● ఆర్డీఓ చంద్రశేఖర నాయుడు ● చీరాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని అధికారులతో సమీక్ష సమావేశం
చీరాల టౌన్: రెవెన్యూ సమస్యల పరిష్కారంలో అశ్రద్ధ వద్దని, వచ్చిన ప్రతి అర్జీని నిశితంగా విచారణ చేయించాలని, విధుల్లో అశ్రద్ధ వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని చీరాల ఆర్డీఓ తూమాటి చంద్రశేఖరనాయుడు సూచించారు. బుధవారం రాత్రి చీరాల ఆర్డీఓ కార్యాలయంలో చీరాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని చీరాల, కారంచేడు, వేటపాలెం, చినగంజాం, అద్దంకి, పంగులూరు, సంతమాగులూరు. ఇంకొల్లు, బల్లికురవ మండలాల తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, రీ సర్వే డీటీలతో రెవెన్యూ సమస్యలు, అర్జీల పెండింగ్‌పై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. డివిజన్ పరిదిలోని మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ సమస్యలు, రీ సర్వే, పీజీఆర్‌ఎస్ అర్జీలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన అర్జీలు, ల్యాండ్ కన్వర్షన్, నీటి తీరువా వసూళ్లపై మాట్లాడి పలు సూచనలు చేశారు. ఆర్డీఓ మాట్లాడుతు....మండలాల వారీగా అర్హుత ఉండి నివేశన స్థలాలు రాని వారి వివరాలను అందించడంతో పాటుగా కావాల్సిన భూమి వివరాలు అందించాలన్నారు. మండలాల్లో నీటి తీరువా వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేసి రైతుల నుంచి విధిగా నీటి తీరువా వసూలు చేయాలన్నారు. రీ సర్వే పకడ్బందీగా చేసి రికార్డుల ప్రకారమే వివరాలు ఆన్‌లైన్ చేయాలన్నారు. రెవెన్యూ సమస్యలను సత్వరం పరిష్కరించాలన్నారు. అర్జీదారులను కార్యాలయాల చుట్ట తిప్పుకోవద్దని ప్రజలకు సత్వరం సేవలందిస్తే మంచి అధికారులుగా గుర్తింపు వస్తుందన్నారు. గ్రామాల వారీగా పెండింగ్‌లో ఉన్న పట్టాదారు పాసు పుస్తకాలను త్వరగా అందించడంతో పాటుగా గ్రామాల్లో ఎక్కడా అనధికార లే అవుట్లు వేయకుండా కట్టడి చేయాలన్నారు. ఓటీసీలను త్వరగా మంజూరు చేయాలన్నారు. సమావేశంలో డివిజనల్ సర్వే ఇన్‌స్పెక్టర్ ముసలయ్య, తహసీల్దార్లు గోపికృష్ణ, పార్వతి, ప్రభాకరరావు, నాగరాజు, రీసర్వే డీటీలు, ఇతర రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.