
సోషల్ మీడియా కన్వీనర్‌పై టీడీపీ సానుభూతిపరుల దాడి
బల్లికురవ: బల్లికురవ మండల వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా కన్వీనర్ కొండవద్దు గోపీరాజు యాదవ్‌పై టీడీపీ సానుభూతిపరులు పథకం ప్రకారం దాడి చేశారు. కర్రలతో కొట్టి గాయపరిచారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు మండలంలోని ఉప్పమాగులూరు పంచాయతీలోని సోమవరప్పాడులో రామాలయం వద్ద శ్రీరామనమి పదహారు రోజుల పండుగ వేడుకల్లో పాల్గొనేందుకు గోపిరాజు యాదవ్ గ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో గ్రామానికి వచ్చిన గోపిరాజును కొట్టాలని పథకం వేసుకున్న టీడీపీ సానుభూతిపరులు చావలి నాగేశ్వరరావు, సురేశ్, వెంకటేశ్, రాజమోహన్‌లు కర్రలతో దాడి చేశారు. దాంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, క్షతగాత్రుడిని హుటాహుటిన గుంటుపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. క్షతగాత్రుడిని వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ దేవినేని కృష్ణబాబు పరామర్శించారు. కృష్ణబాబు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా కన్వీనర్‌పై టీడీపీ సానుభూతిపరులు దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. పండుగ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన యువకునిపై కక్ష కట్టి దాడిచేశారన్నారు. గతంలోనూ ఇదే విధంగా అతనిపై దాడి చేశారని చెప్పారు. ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. స్థానిక పోలీసులు సైతం నిందితులకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. అధికారులు పక్షపాత వైఖరి విడనాడాలన్నారు. గ్రామాల్లో ప్రజలు ఐక్యతతో జీవించేలా చూడాలన్నారు.