
అంబేడ్కర్ ఆశయాలు యువతకు ఆదర్శనీయం
బాపట్ల టౌన్: అంబేడ్కర్ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. అంబేడ్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఎస్పీ తుషార్‌డూడీ మాట్లాడుతూ దేశంలో అసమానతలు లేని సమాజాన్ని నిర్మించడానికి అంబేడ్కర్ విశేష కృషి చేశారని తెలిపారు. భారతదేశ రాజ్యాంగానికి దిశా నిర్దేశం చేసిన మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం విశేష కృషి చేశారని చెప్పారు. నాడు అంబేడ్కర్ ఎన్నో అవమానాలు ఎదుర్కొని ప్రపంచ మేధావి అయ్యారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని తెలిపారు. సమాజంలో కుల, మత, వర్గ, లింగ వివక్షను ఎప్పుడైతే విడనాడతామో అప్పుడే అభివృద్ధి చెందుతుందని వివరించారు. అంబేడ్కర్ చెప్పిన విధంగా ‘‘మనమంతా భారతీయులం, మనమంతా ఒక్కటే’’ అనే నినాదంతో జీవించాలని, అదే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అన్నారు. అంబేడ్కర్ పేద కుటుంబంలో పుట్టి, ఎంతో కష్టపడి చదివి, ఎన్నో కష్టనష్టాలకు ఎదురొడ్డి ఉన్నతస్థాయికి చేరుకున్నారని ఎస్పీ వివరించారు. న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయ వేత్తగా, రాజ్యాంగ నిర్మాతగా అన్నిటికి మించి సామాజిక సంస్కర్తగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. అంటరానితనంపై అలుపెరగని పోరాటం చేశారని తెలిపారు. కార్యక్రమంలో అడ్మిన్ ఆర్‌ఐ మౌలుద్దీన్, సీసీ హరికృష్ణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ తుషార్ డూడీ