ఆశ్రమ పాఠశాలలను బలోపేతం చేస్తాం | - | Sakshi
Sakshi News home page

ఆశ్రమ పాఠశాలలను బలోపేతం చేస్తాం

Published Wed, Feb 19 2025 12:12 AM | Last Updated on Wed, Feb 19 2025 12:10 AM

ఆశ్రమ పాఠశాలలను బలోపేతం చేస్తాం

ఆశ్రమ పాఠశాలలను బలోపేతం చేస్తాం

చండ్రుగొండ : ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలను బలోపేతం చేస్తామని ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌ అన్నారు. స్థానిక బాలికల ఆశ్రమ పాఠశాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆశ్రమ పాఠశాలల్లో మూడు నెలలుగా చేపడుతున్న ఉద్దీపకం కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని తెలిపారు. 3, 4, 5 తరగతుల వారు ఆంగ్లం, గణితంలో పట్టు సాధించేందుకు ఇది ఉపకరిస్తోందన్నారు. ఉపాధ్యాయులు బాధ్యతగా పనిచేయాలని, నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని హెచ్చరించారు. తొలుత తిప్పనపల్లి గిరిజన సంక్షేమ పాఠశాలను సందర్శించిన పీఓ విద్యార్థులతో మాట్లాడారు. కలెక్టర్‌ అంటే ఎవరు.. కలెక్టర్‌ కావాలంటే ఏం చదవాలంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మెనూ సక్రమంగా పాటిస్తున్నారా అని ఆరా తీశారు. వర్షం వస్తే భవనం కురుస్తోందని, మరుగుదొడ్లు భవనానికి దూరంగా ఉన్నాయని, కోతుల బెడద ఉందని ప్రిన్స్‌పాల్‌ సునీత, విద్యార్థినులు చెప్పగా వెంటనే ఈ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఏటీడబ్ల్యూఓ చంద్రమోహన్‌ తదితరులు ఉన్నారు.

సూక్ష్మ పరిశ్రమలపై దృష్టి సారించాలి

భద్రాచలం: సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలతో జీవనోపాధి కలుగుతుందని, వాటిపై గిరిజనులు దృష్టి సారించాలని పీఓ రాహుల్‌ అన్నారు. మంగళవారం ఐటీడీఏ ప్రాంగణంలో ఎంఎస్‌ఎంఈ యూనిట్‌ సభ్యులకు శిక్షణ నిర్వహించగా పీఓ మాట్లాడారు. నిరుద్యోగ యువతకు ఎంఎస్‌ఎంఈ పథకం ద్వారా చిన్న తరహా పరిశ్రమలను సబ్సిడీ ద్వారా అందిస్తామని తెలిపారు. యూనిట్‌ సభ్యులు సమష్టిగా పని చేసి నాణ్యమైన వస్తువులు ఉత్పత్తి చేయాలని సూచించారు. ముడి సరుకును తక్కువ ధరకు కొనుగోలు చేయడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని చెప్పారు. ఈ వస్తువులను ట్రైబల్‌ మ్యూజియం వద్ద విక్రయానికి త్వరలో అనుమతి ఇస్తామని అన్నారు. కార్యక్రమంలో ఏపీఓ జనరల్‌ డేవిడ్‌ రాజ్‌, సీఈఓటీడీ సంస్థ డైరెక్టర్‌ ఉదయ్‌కుమార్‌, శిక్షకుడు విజయ్‌కుమార్‌, జేడీఎం హరికృష్ణ పాల్గొన్నారు

మ్యూజియం ఆధునికీకరణ

మార్చి నాటికి ట్రైబల్‌ మ్యూజియం ఆధునికీకరణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని పీఓ తెలిపారు. మ్యూజియం పనుల పరిశీలన అనంతరం మాట్లాడుతూ.. మ్యూజియం సందర్శనకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ఆయన వెంట ఏటీడీఓ అశోక్‌కుమార్‌, డీఎస్‌ఓ ప్రభాకర్‌రావు, డీఈ హరీష్‌, స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ గోపాలరావు, మ్యూజియం ఇన్‌చార్జ్‌ వీరస్వామి పాల్గొన్నారు.

ఐటీడీఏ పీఓ రాహుల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement