శ్రమించారు.. విజయం సాధించారు | - | Sakshi
Sakshi News home page

శ్రమించారు.. విజయం సాధించారు

Published Tue, Aug 8 2023 12:22 AM | Last Updated on Tue, Aug 8 2023 7:15 PM

బాలకృష్ణ, నవితలను సత్కరిస్తున్న ములకలపల్లి ఎస్సై సాయికిషోర్‌రెడ్డి - Sakshi

బాలకృష్ణ, నవితలను సత్కరిస్తున్న ములకలపల్లి ఎస్సై సాయికిషోర్‌రెడ్డి

కొత్తగూడెంటౌన్‌: ఎస్‌ఐలుగా ఉద్యోగం సాధించాలని పలువురు యువతీయువకులు కలలుగన్నారు. అహర్నిశలు శ్రమించి విజయం సాధించారు. పేదరికం, సౌకర్యాల లేమి తదితర ఆటంకాలను ఎదుర్కొని విజయతీరాలకు చేరారు. రెండేళ్లపాటు విరామం లేకుండా సన్నద్ధమై ఎస్‌ఐగా ఎంపికై ంది కొత్తగూడెం పోస్టాఫీస్‌ సెంటర్‌ ప్రాంతానికి చెందిన ఓ యువతి.

వీరగోని ఎల్లాగౌడ్‌–శ్రీలత దంపతుల కుమార్తె దివ్యాగౌడ్‌ సివిల్‌ ఎస్సైగా ఉద్యోగం సాధించింది. తండ్రి వాటర్‌ ప్లాంట్‌ వ్యాపారి, తల్లి గృహిణి కాగా అన్న మనోజ్‌ ఆమెరికాలో ఎంఎస్‌ చదువుతున్నారు. బీటెక్‌, ఏంబీఏ పూర్తి చేసిన దివ్య హైదరాబాద్‌లో గ్రూప్‌లో పరీక్షలకు 6 నెలలపాటు కోచింగ్‌ తీసుకుంది. ఎస్‌ఐ నోటిఫికేషన్‌ రావడంతో దరఖాస్తు చేసింది. గతంలో తీసుకున్న కోచింగ్‌ మెటీరియల్‌, దినపత్రికలను చదువుతూ పరీక్షకు సన్నద్ధమైంది. రెండు రోజుల క్రితం వెల్లడైన ఫలితాల్లో ఎస్‌ఐగా ఎంపికై ంది. తల్లిదండ్రులు, సోదరుడి ప్రోత్సాహంతోన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగం సాధించినట్లు దివ్య తెలిపింది.

 ఉపాధ్యాయుడి బిడ్డ..
ఇల్లెందు మండలంలోని సుభాష్‌నగర్‌ గ్రామపంచాయతీకి చెందిన ఐటీడీఏ ఉపాధ్యాయుడు గుమ్మడి పాపయ్య, దివంగత అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలు కళావతి దంపతులకు ముగ్గురు కూతర్లు. పెద్దకుమార్తె అనూష ఎంఫార్మసీ చదవగా రెండో కుమార్తె అపర్ణ ఎంబీఏ, చిన్నకుమార్తె హరిత బీటెక్‌ పూర్తి చేశారు. అనూషకు వివాహం కాగా రెండో కుమార్తె అపర్ణ ఎల్‌ఎల్‌బీ చదువుతోంది. తండ్రి ప్రోత్సాహంతో హరిత గ్రూప్స్‌కు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఎస్సై పరీక్ష రాసి, ఉద్యోగం సాధించింది. ఈ సందర్భంగా సర్పంచ్‌ వల్లాల మంగమ్మ, ఎంపీటీసీ శీలం ఉమ, ఉపసర్పంచ్‌ నాలవెల్లి నర్సింహారావు హర్షం వ్యక్తం చేశారు.

 కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తూనే..
దమ్మపేట మండల పరిధిలోని లచ్చాపురం గ్రామానికి చెందిన గద్దల అశోక్‌కుమార్‌ సివిల్‌ ఎస్సైగా ఎంపికయ్యాడు. పేద కుటుంబంలో జన్మించిన అశోక్‌ బీటెక్‌ పూర్తి చేశాక ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేశాడు. కరోనా కష్టకాలంలో ఉద్యోగం కోల్పోవడంతో ఉపాధి హామీ కూలీగా పనిచేస్తూ, సివిల్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగం పొందాడు. కొత్తగూడెంలో విధులు నిర్వర్తిస్తూనే ఎస్సై ఉద్యోగానికి సన్నద్ధమయ్యాడు. సివిల్‌ ఎస్సైగా ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా అశోక్‌కుమార్‌ను జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, నాయకులు దారా యుగంధర్‌, దారా మల్లిఖార్జురావు, అంకత మహేశ్వరరావు తదితరులు అభినందించారు.

విజేతలకు సన్మానం..
ములకలపల్లి మండలంలోని చాపరాలపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం తురక సీతారాములు, సుజాత దంపతుల కుమారుడు బాలకృష్ణ ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌లో ఎస్సైగా ఎంపికయ్యాడు. ఇతను 2018లో జూనియర్‌ పంచాయతీ సెక్రటరీ, 2020లో సివిల్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలు సాధించాడు. కొత్తగూడెం ఓఎస్‌డీ కార్యాయంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తూ ఎస్‌ఐ పరీక్షకు రాసి అగ్నిమాపక శాఖలో ఎస్సైగా కొలువు సాధించాడు. కాగా మండలంలోని సూరంపాలెం గ్రామానికి చెందిన సాయిన్ని రమణారావు, దుర్గావేణి దంపతుల కుమార్తె నవిత ఎస్‌ఐగా ఎంపికై ంది. బీటెక్‌ పూర్తి చేసిన ఈమె మండలం నుంచి ఎస్‌ఐగా ఎంపికై న తొలి మహిళ. విజేతలను ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో అభినందించారు. పోలీస్‌స్టేషనల్లో ఎస్‌ఐ సాయికిశోర్‌ రెడ్డి, ఏఎస్‌ఐ తిరుమలరావు వీరిని శాలువాతో సత్కరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement