
కత్తవ చెరువులో ఆక్రమణలు తొలగించాలి
నరసరావుపేట: సత్తెనపల్లి రోడ్డులో ఆవుల సత్రం పక్కన ఉన్న 60 ఎకరాలకుపైగా విస్తీర్ణం కలిగిన కత్తవ చెరువు ఆక్రమణల చెరలో ఉంది. ఈ చెరువును పరిరక్షించాల్సింది ఎవరనే దానిపై మున్సిపాలిటీ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల మధ్య వాదన నడుస్తోంది. పట్టణానికి పశ్చిమం వైపు నుంచి ప్రవహించే మురుగునీరు ఈ చెరువుకు చేరి కిందికి వెళుతోంది. దగ్గరలోనే రైల్వే బ్రిడ్జి, రైల్వే లైను ఉన్నాయి. నిరంతరం రైల్వే అధికారులు, ఇరిగేషన్ అధికారులు ఈ చెరువును పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇక్కడ ఆక్రమణల విషయం మున్సిపల్ అధికారులకు తెలిసినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టణ ప్లానింగ్ ఆఫీసర్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని ప్రజాసంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్‌లను కలిసి ఆక్రమణలు తొలగించాలని వారు గతంలో కోరారు. ఆక్రమణలు తొలగించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించినా చర్యలు తీసుకునేందుకు అధికారులు ముందుకు రావట్లేదు. ఆక్రమణదారుల వైపు ఎంత బలముందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యవహారంపై పోరాడుతున్న ప్రజాసంఘాల నాయకులు తాజాగా మంగళవారం మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. కార్యాలయ సూపరింటెండెంట్‌తోపాటు చిన్న నీటి పారుదల శాఖకు చెందిన డీఈ, ఏఈలకు వినతిపత్రాలు సమర్పించారు. దీనిపై వారు స్పందిస్తూ ఆక్రమణలు జరిగిన మాట వాస్తవమేనని పేర్కొన్నారు. మున్సిపాలిటీ, రెవెన్యూ శాఖలు కలిసి చర్యలు తీసుకోవాల్సి ఉందని తెలిపినట్లు నాయకులు వెల్లడించారు. గతంలో ఆర్డీవో సమావేశం నిర్వహించి ఆక్రమణలు తొలగించే ప్రయత్నం చేశారన్నారు. దీనిపై పీడీఎం జిల్లా కార్యదర్శి జి.రామకృష్ణ మాట్లాడుతూ.. రైల్వే లైను భద్రతతోపాటు పట్టణంలోని బరంపేట, గుంటూరు రోడ్డు ప్రాంతాలు ముంపు లేకుండా ఉండాలంటే కూడా ఈ చెరువును ఆక్రమణల నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి ఆయా శాఖలకు చెందిన అధికారులను సమన్వయపరిచి ఆక్రమణలు తొలగింపజేయాలన్నారు. రక్షణ కంచె ఏర్పాటు చేయవలసిందిగా కోరారు. పీడీఎం జిల్లా అధ్యక్షుడు షేక్ మస్తాన్‌వలి, సీనియర్ నాయకులు వై.వెంకటేశ్వరరావు, నల్లపాటి రామారావు, గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి. కోట నాయక్, ఆర్టీఐ కార్యకర్త వసంతరావు పాల్గొన్నారు.
ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా శాఖల మధ్య సమన్వయలోపమే శాపం జిల్లా కలెక్టర్ జోక్యానికి నేతల వినతి