
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ బాపట్లలో ఆపాలి
బాపట్ల: సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ బాపట్లలో తప్ప అన్ని జిల్లా కేంద్రాల్లో ఆగుతుందని పౌర సమాఖ్య సభ్యుడు కారుమంచి విజయకుమార్ పేర్కొన్నారు. బాపట్లలోని నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం భవనంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో విజయకుమార్ మాట్లాడారు. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ బాపట్ల లో కూడా ఆగేలా చర్యలు తీసుకోవాలని బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్‌ని జూన్ 2024లోనే పౌర సమాఖ్య కోరిన విషయాన్ని గుర్తు చేశారు. ఇదే రైలు చీరాలో నిలుపుదల చేసేందుకు ఎంపీ కృషి చేస్తున్నట్లు వస్తోన్న వార్తలు ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. జిల్లా కేంద్రమైన బాపట్లలో ఆగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బాపట్ల స్టేషన్‌లో మధ్యలో రద్దయిన రైళ్లని పునరుద్ధరించాలని, ఉప్పరపాలెం, కంకటపాలెం గేట్ల వద్ద ఆర్వోబీలుగాని, లేక పరిమిత అండర్ బ్రిడ్జిల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో జమృద్‌బాషా, కందుల రమణకుమార్, జి. వెంకటేశ్వర్లు, పి.సి.సాయిబాబు, తోట రామాంజనేయులు పాల్గొన్నారు.