అద్దంకి రూరల్: కూటమి ప్రభుత్వం ఏర్పడి 11 నెలలైనా కార్మికుల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని రాష్ట్ర ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య అన్నారు. గురువారం స్థానిక రూపేష్ భవనంలో ఎస్‌కె కరిముల్లా అధ్యక్షత ఏఐటీయూసీ జిల్లా సమితి సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్‌లుగా మార్చి కాలరాస్తున్నారన్నారు. అధికారం రాకముందు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును పునరిద్దరిస్తామని హామీ ఇచ్చి అధికారం వచ్చిన తరువాత పట్టించుకోవటం లేదన్నారు. కార్మికుల హక్కుల సాధన కోసం మే 20వ తేదిన సార్వత్రిక సమ్మెను దేశవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈనెల 25న అన్ని యూనియన్‌లతో సన్నాహక సదస్సును విజయవాడలో నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీసీఐ జిల్లా కార్యదర్శి తన్నీరు శింగరకొండ, రాష్ట్ర అంగన్‌వాడీ ప్రధాన కార్యదర్శి జే.లలితమ్మ, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బత్తుల శామ్యేలు, నియోజకవర్గ కార్యదర్శులు ఎస్ శ్రీనివాసులు. డీ.నాగేశ్వరరావు, కెఎల్‌డీ ప్రసాద్, ముస్తాఫా, అంగన్‌వాడీ జిల్లా కన్వీనర్ ఎస్ వాణిశ్రీ, జిల్లా పాఠశాల ఆయా సంఘం కన్వీనర్ సుజాత, కోటేశ్వరరావు, రమణయ్య, మరియబాబు, బాపిపైడయ్య, సీహెచ్ ప్రకాష్, ఎస్తేరు రాణి తదితరులు పాల్గొన్నారు.