
న్యాయమూర్తుల పరిచయ కార్యక్రమం
గుంటూరులీగల్: గుంటూరు జిల్లా కోర్టులో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి, ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ అండ్ లేబర్ న్యాయమూర్తి బి.రాములు, చైల్డ్ ఫ్రెండ్లీ కోర్ట్ (పోక్సో కోర్టు) న్యాయమూర్తి షమీ పర్వీన్ సుల్తానా బేగంల పరిచయ కార్యక్రమం జిల్లా కోర్టు ప్రాంగణంలో మంగళవారం జరిగింది. కార్యక్రమంలో అన్ని కోర్టుల న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ప్రధాన న్యాయమూర్తి న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడారు. జిల్లా కోర్టులోని వాహనాల పార్కింగ్ వసతులు సక్రమంగా ఉండేలా చర్యలు చేపడతామన్నారు. జిల్లా కోర్టులోని అన్ని కోర్టులకు కావలసిన వసతులను సమకూర్చి, కోర్టులో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో ఉన్న అన్ని కోర్టులకు కావలసిన వసతులను సమకూర్చేందుకు చర్యలు చేపడతామన్నారు. జిల్లా కోర్టులో మహిళా న్యాయవాదులకు బార్ అసోసియేషన్‌లో కావలసిన సౌకర్యాలు సమకూర్చేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. జిల్లా ప్రధానన్యాయమూర్తి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని పురాణం కల్యాణ లేడీ రిప్రజెంటివ్ బార్ అసోసియేషన్‌కు 30 కుర్చీలు అందజేశారు. బార్ కౌన్సిల్ సభ్యుడు వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి 50 కుర్చీలకు కావలసిన నగదు చెక్కును ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యంగళ శెట్టి శివ సూర్యనారాయణకు అందజేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శివసూర్య నారాయణ మాట్లాడుతూ బార్ అండ్ బెంచ్ రిలేషన్‌కు కావలసిన సహాయ సహకారాలు అందించటానికి న్యాయవాదులు తరఫున హామీ ఇచ్చారు.