
‘అభినవ గంధర్వ’ ఆరాధ్యుల వెంకటేశ్వరరావు
తెనాలి: కళారంగంలో విశిష్ట కృషిచేసిన నాటకరంగ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం బహూకరించే కందుకూరి వీరేశలింగం రాష్ట్ర అవార్డుకు పట్టణానికి చెందిన ప్రముఖ పద్యనాటక కళాకారుడు ఆరాధ్యుల వెంకటేశ్వరరావు ఎంపికయ్యారు. కందుకూరి వీరేశలింగం జయంతి రోజైన బుధవారం సాయంత్రం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటుచేసే అవార్డుల ప్రదానోత్సవంలో వెంకటేశ్వరరావును వీరేశలింగం అవార్డు, రూ.లక్ష నగదు, జ్ఞాపికతో సత్కరిస్తారు. ఈ సందర్భంగా కళారంగ ప్రముఖుడు వెంకటేశ్వరరావు పరిచయం. తన పద్యగానంతో పౌరాణిక నాటకరంగాన్ని ప్రశాశింపజేసిన ఆణిముత్యాల్లో తెనాలికి చెందిన ‘అభినవ గంధర్వ’ ఆరాధ్యుల వెంకటేశ్వరరావు ఒకరు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు పాత్రలతో అర్ధ శతాబ్దంపాటు నాటక ప్రియులను అలరించిన ‘గానకోకిల’ ఏవీ సుబ్బారావు సుపుత్రుడు వెంకటేశ్వరరావు. డిగ్రీ చదివినా, తండ్రి కళా వారసత్వాన్ని అందుకున్నారు. ఏవీ సుబ్బారావు కళాప్రతిభతో ఒక వెలుగు వెలిగిన శ్రీపూర్ణశ్రీ నాట్య కళాసమితిని చేతబట్టి పద్యనాటకానికి అంకితమయ్యారు. తండ్రి తరహాలోనే శ్రీకృష్ణుడు పాత్రలో రాణించటమే కాకుండా వివిధ పౌరాణిక పాత్రల్లో తనదైన శైలితో వేలాది ప్రదర్శనలు ఇచ్చారు. నాలుగున్నర దశాబ్దాల కాలంలో ఆంధ్ర రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లోని తెలుగువారు సహా ఆయన పద్యగానంలోని మాధుర్యాన్ని తనివితీరా ఆస్వాదించారు. ‘గానకోకిల’ ఏవీ సుబ్బారావు పెద్దకుమారుడు వెంకటేశ్వరరావవు. సొంతూరు తెనాలి సమీపంలోని కొల్లూరు మండల గ్రామం అనంతవరం. తండ్రితోపాటు తెనాలిలోనే స్థిరపడ్డారు. తండ్రి స్ఫూర్తితో హైస్కూలులోనే తొలి వేషం గట్టిన ఈ కళాకారుడు. బీకాం చదువయ్యాక 1979లో పద్యనాటకాన్నే తన కెరీర్‌గా చేసుకున్నారు. శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, అర్జునుడు, భవానీశంకరుడు, వేమారెడ్డి, నక్షత్రకుడు, బాలవర్ధి, చంద్రుడు పాత్రల్లో ప్రతిభను చాటారు. 2023 వరకు 4,371 ప్రదర్శనలు ఇచ్చిన ఘనతను సాధించారు. చింతామణి నాటకంలో ప్రేమ సన్నివేశం, శ్రీకృష్ణ రాయబారంలో పడకసీను, సెంటర్‌సీను, గయోపాఖ్యానం నాటకంలో యుద్ధసీను, చింతామణి పూర్తినాటకం, భవానీశంకరుడు ఏకపాత్ర ఆడియో రికార్డులుగా విడుదలయ్యాయి. గయోపాఖ్యానంలో యుద్ధసీను వీడియో రికార్డుగా వచ్చింది. పౌరాణిక పద్యనాటక కళాసేవకు గుర్తింపుగా 852పైగా సత్కారాలను, గౌరవాలను స్వీకరించారు. 2007–08 నంది నాటకోత్సవాల్లో ఉత్తమ నటుడు, ఉత్తమ సంగీతం, ద్వితీయ ఉత్తమ ప్రదర్శనకు నంది అవార్డులు, బిరుదులను అందుకున్నారు.
1995లో ‘తానా’ ఆహ్వానంపై ఉత్తర అమెరికాలో అనేకచోట్ల నాటక ప్రదర్శనలిచ్చారు. గాయనీమణి పి.సుశీల చేతులమీదుగా బంగారు కంకణం, నెల్లూరులో బంగారు కిరీటం, అక్కినేని నాగేశ్వరరావు చేతులమీదుగా కె.రఘురావుయ్య అవార్డు మరచిపోలేని అనుభూతులుగా వెంకటేశ్వరరావు చెబుతారు. నాటకం ప్రదర్శిస్తుండగా ప్రేక్షకుల నుంచి కానుకల రూపంలో వచ్చిన రూ.4 లక్షలతో ఒక నిధి ఏర్పాటుచేసి నెలకు ఐదుగురు చొప్పున పేదకళాకారులకు రూ.500 వంతున ఆర్ధికసాయం అందజేస్తూ దాతృత్వాన్ని చాటుతున్నారు.
అధ్యాపకుడిగా పనిచేస్తున్న వీరి కుమారుడు నాగరాజు రంగస్థల నటుడిగా రాణిస్తున్నారు. ఏవీ సుబ్బారావు వర్ధంతి రోజైన డిసెంబరు 16న వెంకటేశ్వరరావు, నాటకరంగంలోనే కొనసాగుతున్న ఆయన సోదరులు కోటేశ్వరరావు, ఆదినారాయణ ఏటా భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏవీ సుబ్బారావు పేరిట రాష్ట్రస్థాయి అవార్డును ప్రదానం చేయటమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా గల పలువురు కళాకారులను సత్కరిస్తున్నారు.
తండ్రి ఏవీ సుబ్బారావు కళావారసుడు పౌరాణిక పద్యనాటకానికి అంకితమైన కళాకారుడు నాలుగున్నర దశాబ్దాల్లో నాలుగువేలకు పైగా ప్రదర్శనలు వందలాది సత్కారాలు, బిరుదులు, గౌరవాలు కందుకూరి వీరేశలింగం రాష్ట్ర అవార్డుకు ఎంపిక

‘అభినవ గంధర్వ’ ఆరాధ్యుల వెంకటేశ్వరరావు