కుంభమేళాకు వెళ్లొచ్చాం.. | - | Sakshi
Sakshi News home page

కుంభమేళాకు వెళ్లొచ్చాం..

Published Sun, Feb 16 2025 12:32 AM | Last Updated on Sun, Feb 16 2025 12:30 AM

కుంభమ

కుంభమేళాకు వెళ్లొచ్చాం..

● ఉమ్మడి జిల్లా నుంచి భారీగా తరలిన భక్తులు ● కుటుంబాలు, కాలనీల వారీగా పయనం ● త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలపై ఆసక్తి ● ఇతర పుణ్యక్షేత్రాల సందర్శన కూడా..

ఖమ్మంగాంధీచౌక్‌/ఇల్లెందు రూరల్‌: ఖగోళశాస్త్రం ప్రకారం సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి నిర్దిష్ట రాశిలోకి వచ్చిన సమయాన కుంభమేళా జరుగుతుంది. ఇలా 144 ఏళ్లకోసారి జరిగే మహా కుంభమేళా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్‌లో గతనెల 13న ప్రారంభమై ఈనెల 26న మహా శివరాత్రి వరకు కొనసాగనుంది. ఈ కుంభమేళాలో కోట్లాది మంది హిందువులు పాల్గొని అక్కడి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ మేరకు రైల్వేశాఖ దేశ నలుమూలల నుంచి ప్రత్యేక రైళ్లు ఏర్పాటుచేయగా.. జిల్లా వాసులు కొందరు రైళ్లలో, మరి కొందరు బస్సులు, కార్లు ఇతర వాహనాల్లో సమూహాలుగా వెళ్తున్నారు. ఖమ్మం నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ 1,226 కి.మీ. దూరంలో ఉండగా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ మీదుగా ఓ మార్గం, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ మీదుగా ఇంకో మార్గంలో వెళ్లి వస్తున్నారు.

ఐదు నుంచి ఏడు రోజులు..

మహా కుంభమేళా యాత్ర పర్యటన ఐదు నుంచి ఏడు రోజుల పాటు కొనసాగుతోంది. కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించాక సమీపంలోని అయోధ్య, నైమిశారణ్యం, కాశీ వంటి క్షేత్రాలను సందర్శిస్తున్నారు. మౌని అమావాస్య, రథసప్తమి, పౌర్ణమి వంటి రోజుల్లో వెళ్లిన వారి యాత్ర అక్కడ రద్దీ కారణంగా మరో ఒకటి, రెండు రోజులు పెరిగింది.

స్లీపర్‌ బస్సులు..

కుంభమేళాకు పలువురు రైలు మార్గం ఎంచుకుంటుండగా.. ఇంకొందరు బస్సులు, కార్లలో వెళ్తున్నారు. మార్గమధ్యలో క్షేత్రాలను చూడొచ్చని, అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకోవచ్చనే భావనతో వాహనాలను ఎంచుకుంటున్నామని చెబుతున్నారు. ట్రావెల్స్‌ నిర్వాహకులు స్లీపర్‌తో పాటు సీటింగ్‌ బస్సులను సమకూరుస్తున్నారు. ఒక్కో బస్సులో 20 నుంచి 30 వరకు స్లీపర్‌ బెర్త్‌లు ఉంటున్నాయి. కాగా, సీటింగ్‌తో కూడిన బస్సులో ఒక్కొక్కరికి రూ.15,500, స్లీపర్‌ బెర్త్‌లు ఉంటే రూ.17,500 చొప్పున చార్జి చేస్తున్నారు. అయోధ్య, కాశీ వంటి ప్రాంతాలకు సైతం వెళ్లి వస్తే ఈ ధర మరింత పెరుగుతోంది.

అయోధ్య, కాశీకి కూడా..

ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్న యాత్రికులు అక్కడి నుంచి సుమారు 120 కి.మీ. దూరంలోనే ఉన్న అయోధ్యలో బాలరాముడిని సైతం దర్శించుకుంటున్నారు. అలాగే, 10 వేల ఆలయాలతో పురాతన నగరంగా విరాజిల్లుతున్న కాశీ, అక్కడి అన్నపూర్ణమ్మ ఆలయం, విశాలాక్షి, కాలభైరవ ఆలయాలను, విశ్వేశ్వర జ్యోతిర్లింగాన్ని సైతం దర్శించుకుని తిరుగుముఖం పడుతున్నారు.

ఆధ్యాత్మిక ఆనందాన్నిచ్చింది

కుంభమేళాకు వెళ్లడం అదృష్టంగా భావిస్తున్నా. కోట్లాది జనం మధ్య ప్రయాణంలో ఇబ్బంది ఎదురైనా భక్తితో త్రివేణి సంగమం వరకు వెళ్లి పుణ్యస్నానాలు ఆచరించాం. అమ్మవారి శక్తిపీఠాన్ని సైతం దర్శించుకోవడంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందా.

– బొంగాని మల్లేశ్వరి, సుభాష్‌నగర్‌, ఇల్లెందు

ప్రత్యేక బస్సులు ఎంచుకుంటున్నారు..

ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాకు వెళ్లేందుకు పలువురు బస్సులు బుక్‌ చేసుకున్నారు. స్లీపర్లు, సీటింగ్‌లతో కూడిన బస్సులకు మంచి డిమాండ్‌ ఉంది. కుంభమేళాతో పాటు ఇతర యాత్రలకు వెళ్లేలా 5 నుంచి 7రోజులకు బస్సులు బుక్‌ అవుతున్నాయి.

– ఎం. శిరీష, ట్రావెల్స్‌ నిర్వాహకురాలు, ఖమ్మం

అరుదైన అవకాశం

మహాకుంభమేళాకు హాజరవడం జీవితంలో అరుదైన అవకాశంగా భావిస్తున్నా. గంగా, యుమున, సరస్వతి నదుల సంగమం చూసేందుకు రెండు కళ్లూ సరిపోలేదు. అక్కడ పుణ్యస్నానం ఆచరించి పూర్వీకుల పేరిట పిండప్రదానం చేశాం.

– వల్లాల నర్సయ్య, సుభాష్‌నగర్‌, ఇల్లెందు

No comments yet. Be the first to comment!
Add a comment
కుంభమేళాకు వెళ్లొచ్చాం..1
1/4

కుంభమేళాకు వెళ్లొచ్చాం..

కుంభమేళాకు వెళ్లొచ్చాం..2
2/4

కుంభమేళాకు వెళ్లొచ్చాం..

కుంభమేళాకు వెళ్లొచ్చాం..3
3/4

కుంభమేళాకు వెళ్లొచ్చాం..

కుంభమేళాకు వెళ్లొచ్చాం..4
4/4

కుంభమేళాకు వెళ్లొచ్చాం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement