
ప్రధాని సభకు అన్నిఏర్పాట్లు పూర్తి
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): రాజధాని ప్రాంతంలో ప్రధాన మంత్రి నరేంద్ర రానున్న సభకు జిల్లా నుంచి తరలివచ్చే ప్రజానీకానికి ఇబ్బంది లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేపట్టినట్టు రాష్ట్ర రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్‌లో కమిషనరు పులి శ్రీనివాసులు, నగర మేయరు కోవెలమూడి రవీంద్ర, ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, గళ్లా మాధవి, బూర్ల రామాంజనేయులు, తెనాలి శ్రావణ్ కుమార్, అమర్నాథ్ రెడ్డి, ఏలూరు సాంబశివరావు, రాష్ట్ర ఏపీఎంఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, రాష్ట్ర లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావుతో కలసి మే 2వ తేదీన రాజధాని ప్రాంతంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే సభకు జిల్లా నుంచి తరలివచ్చే ప్రజలకు చేపట్టాల్సిన ఏర్పాట్లుపై వివిధ శాఖల అధికారులు, కార్పొరేటర్లు, కూటమి నాయకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజధాని సమీపంలో ఉన్న జిల్లా నుంచే అత్యధికంగా ప్రధాన మంత్రి సభకు ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున అధికారులు అన్నిఏర్పాట్లు చేయాలన్నారు. రవాణా వాహనాలు సమకూర్చేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సభకు నిర్దేశించిన సమయానికి బస్సులు బయలుదేరేలా, సకాలంలో వారికి భోజనాలు, మంచినీరు, మజ్జిగా అందించేలా పూర్తి స్థాయిలో కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ సభకు గుంటూరు పార్లమెంట్ నుంచే దాదాపు 2.25 లక్షల మంది ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నామని, ముఖ్యంగా రాజధాని సమీపంలోని గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, ప్రత్తిపాడు నియోజకవర్గాల నుంచి దాదాపు 90 వేల మంది ప్రజలు రానున్నారన్నారు. డిప్యూటీ మేయర్ సజీలా, అదనపు కమిషనర్ ఓబులేసు, అడిషనల్ ఎస్పీ రమణమూర్తి, డీటీసీ సీతారామిరెడ్డి, ఆర్టీసీ ఆర్‌ఎం కృష్ణ కాంత్, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, మెప్మా పీడీ విజయలక్ష్మి, కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి
బీసీ జనార్థన్‌రెడ్డి