
పట్టపగలు బస్టాండ్ సెంటర్‌లో నగదు అపహరణ
● రూ. 5 లక్షలున్న బ్యాగ్‌ను ఎత్తుకుపోయిన గుర్తు తెలియని వ్యక్తులు ● డీఎస్సీ మోయిన్ విచారణ
అద్దంకి రూరల్: పట్ట పగలు అందరూ చూస్తుండగానే మెయిన్ సెంటర్ బస్టాండ్ వద్ద రోడ్ పక్కన నిలిపిన బైకు కవర్‌లో నుంచి నగదు బ్యాగ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించి పరారైన సంఘటన బుధవారం అద్దంకిలో కలకలం రేపింది. సీఐ సుబ్బరాజు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బల్లికురవ మండలం కూకట్లపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి వివాహ పనుల నిమిత్తం బుధవారం రూ. 3 లక్షలు తీసుకుని అద్దంకికి వచ్చాడు. దీనికి తోడుగా మరో రూ. 2 లక్షలను బ్యాంకు నుంచి డ్రా చేసి తీసుకున్నాడు. మొత్తం రూ. 5 లక్షలను ఒక బ్యాగ్‌లో పెట్టి బైకు ట్యాంకులో ఉంచి టిఫిన్ చేసేందుకు అద్దంకి బస్టాండ్ సమీపంలోని బండి వద్దకు వచ్చాడు. బైకు దిగి టిఫిన్ చేశాడు. చేతులు కడుక్కనేందుకు పక్కకు తిరిగిన సమయంలో గుర్తు తెలియని యువకుడు వచ్చి బైకు కవర్‌లో ఉన్న నగదును తీసుకున్నాడు. వెంటనే వేరొక యువకుడు బైకు మీద రావడంతో దాన్ని ఎక్కి పరారయ్యాడు.
సమాచారం తెలుసుకున్న డీఎస్పీ మోయిన్ బుధవారం రాత్రి అద్దంకిలోని సంఘటనా స్థలానికి వచ్చి అక్కడి వారిని దొంగతనం జరిగిన తీరును విచారించారు. దొంగలను వెంటనే పట్టుకుంటామని చెప్పారు. నగదు, విలువైన వస్తువులు తీసుకెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ఆయన వెంట సీఐ సుబ్బరాజు, ఎస్‌ఐ రవితేజ, సిబ్బంది ఉన్నారు.