
చీరాలలో డ్రోన్‌లతో నిఘా
చీరాల: చీరాల పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు ఒన్‌టౌన్ సీఐ ఎస్.సుబ్బారావు తెలిపారు. గురువారం రాత్రి పట్టణంలోని ప్రధాన ప్రాంతాలలో డ్రోన్‌ల ద్వారా నిఘా ఏర్పాటు చేశారు. నిర్మానుష్య ప్రదేశాలు, బహిరంగ ప్రదేశాల్లో గంజాయి, మద్యం సేవిస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకునే దిశగా నిఘాను మరింత కఠినతరం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజల సహకారం ద్వారా చీరాలలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టూటౌన్ సీఐ నాగభూషణం, పోలీసు సిబ్బంది ఈ ప్రత్యేక నిఘా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇసుక లారీ బీభత్సం
●ఆర్టీసీ బస్సును ఢీకొట్టి షాపుల్లోకి దూసుకెళ్లిన వైనం
● త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
చేబ్రోలు: ప్రమాదవశాత్తూ ఇసుక లారీ ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టి అదుపుతప్పి రోడ్డు పక్కనున్న షాపుల్లోకి దూసుకుపోయిన ఘటన చేబ్రోలు మండలం వేజండ్ల గ్రామంలో గురువారం జరిగింది. తెనాలి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు గుంటూరుకు బయలుదేరి వేజండ్ల అడ్డరోడ్డు వద్ద ప్రయాణికులను ఎక్కించుకోవటం కోసం నిలిచి ఉంది. అదే సమయంలో తెనాలి నుంచి నారా కోడూరు వైపు వేగంగా వస్తున్న టర్బో ఇసుక లారీ ఆర్టీసీ బస్సును వెనుకవైపు ఢీకొట్టింది. వెంటనే అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు, మెకానిక్ షాపులలోకి దూసుకువెళ్లింది. ప్రమాద సమయంలో షాపుల వద్ద ఎవరూ లేకపోవటంతో ప్రాణాపాయం తప్పింది. బస్సులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. చేబ్రోలు పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకొని ఇసుక లారీని, ఆర్టీసీ బస్సును పోలీసు స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చీరాలలో డ్రోన్‌లతో నిఘా