్రయాలు జరిపి వారిచే వెట్టిచాకిరి చేయించుకన్న వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం బాపట్ల జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మణిలాల్ డిమాండ్ చేశారు. బొబ్బర్లంక ఎస్టీ కాలనీలో నిరాధరణకు గురై కట్టుబానిసలుగా పనిచేస్తున్న గిరిజనులను సీపీఎం, కేవీపీఎస్, ఐద్వా తదితర ప్రజాసంఘాల సభ్యులు గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా మణిలాల్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా ఎస్టీలను కట్టుబానిసలుగా చేసుకుని హింసలకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్ని చట్టాలు చేసినా ఇంకా బానిసత్వం ఉండటం శోచనీయమన్నారు. ఎస్సీ, ఎస్టీలు సమాజంలో ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ కులవివక్షకు, దోపిడీకి, అన్యాయానికి గురవుతున్నారన్నారు. అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని శ్రమను దోచుకుని బానిసలుగా మార్చినవారిపై కఠిన చర్యలు తీసుకోవటంతో పాటు దోపిడీకి గురైన కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలన్నారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి అక్రమార్కుల చెరలో బందీలుగా ఉన్న కుటుంబాలను విడిపించి ఒక్కో కుటుంబానికి రూ.2లక్షల పరిహారం అందించాలన్నారు. ఈ సందర్భంగా గిరిజనులకు ప్రభుత్వం కల్పించిన హక్కులను వివరించారు. సీపీఎం, కేవీపీఎస్, ఐద్వా నాయకులు కేవీ లక్ష్మణరావు, కె.ఆశీర్వాదం, డి.ఆగస్టిన్, కె.నాంచారమ్మ, జి.దానియేలు తదితరులు పాల్గొన్నారు.
ఎస్టీల క్రయవిక్రయాలకు పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలి
సీపీఎం బాపట్ల జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మణిలాల్